web browser
-
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు గుడ్‌బై
శాన్ ఫ్రాన్సిస్కో: ఒకప్పుడు వెబ్ బ్రౌజర్‌కు పర్యాయపదంగా నిల్చిన మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (ఐఈ) పూర్తిగా కనుమరుగు కానుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్ నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో నెటిజన్లు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో తమ అనుభవాలను ట్విటర్లో (సానుకూలంగాను, ప్రతికూలంగాను) పంచుకున్నారు. అయితే, ఇది ఎకాయెకిన చోటు చేసుకున్న పరిణామం కాదు. 2022 జూన్ 15 నుంచి ఐఈని నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ గతేడాదే ప్రకటించింది. 2015 లో ప్రవేశపెట్టిన కొత్త ఎడ్జ్ బ్రౌజర్‌ను వినియోగించుకోవచ్చని సూచించింది. ‘ఐఈతో పోలిస్తే ఎడ్జ్ మరింత వేగవంతమైన, సురక్షితమైన, ఆధునిక బ్రౌజర్‘ అని 2021 మేలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎంటర్ప్రైజ్ జనరల్ మేనేజర్ షాన్ లిండర్సే ఒక బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. -
ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే లక్షల్లో జీతాలు!
వెబ్సైట్లలో యూజర్ ఇంటరాక్టివిటీకి ప్రాధాన్యం పెరుగుతోంది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్లకు జావాస్క్రిప్ట్‌ను జోడించి గ్రాఫిక్స్, ఇంటరాక్టివిటీతో కూడిన డైనమిక్ వెబ్సైట్లకు ఆదరణ ఎక్కువ. దాంతో ఐటీ రంగంలో.. ముఖ్యంగా వెబ్ డెవలప్మెంట్లో జావాస్క్రిప్ట్ కీలక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా మారుతోంది. చిన్నచిన్న కంపెనీల నుంచి పెద్ద సంస్థల వరకూ.. జావాస్క్రిప్ట్‌ను వినియోగిస్తున్నాయి. దాంతో ఈ టెక్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో.. జావాస్క్రిప్ట్‌తో ప్రయోజనాలు.. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ తీరుతెన్నులు.. నేర్చుకునేందుకు అర్హతలు.. కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... జావాస్క్రిప్ట్ అనేది వెబ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్తోపాటు ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎప్పటికప్పుడు మారుతూ డైనమిక్‌గా ఉండే వెబ్ పేజీలు, యూజర్స్‌తో ఇంటరాక్టివ్‌గా ఉండే వెబ్సైట్లు రూపొందించేందుకు జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తారు. ఇది వెబ్ అప్లికేషన్లు, మొబైల్ అప్లికేషన్లలో ఫ్రంట్ ఎండ్‌లో పనిచేస్తుంది. బ్యాక్ ఎండ్సేవల్లోనూ జావాస్క్రిప్ట్ డెవలపర్‌ది ప్రధాన పాత్ర. డెవలపర్ ఉద్యోగాల్లో మూడో వంతు ఉద్యోగాలు వీరికి సంబంధించినవే ఉంటున్నాయి. కాబట్టి జావాస్క్రిప్ట్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. జావాస్క్రిప్ట్ అంటే జావాస్క్రిప్ట్ అనేది ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్లను రూపొందించడానికి డెవలపర్లు ఉపయోగించే డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెబ్సైట్లలో ఉపయోగించే డ్రాప్‌డౌన్ మెనూ, ఏదైనా బటన్‌ను క్లిక్ చేయడం, పేజీలో రంగును మార్చడం వంటివి జావాస్క్రిప్ట్కు ఉదాహరణలు. జావాస్క్రిప్ట్‌ను వెబ్ అప్లికేషన్లు, గేమ్ డెవలప్మెంట్, గ్రాఫిక్స్‌ను రూపొందించడానికి ఉపయోగించే బహుళార్ధసాధక ప్రోగ్రామింగ్ భాషగా కూడా పేర్కొంటారు. జావాస్క్రిప్ట్‌ను ఒకసారి రాసి.. ఎన్నిసార్లయినా రన్ చేసే వెసులుబాటు ఉంది. అప్లికేషన్స్ జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్: ఆబ్జెక్టులను క్రియేట్ చేయడానికి హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లను ఉపయోగిస్తారు. ఆ ఆబ్జెక్టును ఇంటరాక్టివ్‌గా మార్చడానికి జావాస్క్రిప్ట్ అవసరం ఉంటుంది. ఉదాహరణకు హెచ్టీఎంఎల్తో వెబ్సైట్లో ‘అప్లోడ్ ఫైల్’ కనిపించేలా చేయొచ్చు. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్‌ను అప్లోడ్ చేయడానికి వీలుకల్పించేదే జావాస్క్రిప్ట్. అలాగే ఇమేజెస్, టెక్స్›్ట ఫీల్డ్ తదితర ఫీచర్లను హెచ్టీఎంఎల్తో క్రియేట్ చేసినా.. అవి ఇంటరాక్టివ్‌గా పనిచేయాలంటే.. జావాస్క్రిప్ట్‌ను హెచ్‌టీఎంఎల్ ఫైల్స్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. సీఎస్ఎస్ జావాస్క్రిప్ట్, సీఎస్‌ఎస్‌లను వేర్వేరు విధాలుగా వెబ్‌పేజీలలో ఉపయోగిస్తారు. వెబ్సైట్లో ఆకర్షణీయమైన ఇంటర్ఫేస్ కోసం లే అవుట్‌ను రూపొందించడానికి సీఎస్ఎస్ సహాయపడుతుంది. వెబ్‌పేజీని ఇంటరాక్టివ్‌గా చేసేందుకు జావాస్క్రిప్ట్ ఉపయోగపడుతుంది. ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్కు సంక్షిప్త రూపం..ఏపీఐ. అప్లికేషన్లను కమ్యూనికేట్ చేయడానికి మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఫోన్లో ఏదైనా అప్లికేషన్‌ను ఓపెన్ చేసినప్పుడు ఫోన్ నుంచి సర్వర్‌కు డేటా వెళ్లడం, కావాల్సిన సమాచారంతో డేటా మళ్లీ ఫోన్‌కు రావడం ఏపీఐ ద్వారా జరుగుతుంది. జావాస్క్రిప్ట్‌లో ఏపీఐలు సర్వర్, క్లయింట్ మధ్య ఇంటర్ఫేస్ను ఏర్పరుస్తాయి. వెబ్ అడ్మిన్ సూచనల ఆధారంగా పేజీని యాక్సెస్ చేయడానికి ఏపీఐలు, వినియోగదారులను అనుమతిస్తాయి. ∙యూజర్‌కు కనిపించే ఫ్రంట్ ఎండ్తోపాటు, బ్యాక్ ఎండ్‌లోనూ నోడ్జేఎస్తో జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తారు. వీటిద్వారా డెవలపర్లు డేటాబేస్ నుంచి డేటాను తిరిగి పొందవచ్చు, సేవ్ చేయవచ్చు. అంతేకాకుండా పేమెంట్లు చేయడం, సోషల్ మీడియా పోస్ట్‌లను సేవ్ చేయడం వంటివీ చేయొచ్చు. వెబ్పేజీల్లో అపరిమితమైన ఫంక్షన్ల ద్వారా జావాస్క్రిప్ట్ భాషను ఉపయోగిస్తారు. వెబ్ పేజీలలో జావాస్క్రిప్ట్ ► మౌస్తో కదిలించినప్పుడు, క్లిక్ చేసినప్పుడు వచ్చే మార్పులు. ► పేజీలో హెచ్‌టీఎంఎల్ కంటెంట్ కలపడం, మార్చడం లేదా తీసివేయడం. ► టైపింగ్ చేస్తున్నప్పుడు జరిగే మార్పులు. ► ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం. ► కాచీలో డేటా నిల్వచేయడం. ► వెబ్సైట్ వీక్షకులతో ఇంటరాక్షన్, సందేశాలు పంపడం. ► మొబైల్ అప్లికేషన్లు, ఆన్లైన్ గేమ్‌లను రూపొందించడానికీ జావాస్క్రిప్ట్ ఉపయోగిస్తున్నారు. బ్రౌజర్ ఏదైనా ఇటీవల కాలంలో జావాస్క్రిప్ట్‌ను చాలా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనవల్ల వినియోగదారుడు వెబ్సైట్లో ఏదైనా క్లిక్ చేయగానే వేగంగా ప్రాసెస్ అవుతుంది. లోపాలు, బగ్‌ల ఆధారంగా పరీక్షించడం, సవరించడం జావాస్క్రిప్ట్‌తో సులభం. ఏ బ్రౌజర్ అయినా జావాస్క్రిప్ట్ కోడ్‌ను రన్ చేస్తుంది. ఎలా పని చేస్తుంది వెబ్ బ్రౌజర్లలో జావాస్క్రిప్ట్, ఇతర కోడ్లను అనువదించే ఇంజన్లు ఉంటాయి. అవి జావాస్క్రిప్ట్లోని కమాండ్స్‌కు అనుగుణంగా డైనమిక్ చర్యలకు దోహదపడతాయి. బాగా రాసిన, ఆప్టిమైజ్ చేసిన కోడ్ ..వెబ్‌పేజీలను సమర్ధవంతంగా ఓపెన్ చే స్తుంది. సరిగ్గా లేని ఆదేశాలతో కూడిన జావాస్క్రిప్ట్ యూజర్ బ్రౌజర్‌ను నెమ్మదించేలా చేస్తుంది. ఎవరు నేర్చుకోవచ్చు వెబ్డెవలప్మెంట్పై ఆసక్తి ఉన్నవారు ముందుగా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నేర్చుకొని.. ఆ తర్వాత జావాస్క్రిప్ట్‌పై దృష్టిసారించాలి. ఆన్‌లైన్‌లోనూ అనేక ఉచిత మెటీరియల్, ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి. జావాస్క్రిప్ట్ కమాండ్స్(ఆదేశాలు) ఇంగ్లిష్ మాదిరిగా ఉండటం వల్ల దీన్ని నేర్చుకోవడం సులభం. జావాస్క్రిప్ట్‌లో ప్రాథమిక నైపుణ్యాలపై పట్టు లభించిన తర్వాత.. ప్రోగ్రామింగ్‌లో కెరీర్ ప్రారంభించొచ్చు. జావాస్క్రిప్ట్ స్టడీ గ్రూప్‌లలో చేరడం ద్వారా సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. కెరీర్ అవకాశాలు జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం సొంతం చేసుకుంటే.. లక్షల్లో వేతనాలు పొందొచ్చు. అన్ని కంపెనీల్లో జావాస్క్రిప్ట్ వినియోగం పెరగడం వల్ల రానున్న రోజుల్లో జావాస్క్రిప్ట్ డెవలపర్లకు మరింత డిమాండ్ పెరగనుంది. నిపుణులైన జావాస్క్రిప్ట్ డెవలపర్లను చాలా కంపెనీలు ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్, వెబ్ అప్లికేషన్ డెవలపర్, జావాస్క్రిప్ట్ డెవలపర్, యూఎక్స్ డెవలపర్, వెబ్ డిజైనర్, యూఐ డిజైనర్, ఫుల్ స్టాక్ డెవలపర్, డెవ్‌ఓప్స్ ఇంజనీర్లుగా నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా ఫ్రీలాన్సింగ్ ద్వారా డెవలపర్లుగా పనిచేయొచ్చు. -
