వలస పేరును చెరిపేద్దాం | Special plan for industrial growth | Sakshi
Sakshi News home page

వలస పేరును చెరిపేద్దాం

Published Sat, Aug 16 2014 2:33 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

వలస పేరును చెరిపేద్దాం - Sakshi

వలస పేరును చెరిపేద్దాం

అభివృద్ధిలో భాగస్వాములు కండి
పాలమూరు ప్రాజెక్టులకు పెద్దపీట
పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక
మారుమూల పల్లెలకు ఐటీ సేవలు
తాగునీటి అవసరాలు తీర్చేందుకు గ్రిడ్
నవంబర్ నుంచి పెంచిన పింఛన్లు
స్వాతంత్య్రదిన వేడుకల్లో మంత్రి కేటీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్/పాలమూరు: ఎంతోమంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన ప్రత్యేక రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటుపడదామని రాష్ట్ర పంచాయతీరాజ్, సమాచార సాంకేతికశాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పాలమూరు పేరు వినగానే ప్రతిఒక్కరికీ వలసలు గుర్తుకొస్తుంటాయని, ఇక నుంచి ఆ ముద్రను చెరపడం కోసం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా ప్రగతికి అధికారులు సమష్టిగా కృషిచేయాలని కోరారు.

68వ స్వాతంత్య్ర దినవేడుకలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయజెండాను ఆవి ష్కరించిన అనంతరం మంత్రి కేటీఆర్ జిల్లా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలకిచ్చిన హామీలను అమలుచేసేందుకు ప్రజాసంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకే ఈనెల 19న సమగ్ర కుటుంబసర్వేను చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను మంత్రి కోరారు.
 
వలసలకు స్వస్తి చెబుతాం
పాలమూరు పేరు వినగానే ప్రతిఒక్కరికీ వలసలు గుర్తుకొస్తుంటాయి. ఇక నుంచి వాటి ముద్ర చెరపడం కోసం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే జిల్లాలో 30,097 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అదనంగా మరో రెండు మెగా పరిశ్రమలు, 78 చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రతిపాదనలు వచ్చాయని వీటి ద్వారా 73,800 మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే జిల్లాలో ఐటీరంగాన్ని కూడా విస్తరించనున్నట్లు మంత్రి వివరించారు. ఐటీ సాంకేతిక ఫలాలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వ సేవలను మరింత మెరుగ్గా ప్రజలకు చేరువ చేసేందుకు ఈ- పంచాయితీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ‘తెలంగాణ హరితహారం’ పేరిట ప్రతి నియోజకవర్గంలో 40లక్షల మొక్కల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలని నిర్ణయించామని, అందులో భాగంగానే జిల్లాలో 6.20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు మంత్రి వెల్లడించారు.
 
సాగు,తాగునీటికి ప్రాధాన్యం
మహబూబ్‌నగర్ జిల్లాలో తాగు, సాగునీటికి అధికప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని వివరించారు. సురక్షిత తాగునీటి కోసం జిల్లాలో 792 సింగిల్ విలేజ్ స్కీమ్‌లకు రూ.57.48 కోట్లతో చేపట్టిన 213 పనులు పూర్తయ్యాయని, 48 సమగ్ర మంచినీటి పథకాలను 927 నివాస ప్రాంతాల్లో రూ.767 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4 మంచినీటి గ్రిడ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, అందులో మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా గ్రిడ్ ఏర్పాటుచేసి 5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
   
బీడుభూములను సాగునీరు అందించేందుకు చేపట్టిన మహాత్మాగాంధీ, కోయిల్‌సాగర్, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా వంటి భారీ ఎత్తిపోతల పథకాలను చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఎత్తిపోతల పనులు దాదాపు 80శాతం అయ్యాయని, మిగతా 20శాతం పనులు త్వరతగతిన పూర్తిచేసి ఆయకట్టు రైతాంగానికి నీరందిస్తామని చెప్పారు. అలాగే జిల్లాలోని 6055 చిన్న, పెద్ద చెరువుల ద్వారా దాదాపు 2.60 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. గ్రామీణ విత్తనోత్పత్తి, నూనె గింజల అభివృద్ధి, ఆర్‌కేవీవై, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాలను అమలుచేసేందుకు ఈఏడాది రూ.1,659 లక్షలు కేటాయించినట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 2,21,938 వ్యవసాయ కనెక్షన్లకు గాను 2,19,841 కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 15 కొత్త సబ్‌స్టేషన్లను ఏర్పాటుచేస్తామన్నారు.
 
