యూట్యూబ్ వెబ్ బ్రౌజర్ హ్యాకింగ్.. మళ్లీ ప్రత్యక్షం
కోరుకున్న వీడియోలను క్షణంలో అందించే యూట్యూబ్ వెబ్ బ్రౌజర్ హ్యాకింగ్ దాడికి గురైంది. డెస్క్ టాప్ సిస్టంల నుంచి దాన్ని బ్రౌజ్ చేద్దామనుకునేవారికి ఓ షాకింగ్ సందేశం కనపడుతోంది. 500 ఇంటర్నల్ సెర్వర్ ఎర్రర్ అనే శీర్షికతో భారీ కోడ్ ఒకటి దర్శనం ఇస్తోంది. ఏదో తప్పు జరిగిపోయిందని, బాగా శిక్షణ పొందిన కోతుల బృందం ఒకదాన్ని ఈ పరిస్థితిని సరిదిద్దడానికి నియమించామని అందులో పేర్కొన్నారు. వాళ్లు ఎవరైనా మీకు కనిపిస్తే, వాళ్లకు ఈ సమాచారం చూపించాలంటూ పెద్ద కోడ్ ఒకదాన్ని అక్కడ పోస్ట్ చేశారు. దీంతో తమ ఫేవరెట్ వీడియోలు చూడాలనుకునేవారికి కాసేపు నిరాశ ఎదురైంది.
అయితే, ఇది హ్యాకింగ్ కాదని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ అంటోంది. ''యూట్యూబ్తో మీలో చాలామందికి ఈరోజు సమస్యలు ఎదురై ఉండొచ్చు. మా ఇంజనీర్లు చాలా వేగంగా పనిచేసి దాన్ని సరిచేశారు. కొందరు యూజర్లకు సమస్యలు వచ్చాయి. మామూలు కన్నా చాలా నెమ్మదిగా యూట్యూబ్ వచ్చింది. ఇది కూడా కొన్ని నిమిషాల పాటు ఉంది. యూజర్లకు దీనివల్ల కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యులం'' అని గూగుల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.