గూగుల్ దెబ్బ.. ఆ బ్రౌజర్‌కు ఘోరంగా తగ్గిన యూజర్లు
వెబ్ బ్రౌజర్‌గా ఒకప్పుడు ఊపుఊపిన మోజిల్లా ఫైర్ఫాక్స్.. కాలక్రమంలో తన యూజర్లను కోల్పోతోంది. గడిచిన 3 ఏళ్ల కాలంలో 46 మిలియన్ల మంది యూజర్లు.. మోజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌కు దూరం అయినట్లు రెడ్డిట్‌లో ఓ పబ్లిక్ డేటా రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. 2002లో విడుదలైన మోజిల్లా ఫైర్ఫాక్స్.. వెబ్ బ్రౌజర్ యూజర్లను ఆకట్టుకోవడంతో అనతి కాలంలో విశేష ఆధారణ లభించింది. ముఖ్యంగా థర్డ్ వెర్షన్‌ను రిలీజ్ చేసిన ఒక్కరోజులోనే సుమారు 8 మిలియన్లు పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. కానీ, అప్రతిహితంగా కొనసాగుతూ వచ్చిన ఫైర్ఫాక్స్ ఉనికికి.. గూగుల్ 2008లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ తీసుకొచ్చి బ్రేకులు వేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ బ్రౌజర్ ఇన్ బిల్ట్‌గా రావడం, ఎక్కువ సంఖ్యలో వెబ్సైట్లు గూగుల్ క్రోమ్‌కు అప్టిమైజ్ కావడం, అదే టైంలో ఫైర్ఫాక్స్ బ్రౌజర్ నెమ్మదించడం లాంటి కారణాలతో క్రోమ్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. పబ్లిక్ డేటా రిపోర్ట్ ప్రకారం.. 2018లో మోజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ యూజర్లు 244 మిలియన్ల మంది.. 2021 నాటికి ఆ సంఖ్య 198 మిలియన్ యూజర్లకు పడిపోయింది. అయితే మరో బ్రౌజర్ ఏదీ గూగుల్ క్రోమ్‌కి ప్రత్యామ్నాయంగా లేకపోవడంతో రెండో స్థానంలో మోజిల్లా ఫైర్ఫాక్స్ కొనసాగుతోందని టెక్ గురూస్ అంచనా వేస్తున్నారు. ఇక ఒకప్పుడు పాపులర్ బ్రౌజర్‌గా ఉన్న మోజిల్లా ఫైర్ఫాక్స్కు ఆదరణ తగ్గడానికి కారణం దాని పనితీరేనని అంచనా వేస్తున్నారు. మోజిల్లా అప్ డేట్ల గురించి ఫిర్యాదులతో పాటు యూజర్ ఇంటర్ ఫేస్ వెర్షన్ (యూఐ) ఫైర్ఫాక్స్ 89 కూడా ఆకట్టుకోలేక పోయింది. -
క్రోమ్ ఆప్స్...సోషల్ ట్రిక్స్
మనం వాడే వెబ్ బ్రౌజర్ ను బట్టి మన మనస్తత్వాన్ని అంచనా వేసే ప్రపంచం ఇది... ఎందుకంటే.. దాన్ని బట్టే మనం ఎంత సౌకర్యవంతంగా బతకగలమో తెలిసిపోతుంది కాబట్టి. అవకాశాలున్నప్పుడు వాటిని వాడుకొనే నేర్పు ఎంతుందో అర్థమవుతుంది కాబట్టి! మరి ఇటువంటి సమయంలో అందిపుచ్చుకొనే ఉత్సాహం ఉండాలి కానీ.. వెబ్ విహారానికి ఎన్నోసరికొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫీచర్లను వాడుకొంటూ చేసే వెబ్ బ్రౌజింగే అద్భుతమైన ఫీలింగ్‌ను అందిస్తుంది. సౌకర్యాలను వాడుకోవడం మనల్ని ప్రత్యేకమైన వాళ్లమనే గుర్తింపును తెస్తుంది. టెక్శావీలనే పేరును తెచ్చిపెడుతుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ఎక్స్‌టెన్షన్‌లుగా అందుబాటులో ఉన్న అలాంటి ఫీచర్లు ఇవి! ఇన్‌స్టాగ్రమ్ ఫర్ క్రోమ్: ఫాస్ట్, బ్యూటీఫుల్ అండ్ ఫన్... ఇది ఇన్‌స్టాగ్రమ్ ట్యాగ్‌లైన్. మరి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ను కేవలం స్మార్ట్‌ఫోన్‌కు మాత్రమే కాకుండా మీ పీసీ ద్వారా పంచుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ క్రోమ్ఎక్స్టెన్షన్. ఇన్‌స్టాగ్రమ్‌లో ఫ్రెండ్స్ పోస్టు చేసే ఫోటోలను బ్రౌజ్ చేయడానికి, లైక్, కామెంట్లు పెట్టడానికి ఈ ఎక్స్టెన్షన్ ద్వారా అవకాశం ఉంటుంది. లాస్ట్‌పాస్: తికమక పెట్టే గ్రామర్‌ను ఉపయోగించి ఎంత స్ట్రాంగ్పాస్వర్డ్ తయారు చేసుకొంటే మీ సోషల్నెట్వర్కింగ్ సైట్ అకౌంట్స్ అంత సేఫ్‌గా ఉన్నట్టని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మనం ఇప్పటికీ మొబైల్ నంబర్‌నో, ఇంట్లో వాళ్ల పేర్లనో సోషల్సైట్ల పాస్‌వర్డ్స్‌గా పెట్టుకొంటాం. అంతకు మించి ఆలోచించి మనకోసం అంత ఈజీగా బ్రేక్ కావడానికి అవకాశం లేని పాస్‌వర్డ్స్‌ను తయారు చేసి అందిస్తుంది ఈ ఎక్స్టెన్షన్. టంబ్లర్ కోసం ‘పోస్ట్ టు టంబ్లర్’: మీకు బ్లాగింగ్సైట్ టంబ్లర్లో అకౌంట్ ఉందా? అక్కడ తరచూ మీరు ఫీచర్స్ పోస్టు చేస్తూ ఉంటారా.. అలాంటి బ్లాగర్లకు అవసరం ఈ ఎక్స్టెన్షన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొంటే... ఏదైనా వెబ్పేజ్లోని కంటెంట్‌ను ఒకే క్లిక్‌తో టంబల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవర్‌నోట్ వెబ్ క్లిప్పర్: ‘ఎవర్‌నోట్’ అప్లికేషన్‌తో ఉండే సదుపాయాలు ఏమిటో ఐఫోన్ ను వాడే వారికి బాగా అనుభవం. నిజంగా అది ఒక అద్భుతమైన అప్లికేషన్ అంటూ తేల్చేస్తారు వాళ్లు. మరి అలాంటి యాప్‌ను పీసీ ద్వారా వాడటానికి అవకాశం ఇస్తుంది ఎవర్‌నోట్ వెబ్ క్లిప్పర్ ఎక్స్టెన్షన్. వెబ్ బ్రౌజింగ్సమయంలో టెక్ట్స్, లింక్, ఇమేజ్‌లను ఎవర్‌నోట్ అకౌంట్లోకి సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ డాటాను ఎప్పుడైనా, ఎక్కడ నుంచినైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. యాడ్‌బ్లాక్ ప్లస్: సిస్టమ్ వైరస్ బారినపడ్డప్పుడు, మాల్వేర్ అటాక్ అయినప్పుడు చాలా ఇబ్బందులే ఉంటాయి. వెబ్ బ్రౌజింగ్ విషయంలో అవాంతరాలను కల్పిస్తూ అనేక యాడ్ పేజెస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. మౌస్తో క్లిక్ మనిపించినప్పుడల్లా ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతూ చిరాకు పెడుతుంటుంది. మరి అలాంటి సందర్భాల్లో వాటిని బ్లాక్ చేయడానికి అవకాశం ఇస్తుంది ఈ ఎక్స్టెన్షన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ విసిగించే సైట్ల యూఆర్ఎల్ను సేవ్ చేశాం అంటే... వాటి తలనొప్పి ఇక ఉండదు. శాశ్వతంగా బ్లాక్ అయిపోతాయి. బఫర్: సోషల్నెట్వర్కింగ్ సైట్లలో పోస్టులను షెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఎక్స్‌టెన్షన్‌తో. పోస్టును అంతా సెట్ చేసి అది ఫలానా టైమ్‌లో పబ్లిష్ అయ్యే విధంగా షెడ్యూల్ చేయవచ్చు దీని సాయంతో. ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసిన క్రోబ్ బ్రౌజర్ నుంచి ట్విటర్, ఫేస్బుక్ ఇతర సైట్ల ను ఆపరేట్ చేసేటప్పుడు అలా షెడ్యూల్ చేసుకొనే ఆప్షన్ వస్తుంది. అన్‌ఫ్రెండ్ నోటిఫికేషన్: ఫేస్బుక్లో మన స్నేహితులకు సంబంధించిన అప్డేట్స్ నోటిఫికేషన్స్గా వస్తూ ఉంటాయి. అయితే ఎవరైనా మనల్ని అన్‌ఫ్రెండ్ చేస్తే మాత్రం అప్డేట్ ఉండదు. ఎందుకో ఫేస్బుక్ నిర్వాహకులు ఆన్ఫ్రెండ్ నోటిఫికేషన్స్గానీ అందుకు సంబంధించిన అప్డేట్స్గానీ పెట్టలేదు. అయితే ఈ లోటును తీరుస్తుంది అన్ఫ్రెండ్నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొంటే ఫ్రెండ్స్ జాబితా నుంచి ఎవరు జారిపోతున్నారు తెలుసుకోవచ్చు! హోవర్ జూమ్.. కొన్ని వెబ్సైట్లలో ఏదైనా ప్రోడక్ట్ కు సంబంధించిన ఫోటోలపై మౌస్ పాయింటర్‌ను పెడితే ఆ ఇమేజ్ జూమ్‌లో కనిపిస్తుంది. రెజల్యూషన్ బాగా ఉంటే ఆ ఫోటోలను హోవర్జూమ్ ద్వారా తీక్షణంగా చూడటానికి అవకాశం ఉంటుంది. మరి అన్ని సైట్లలోనూ అలాంటి అనుభవం కావాలంటే హోవర్జూమ్ను ఇన్స్టాల్ చేసుకోవడమే. ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్టాల్ చేసుకొంటే వివిధ సోషల్నెట్వర్కింగ్ సైట్లలోని ఫోటోలు పాయింట్‌ను పెట్టగానే జూమ్‌లో కనిపిస్తాయి. -
గూగుల్ క్రోమ్ గమ్మత్తులు...
వెబ్ విహారానికి ఒక వండర్ఫుల్ విమానం లాంటిది గూగుల్ క్రోమ్. అన్ని వెబ్బ్రౌజర్ల కన్నా బెటర్‌మెంట్‌గా ప్రారంభం అయ్యి ఇప్పుడు బెస్ట్ అనిపించుకొంటున్న క్రోమ్‌లో ఉపయోగించుకోవాలి కానీ ఎన్నో గమ్మత్తై సేవలున్నాయి. వాటిని వినియోగించుకొంటే ఇప్పటి వరకూ క్రోమ్మీదున్న అభిమానం రెట్టింపు అవుతుంది! అలాంటి వాటిలో కొన్ని... mxHeroతో మంచి సదుపాయాలు! క్రోమ్‌కు ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్టాల్ చేసుకొని వెబ్‌బ్రౌజింగ్ ప్రారంభించేస్తే ఎన్నో కొత్త అనుభవాలు సొంతం అవుతాయి. ముందుగా ఎమ్ఎక్స్హీరో ఇన్స్టాల్ అయ్యి ఉన్న బ్రౌజర్‌తో జీమెయిల్లోకి లాగిన్ అయితే... మెయిల్స్ పంపుకోవడం చాలా సదుపాయం అవుతుంది. దీన్ని వల్ల జీమెయిల్లో ‘సెండ్లేటర్’ అనే అప్షన్ వస్తుంది. ఫలితంగా ముందుగా మెయిల్‌ను కంపోజ్ చేసి, దాన్ని తర్వాత పంపేవిధంగా టైమ్‌ను సెట్ చేసుకోవచ్చు. మరి ఒక విధంగా ఈ ఆప్షన్ వరమే! మామూలుగా జీమెయిల్ లో ఒకేసారి ఎక్కుమంది ఒక మెయిల్‌ను పంపితే... ఆ రెసిపెంట్స్ పేర్లు అందరికీ వెళతాయి. మనం ఎంతమందికి ఆ మెయిల్ పంపామో ఆ వివరాలు అందరికీ చేరిపోతాయి. ఒక విధంగా అది అసౌకర్యమే. అలాంటి అసౌకర్యాన్ని నిరోధించే సదుపాయం కూడా ఈ ఎక్స్టెన్షన్టూల్తో సొంతం చేసుకో వచ్చు. అలాగే REPLY TIMEOUT, TOTAL TRACK,SELF DESTRUCT వంటి అప్షన్లు కూడా తెచ్చిపెడుతుంది ఈ ఎక్స్టెన్షన్. rapportive for chrome.. ఒక ప్రొఫైల్ డైరీ... జీమెయిల్ బ్రౌజింగ్ ను మరింత సౌకర్యవంతంగా తయారు చేసేది ఈ ఎక్స్టెన్షన్. జీమెయిల్ ఫ్రెండ్స్‌కు సంబంధించి వివరాలను ఒక పద్ధతిలో అమర్చి పెడుతుంది ఇది. ఒక కాంటాక్ట్‌కు సంబంధించి అతడి ప్రొఫైల్ పిక్చర్, జీమెయిల్ఐడీ, ఫేస్బుక్ ఐడి, స్కైప్ ఐడీ ఇంకా అందులో ఉంటే వెబ్సైట్ నుంచి ఫోన్ నంబర్వరకూ అన్ని వివరాలను ఒక క్రమంలో అందుబాటులో ఉంటాయి. సాధారణంగా స్మార్ట్ఫోన్లలో ఉండే ఈ సదుపాయాన్ని మీ కంప్యూటర్ సిస్టమ్ కు కూడా అందిస్తుంది rapportive. -
యూట్యూబ్ వెబ్ బ్రౌజర్ హ్యాకింగ్.. మళ్లీ ప్రత్యక్షం
కోరుకున్న వీడియోలను క్షణంలో అందించే యూట్యూబ్ వెబ్ బ్రౌజర్ హ్యాకింగ్ దాడికి గురైంది. డెస్క్ టాప్ సిస్టంల నుంచి దాన్ని బ్రౌజ్ చేద్దామనుకునేవారికి ఓ షాకింగ్ సందేశం కనపడుతోంది. 500 ఇంటర్నల్ సెర్వర్ ఎర్రర్ అనే శీర్షికతో భారీ కోడ్ ఒకటి దర్శనం ఇస్తోంది. ఏదో తప్పు జరిగిపోయిందని, బాగా శిక్షణ పొందిన కోతుల బృందం ఒకదాన్ని ఈ పరిస్థితిని సరిదిద్దడానికి నియమించామని అందులో పేర్కొన్నారు. వాళ్లు ఎవరైనా మీకు కనిపిస్తే, వాళ్లకు ఈ సమాచారం చూపించాలంటూ పెద్ద కోడ్ ఒకదాన్ని అక్కడ పోస్ట్ చేశారు. దీంతో తమ ఫేవరెట్ వీడియోలు చూడాలనుకునేవారికి కాసేపు నిరాశ ఎదురైంది. అయితే, ఇది హ్యాకింగ్ కాదని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అంటోంది. ''యూట్యూబ్‌తో మీలో చాలామందికి ఈరోజు సమస్యలు ఎదురై ఉండొచ్చు. మా ఇంజనీర్లు చాలా వేగంగా పనిచేసి దాన్ని సరిచేశారు. కొందరు యూజర్లకు సమస్యలు వచ్చాయి. మామూలు కన్నా చాలా నెమ్మదిగా యూట్యూబ్ వచ్చింది. ఇది కూడా కొన్ని నిమిషాల పాటు ఉంది. యూజర్లకు దీనివల్ల కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యులం'' అని గూగుల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.