ఆమె చేతుల్లో అద్భుతాలు..
ఆమె... ప్రకృతి కళా రూపాలకు జీవాన్ని పోస్తోంది. అరచేతిలో అద్భుతాలు సృష్టిస్తోంది. శారీరక వైకల్యాన్ని అధిగమించి.. ఆశావహ ధృక్పధంతో ముందుకు సాగుతోంది. పెయింట్లు, డిజైన్లతో తన మనసులోని భావాలు ప్రతిబింబింపజేస్తూ.. ప్రతిభను ప్రదర్శిస్తోంది. ఎందరో కళాభిమానుల మనసు దోచుకుంటోంది.
చేతివేళ్ళపై చిత్రలేఖనంతో ఆకట్టుకుంటున్నఆమె పేరు... లంతా నాయకర్. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఇరవై ఆరేళ్ళ ఆ కళాకారిణి.. తన ఎడమ చేతిలో జీవకళ ఉట్టిపడే త్రీడీ కళారూపాలను చిత్రిస్తూ ప్రత్యేతను చాటుతోంది. పుట్టుకతో చెవుడు సంక్రమించినా.. అధైర్య పడని.. ఆ డర్బన్ ఆర్టిస్ట్.. యాక్రిలిక్ రంగులు, జెల్ పెన్ లను ఉపయోగించి పలు చిత్రాలు, ప్రకృతి దృశ్యాలను అరచేతిలో సాక్షాత్కరింపజేస్తోంది.
సీతాకోక చిలుకలు, బాతులు, గొరిల్లాలు వంటి విభిన్న చిత్రాలను గీసేందుకు ప్రత్యేక టెక్నిక్ ఉపయోగించి, నిజంగానే ఆమె చేతులో ఆ జంతువులు నిలబడ్డాయా అన్న సహజత్వాన్ని కల్పిస్తోంది. నీటిలో తేలే చేపలు.. సముద్ర జీవులు నాయకర్ చేతి ఉపతితలంపైనే తేలియాడుతున్న భావన కలుగుతుంది. కొత్త కోణంలో తన ప్రతిభను ప్రదర్శిస్తూ.. ఆమె గీసే చిత్రాలు ఎందరో కళాకారులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.