జిల్లా ప్రణాళికకు రూ.2776 కోట్లు

బీఆర్‌జీఎఫ్ ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరానికి 3,701 పనులను రూ.3,847 లక్షల అంచనాలతో జిల్లా ప్రణాళిక కమిటీ ద్వారా ఆమోదించి ప్రభుత్వానికి నివేదించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమంలో జిల్లాలోని 1331 పంచాయతీల్లో రూ.2776 కోట్ల అంచనాతో 9484 పనులు, 64 మండలాల్లో రూ.2028 కోట్ల అంచనా వ్యయంతో 640 పనులు, జిల్లాలో 50 పనులు రూ.2400 కోట్ల అంచనా వ్యయంతో గుర్తించినట్లు చెప్పారు. ‘మన ఊరు.. మన దవాఖానా’ ద్వారా 93,085 మంది రోగులు, 74,475 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు.

జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా 2014-15 ఇప్పటివరకు రూ.110 కోట్లతో 2,53,706 కుటుంబాల్లో 4,31,238 మంది కూలీలకు ఉపాధి క్పలించామని, 2014-15 సంవత్సరానికి 25,100 సంఘాలకు రూ.697.58 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటివరకు 3,617 సంఘాలకు రూ.95.19 కోట్లు, స్త్రీ నిధి పథకం ద్వారా 249 గ్రూపులకు రూ.125లక్షల రుణ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.169 లక్షల ఉపకార వేతనాలు మంజూరు చేశామని, పేద దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి ఒక్కొక్కరికీ రూ.50వేల ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ‘కల్యాణ లక్ష్మి’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
 
నవంబర్ నుంచి పింఛన్లు పెంపు
జిల్లాలో మొత్తం 4.65 లక్షలమంది పింఛన్‌దారులకు సామాజిక భద్రత ఫించన్ల ద్వారా ప్రతినెల రూ.13.13 కోట్లు అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వృద్ధులు, వితంతువులకు నెలకు వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్‌ను నవంబర్ నుంచి అందజేస్తామన్నారు.
 
చదువులకు పెద్దపీట
పేద విద్యార్థుల చదువుల భారాన్ని భరించేందుకు ఫాస్ట్ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
 2013-14 పదోతరగతి ఫలితాల్లో 94శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి రూ.25 లక్షలు, కోచ్‌లకు క్రీడాకారులతో సమానంగా నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఎవరెస్టు విజేతలు గిరిజన, దళితబిడ్డలు పూర్ణ, ఆనంద్‌లకు చెరో రూ.25 లక్షల నగదు పారితోషికం అందించినట్లు వివరించారు. అలాగే జిల్లాలో 65 కేజీబీవీలకు ఈ ఏడాది 2014-15లో రూ.4,304లక్షలు కేటాయించినట్లు తెలిపారు. పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.6,518 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.461 లక్షలు, తాగునీటి వసతి కల్పించేందుకు రూ.13 లక్షలు, మరమ్మతుల కోసం రూ.65 లక్షలు మంజూరైనట్లు వివరించారు.
 
అమరుల కుటుంబాలను ఆదుకుంటాం..

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు భూమి, గృహం, వారి పిల్లలకు ఉచితవిద్య, వైద్యం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లను అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలను పెంచడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వనుందని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించామన్నారు.

నిరుద్యోగులకు చేయూత
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన ఖాళీ పోస్టులను క్రమం తప్పకుండా నియామకాలు చేపడతామని, ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపుగా ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చి, సర్టిఫ్టికెట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఎస్పీ డీ నాగేంద్రకుమార్, జేసీ శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్‌ఓ రాంకిషన్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement