Wooden toys
-
Meeta Sharma: ఆటలు ఆడు కన్నా
చీప్ ప్లాస్టిక్. చైనా ప్లాస్టిక్. ఇవాళ పిల్లల బొమ్మలు వీటితోనే దొరుకుతున్నాయి. కళాత్మకమైన దేశీయమైన చెక్కతో తయారైన బొమ్మలు పిల్లలకు ఉండాలి అని బొమ్మల కేంద్రం ప్రారంభించింది మీతా శర్మ. హార్వర్డ్‌లో చదువుకున్నా తన ఇద్దరు పిల్లలు ఆడుతున్న బొమ్మలను చూశాక ఆమె ఈ పని మొదలెట్టింది. ఇవాళ నెలకు వెయ్యి అర్డర్లు వస్తున్నాయి. 100 మంది బొమ్మల కళాకారులు ఉపాధి పొందుతున్నారు. పిల్లలు ఆమె బొమ్మలతో చక్కగా ఆడుకుంటున్నారు. ఈసప్ కథల్లో ‘కాకి దప్పిక’ కథ పిల్లలందరికీ చెబుతారు. దప్పికగొన్న కాకి కుండలో నీళ్లను తాగడానికి ప్రయత్నించి, అవి అందకపోతే నాలుగు రాళ్లు జారవిడిచి, నీళ్లు పైకి తేలాక తాగుతుంది. ఆ విధంగా ఆ కథ అవసరం అయినప్పుడు యుక్తిని ఎలా పాటించాలో పిల్లలకు చెబుతుంది. ఈ కథ యూట్యూబ్‌లో వీడియో గా సులభంగా దొరుకుతుంది. కాని మీతా శర్మ తయారు చేసే బొమ్మల్లో ఇదే కథ మొత్తం బుజ్జి బుజ్జి చెక్క బొమ్మల సెట్టుగా దొరుకుతుంది. పిల్లలను ఉద్రేక పరిచే ఆటబొమ్మల కంటే ఇలాంటి బొమ్మలే అవసరం అంటుంది ‘షుమి’ అనే బొమ్మల సంస్థను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్న మీతా శర్మ. కంప్యూటర్ ఇంజనీర్ మీతా శర్మది ఢిల్లీ. అక్కడే ఐఐటీ లో బిటెక్ చేసింది. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది. వివాహం అయ్యాక అమెరికాలోనే జీవితం మొదలెట్టింది. ‘మా పెద్దాడు పుట్టాక అమెరికాలో క్వాలిటీ బొమ్మలు కొనిచ్చాను ఆడుకోవడానికి. అవన్నీ ఎకో ఫ్రెండ్లీ కొయ్యబొమ్మలు. పాడు కావు. హాని చేయవు. 2012 లో అమెరికా వద్దనుకుని ఇండియా వచ్చాక నాకు సమస్య ఎదురైంది. అప్పటికి నా రెండో కొడుక్కి రెండేళ్లు. ఇక్కడ వాడికి ఇద్దామంటే మంచి బొమ్మలే లేవు. అన్నీ ప్లాస్టిక్‌వి లేదా గాడ్జెట్స్, అమెరికన్ కామిక్స్‌లో ఉన్న కేరెక్టర్... ఇవే ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ పిల్లలు నోటిలో పెట్టుకుంటే ప్రమాదం. మన చిన్నప్పుడు చెక్కతో తయారు చేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు ఎంతో బాగుండేవి. అలాంటి బొమ్మలకోసం ఎంత వెతికినా దొరకడం లేదు. కొన్నిచోట్ల సంప్రదాయ బొమ్మలు ఉన్నాయి కాని వాటి మార్కెటింగ్ సరిగా లేదు. అందుకని నాకే ఒక బొమ్మల తయారీ సంస్థ ఎందుకు మొదలెట్టకూడదు అనిపించింది. 2016లో షుమి సంస్థను స్థాపించాను’ అని తెలిపింది మీతా శర్మ. వేప, మామిడి కలపతో ‘నిజానికి సంస్థ స్థాపించడానికి పెట్టుబడి దొరకలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ పిల్లల గేమ్స్ తయారు చేసే సంస్థలనే ప్రోత్సహించేవి. నా దారేమో సంప్రదాయ కలప బొమ్మల దారి. అందుకే సొంత పెట్టుబడితో సంస్థను స్థాపించాను. బొమ్మలు చేసే కళకారులను సంప్రదించి కేవలం వేప, మామిడి కలపతో ముద్దొచ్చే బొమ్మలను ముఖ్యంగా రెండేళ్ల వయసున్న పిల్లల కోసం ఎక్కువ గా ఆ తర్వాత పదేళ్ల లోపున్న పిల్లలకోసం బొమ్మలను తయారు చేయించాను. వాటికి ఉపయోగించే రంగులు కూడా రసాయనాలు లేనివే’ అంది మీతా శర్మ. ఢిల్లీలో తన సంస్థను స్థాపించాక రకరకాల కొయ్యగుర్రాలను, మూడు చక్రాల తోపుడు బండ్లను, బుజ్జి గుడారాలను, పిల్లలు ఆడే వంట సామగ్రిని, వారికి కొద్దిపాటి లెక్కలు నేర్పే ఆట వస్తువులను, కథలను బొమ్మల్లో చెప్పే సెట్లను ఇలా తయారు చేయించింది.‘ఆన్లైన్లో మాకు ఆర్డర్లు వచ్చేవి. చాలామంది తల్లులు ఆ బొమ్మలతో ఐడెంటిఫై అయ్యారు. ఎందుకంటే వారంతా బాల్యంలో అలాంటి బొమ్మలతోనే ఆడారు కనుక. తమ పిల్లలకు సరిగ్గా అలాంటివే దొరకడంతో వారి ఆనందానికి హద్దులు లేవు’ అని చెప్పిందామె. ఇప్పుడు మీతా తయారు చేయిస్తున్న బొమ్మలు అమెరికా, యు.కె, సింగపూర్‌కు కూడా రవాణా అవుతున్నాయి. నెలలో 8000 ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయి. 100 మంది కళాకారులు చేతినిండా పనితో ఉపాధి పొందుతున్నారు. ఆటే పరిశోధన ‘పిల్లల అసలైన పరిశోధన వారు ఆడే ఆటలతోనే మొదలవుతుందని పిల్లల మనస్తత్వ నిపుణులు తెలుపుతారు. పిల్లల్ని పిల్లల్లా ఉంచే ఆటబొమ్మలతో వారిని ఆడనివ్వాలి. హింసాత్మకమైన బొమ్మల నుంచి వారిని దూరం పెట్టాలి. హింసను ప్రేరేపించే గేమ్స్ నుంచి కూడా. పిల్లలు బొమ్మలతో స్నేహం చేసి వాటిని పక్కన పెట్టుకుని భయం లేకుండా నిద్రపోతారు. వారికి బాల్యం నుంచి అలాంటి నిశ్చింతనిచ్చే బొమ్మల వైపుకు నడిపించాలి’ అని సలహా ఇస్తోంది మీతా. ఒక ఉద్యోగిగా కంటే తల్లిగా ప్రయోజనాత్మక అంట్రప్రెన్యూర్‌గా ఆమె ఎక్కువ సంతృప్తిని, గౌరవాన్ని, ఆదాయాన్ని పొందుతోంది. అదీ విజయమేగా. -
Colored Rims: నెస్టింగ్ డాల్స్..బెంగళూరు టు చంఢీగఢ్!
ఒకప్పుడు చదువులు పూర్తయ్యాక గానీ ఉద్యోగాన్వేషణ మొదలయ్యేది కాదు. ఇప్పుడా పరిస్థితులు లేవు. వేగంగా పెరిగిపోతున్న టెక్నాలజీని ఒడిసి పట్టుకుని ఆసక్తి ఉన్న రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తుంటే, మరికొందరు నైపుణ్యాలను ఔపోసన పట్టి ఏకంగా స్టార్టప్‌లతో దూసుకుపోతున్నారు. వాళ్లు నిలదొక్కుకోవడమేగాక, మరికొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మన్‌ప్రీత్ సింగ్, శ్రేయా గుప్తా, శృతి చౌహాన్లు ఈ బాటలోనే నడుస్తూ ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. మన్‌ప్రీత్ సింగ్, శ్రేయా గుప్తా, శృతి చౌహాన్లు భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాజీ తొలి బ్యాచ్ విద్యార్థులు. డిగ్రీ నుంచి మంచి స్నేహంగా మెలిగిన ఈ ముగ్గురు తరువాత ఫ్యాషన్ మేనేజ్ మెంట్లో మాస్టర్స్ పూర్తిచేశారు. మాస్టర్స్ చేసే సమయంలో ‘ముగ్గురం కలిసి కొత్తగా ఏదైనా చేద్దాం. ఉద్యోగాలు కాకుండా మనమే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిద్దాం’ అనుకున్నారు. 2015లో మాస్టర్స్ అయ్యాక ముగ్గురూ మూడు రంగాలను ఎంచుకుని వారి ఉద్యోగాల్లో బిజీ అయిపోయినా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కష్టసుఖాలు పంచుకోవడం మానలేదు వారు. ఈ క్రమంలోనే ఒకరోజు శృతి.. ‘‘హ్యాండ్ మేడ్ మార్కెట్ బావుంది. దీనిలో ఏదైనా కొత్తగా చేద్దాం’’ అని ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనే నేడు ఈ ముగ్గురు స్నేహితుల స్టార్టప్‌కు పునాది. కలర్డ్ రిమ్స్ కాలేజీ రోజుల నుంచి బాటిల్ క్యాప్స్ మీద వివిధ రకాల పెయింటింగ్‌లు వేసి ఆకట్టుకునే శృతి ప్రతిపాదన అందరికి నచ్చింది. దీంతో వినూత్నమైన హ్యాండ్ మేడ్ పెయింటింగ్‌ను కలర్పుల్గా తీసుకువస్తే బావుంటుందని భావించారు. ఈ క్రమంలోనే 2016 బెంగళూరులో ‘కలర్డ్ రిమ్స్’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించి నెస్టింగ్ డాల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు. నెస్టింగ్ డాల్స్ సెట్లో మొత్తం ఆరు బొమ్మలు ఉంటాయి. 17 సెంటీమీటర్ల నుంచి 4.5 సెంటీమీటర్ల మధ్య పరిమాణంలో ఈ డాల్స్ ఉంటాయి. బొమ్మల సైజుతోపాటు బొమ్మల మీద ఉన్న ఆకారాలు మారడం ఈ బొమ్మల ప్రత్యేకత. కలర్డ్ రిమ్స్ టీమ్ వారణాసి, చెన్నైలలో దొరికే బీచ్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేస్తున్నారు. కర్రను సిలిండర్ ఆకారంలోకి మార్చడమే ఈ డాల్స్ తయారీలో ముఖ్యమైన... కష్టమైన పని. బొమ్మ ఆకారం తయారయ్యాక దానిమీద వివిధ రకాల పెయింటింగ్స్‌తో అందంగా తీర్చిదిద్దుతారు. పెయింటింగ్స్‌లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, పాతకాలపు బొమ్మల ప్రతిరూపాలు ఉండేలా పెయింట్ చేస్తారు. కస్టమర్లు ఈ బొమ్మలను ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలనుకున్నప్పుడు వారి అభిరుచి మేరకు, సూచించిన విధంగా వివిధ రూపాలను బొమ్మలపై చిత్రీకరిస్తారు. దీనిలో ముఖ కవళికలు అన్ని స్పష్టంగా ఉండేలా తయారు చే స్తారు. చెక్కబొమ్మల(నెస్టింగ్ డాల్స్) పై రంగురంగుల పెయింటింగ్స్ వేసి దేశంలోని వివిధ విమానాశ్రయాలు, షాప్స్‌లో విక్రయిస్తున్నారు. వీరి బొమ్మలకు మంచి ఆదరణ ఉంది. బెంగళూరు టు చండీగఢ్... విక్రయాలు బాగానే జరుగుతున్నా, తయారీకి అయ్యే ఖర్చు కంటే అమ్మగా వచ్చే ఆదాయం తక్కువగా ఉండడాన్ని ముగ్గురు గమనించారు. దీనిని అధిగమించడానికి 2017లో స్టార్టప్‌ను బెంగళూరు నుంచి చండీగఢ్‌కు మార్చారు. జీఎస్టీ భారం, జీవన వ్యయం, ముడిసరుకు కొనుగోలు ఖర్చులు తగ్గడంతో నెస్టింగ్ డాల్స్ తయారీ భారం తగ్గింది. ప్రస్తుతం ఈ స్టార్టప్‌లో శ్రేయా, మన్‌ప్రీత్‌లు మార్కెటింగ్ మేనేజ్మెంట్ చూసుకొంటుండ గా, శృతి ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. వీళ్ల టీమ్‌లో మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. కొంతమంది కాలేజీ విద్యార్థులు, వికలాంగ కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. కరోనా సమయంలో బాగా పడిపోయిన కలర్డ్ రిమ్స్‌కు, కుటుంబాల్లోని అనుబంధాల థీమ్‌ను జోడించి డాల్స్‌ను రూపొందించడంతో ఎక్కువ మంది ఈ డాల్స్‌కు కనెక్ట్ అయ్యారు. దీంతో ఆన్లైన్ విక్రయాలు పెరిగాయి. కుక్క, పిల్లి, తాబేలు బొమ్మలకు ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. అంతేగాక తమకు ఎంతో ఇష్టమైన వారి ముఖచిత్రాలను బొమ్మలపై చిత్రించి బహుమతి ఇవ్వాలనుకున్న వారు సైతం వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముగ్గురు స్నేహితుల నెస్టింగ్ డాల్స్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. -
అది నా గుర్రం
‘ఛల్ ఛల్ గుర్రం, చలాకీ గుర్రం. రాజు గారి గుర్రం. నేనెక్కితే గుర్రం. మబ్బుల్లో పరుగులెట్టు గుర్రం’ అంటూ కొయ్య గుర్రం మీద ఊగుతూ పాట పాడే బాల్యం ఏమైపోయింది?పిల్లలు తమను తాము జానపద హీరోల్లా కీలుగుర్రం మీద ఆకాశంలో ఎగురుతున్నట్లు ఊహించుకుంటూ ఊగే గుర్రం బొమ్మ ఎక్కడికి పోయింది?ఇంటికి అతిథులుగా వచ్చిన పిల్లల కళ్లు ఆ గుర్రం మీద పడ్డాయంటేచాలు... రయ్యిన వెళ్లి గుర్రమెక్కేస్తారు. ఆ వెంటనే ఆ గుర్రం యజమాని (ఇంటి పిల్లాడు) ‘‘ఇది నా గుర్రం, దిగు’’ అంటూ తోసేసేవాడు. వాళ్లిద్దరికీ నచ్చచెప్పేటప్పటికి పెద్దవాళ్లకు ఒక యుద్ధాన్ని విరమింపచేసి సంధి కుదిర్చినంత పని. ఇప్పుడా ముచ్చట్లు ఎక్కడికి పోయాయి?ఒక తరం మారి కొత్త తరం వచ్చేసరికి గుర్రం బొమ్మ పాత వాసనతో అటకెక్కింది. కొత్త తరం బాల్యం మల్టీ నేషనల్ కంపెనీలు తయారు చేసే ఇంపోర్టెడ్ టాయ్స్ బాట పట్టింది. మన వడ్రంగి చేసే గుర్రంలో ఉండే నేటివిటీని మిస్సయింది. ‘ మా రోజుల్లో కొయ్య గుర్రం బొమ్మలుండేవి. మీ నాన్న కూడా రోజంతా గుర్రం మీదనే ఉండేవాడు’ అని నానమ్మలు చెప్తే అవి ఎలా ఉంటాయో ఈ తరం పిల్లలకు ఊహకందదు. గుర్రం కోసం కామిక్ షోలో లేదా యానిమల్ ప్లానెట్‌లో వెతుక్కోవాల్సిన యానిమేటెడ్ బాల్యం ఈ తరానిది. రాబోయే తరానికి అదీ ఉండదు. ఇంతటి అగత్యం రాకూడదంటాడు నవాబ్ షేక్ మస్తాన్ వలి. ప్రకాశం జిల్లా, చీరాల మండలం దేవాంగపురి పంచాయతీ, పాతగేటు సెంటర్లో ఉండే ఈ వడ్రంగి ఇప్పటికీ గుర్రం బొమ్మలు చేస్తూనే ఉన్నాడు. ‘ఇంకా వీటిని చేయడం ఎందుకు? ఇప్పుడు ఈ బొమ్మలకు మార్కెట్ ఉందా?’ అని ఎవరైనా అడిగితే ‘‘కొనేవాళ్లు తక్కువే. కానీ ఇష్టమైన వాళ్లు కొనుక్కుంటారు. కొనేవాళ్లు తగ్గారని చేయడం మానేస్తే... రాను రాను ఇలాంటి బొమ్మలుండేవన్న సంగతి కూడా తెలియకుండా పోతుంది కదా!’’ అని తిరిగి ప్రశ్నించాడు వంచిన తల ఎత్తకుండానే. అతడిని మాటల్లో పెడితే మెల్లగా వివరాలు చెప్పసాగాడు.‘‘మా తాత చెక్కతో ఏనుగులు, గుర్రాలు చేసేవాడు. ఆయనకు చేతికింద సహాయం చేస్తూ పని నేర్చుకున్నాను. మేము చేసేది చెక్క బొమ్మే అయినా, ప్రాణం పోసినంత అపేక్షగా చేస్తాం. అలా చేస్తేనే రూపం చక్కగా కుదురుతుంది. చెక్క మీద డిజైన్ గీసుకుని, కట్ చేసుకున్న తర్వాత అంచులు పిల్లలకు గుచ్చుకోకుండా ఉండడానికి నునుపుగా వచ్చే వరకు తోపుడు పట్టాలి. ఆ తర్వాత ఇనుప బోల్టులు, హ్యాండిల్ అమరుస్తాం. చివరగా రంగులు వేయాలి. ఆ రంగులు బాగాలేకపోతే పిల్లలకు బొమ్మ నచ్చదు. ఒక్క గుర్రం బొమ్మ చేయాలంటే రెండు రోజులు పడుతుంది. రెండేళ్ల నుంచి పన్నెండేళ్ల వరకు మా తాత రోజుల్లో మా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్లకు చేసిచ్చేవాళ్లం. ఇప్పుడు ఎక్కువ బొమ్మలు చేసి పట్టణాలకు తీసుకెళ్లి ఎగ్జిబిషన్లలో అమ్ముకుంటున్నాం. ఎగ్జిబిషన్ నిర్వహకులు కూడా మాకు ఆర్డర్లు ఇస్తుంటారు. విజయవాడ, హైదరాబాద్‌కు కూడా పంపిస్తున్నాం. గుర్రం బొమ్మ 15 వందలనగానే ముఖం చిట్లిస్తారు. చెక్క ఖరీదు, ఇనుప వస్తువులు, చెక్కను కట్ చేయడానికి మెషీన్, రంగులు కొనాల్సిందే కదా. మేము చేసే పనికి కూలి గిట్టాలి. గుర్రం బొమ్మను గట్టిగా చేస్తాం. రెండేళ్ల నుంచి ఈ బొమ్మల మీద ఆడుకుంటారు పిల్లలు. పన్నెండేళ్ల పిల్లలు కూర్చున్నా విరగనంత దృఢంగా చేస్తాం బొమ్మని. కొత్తవాళ్లు రావడం లేదు కొత్తవాళ్లు ఈ పని నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పించడానికి నేను సిద్ధమే. కానీ ప్లాస్టిక్ బొమ్మలు ఇబ్బడిముబ్బడిగా దొరుకుతుండటంతో వీటిని కొనే వాళ్లు తగ్గిపోయారు. నేను మాత్రం ఈ కొయ్యగుర్రం, ఏనుగు బొమ్మలను చేస్తూనే ఉన్నాను. ఎక్కువ మంది లేకపోవడంతో కావచ్చు, నాకు మాత్రం పని దొరుకుతూనే ఉంది’’ – గుర్నాథ్, సాక్షి, చీరాల -
బనారసీ బొమ్మలు
వారణాసిలో పుట్టి పెరిగిన కౌశికి అగర్వాల్ అక్కడ దివాలా తీసిన చెక్క బొమ్మలకు కొత్త అందాలు తెచ్చిపెట్టారు. కార్మికులలో ఆత్మవిశ్వాసం నింపి లాభాలతో ముందుకు సాగుతున్నారు. రోజులు మారాయి. బనారసి బొమ్మల పాత డిజైన్లను కొనేవారు తగ్గిపోయారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బొమ్మలు తయారుచేయలేకపోయారు. జీవనాధారం కోసం ఈ కళాకారులంతా గ్రామాల నుంచి మహానగరాలకు తరలిపోవడం ప్రారంభించారు. ఈ దుస్థితి కౌశికి మనస్సును కదిలించింది. ఈ కళను నిలబెట్టడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు అప్పటికే ఎంబిఏ పూర్తిచేసిన కౌశికి ముందుగా. ఆ కళాకారులంతా ఎందుకు వారి పని మానుకున్నారో తెలుసుకోవాలనుకున్నారు. ‘బొమ్మలు కొనేవారు సంఖ్య తగ్గిపోవడంతో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఆ కారణంగానే ఈ పనులు మానేసి తామంతా నగరాలకు తరలిపోతున్నాం’ అని చెప్పారు వారు. నేటికీ కొందరు పనిచేస్తున్నారు... నేటికీ ఆ కళాకారులలో కొందరు మంచి పనిమంతులు ఉన్నారు. అటువంటి వారి నుంచి మూడు కుటుంబాలను ఎంచుకున్నారు కౌశికి. వారు చేస్తున్న పనికి ఆధునికత జోడిద్దామని సూచించారు. ఈ చెక్క బొమ్మల మీద వారు లట్టు పని చేస్తారు. లట్టు అనేది హిందీ పదం. ఈ పదానికి అలంకరించడం అని అర్థం. కొత్తవిధానంలో బొమ్మలు తయారు చేయడానికి తన సృజనను జోడించారు కౌశికి. టేబుల్ వేర్, ఫర్నిచర్, కోట్ హ్యాంగర్లు... ఇలా కొత్త కొత్త బొమ్మలను సైతం బనారసీ విధానంలోనే రూపొందిస్తున్నారు. వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించేలా మార్పులు చేసి తయారుచేయించారు కౌశికి. టేబుల్ వేర్కి మాత్రం సహజ రంగులు వేసి, ఆహారపదార్థాలకు రంగులు అంటకుండా లక్క పూత పూస్తున్నారు. అందువల్ల వీటిని నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఎక్కువసేపు నీళ్లలో నానబెట్టకుండా ఉన్నంతవరకు ఈ వస్తువులు పాడు కాకుండా, కొత్తగా ఉంటాయి... అంటారు కౌశికి. శ్రమ ఫలితం... కౌశికి విజయం వెనుక చాలా కష్టం ఉంది. కళాకారులను ఒప్పిండానికి ఎంతో ఇబ్బంది పడ్డారు కౌశికి. కొన్ని తరాలుగా వారంతా ఈ పనిలోనే ఉన్నారు కనుక ఆ పని వారు మాత్రమే చేయగలరు. కొంతకాలానికి వారే కొత్త కొత్త డిజైన్లతో ముందుకు వచ్చారు. ఈ డిజైన్లను వినియోగదారులు బాగా ఆదరించారు. వస్తువులకు గిరాకీ పెరగడంతో, వృత్తి వదిలి వెళ్లిపోయిన వారంతా మళ్లీ ఒక్కరొక్కరుగా వెనక్కు రావడం ప్రారంభించారు. వ్యాపారం వృద్ధి చేసుకుని, పాత ఇళ్లను కొత్తగా మార్పులు చేసుకున్నారు. షాపులను కొత్తగా అందంగా తీర్చిదిద్దుకున్నారు. తండ్రి నుంచి దూరంగా వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు మళ్లీ వెనక్కు వచ్చి, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కొత్త తరం వారు ఉత్సాహంగా పనిచేస్తూ, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు... అంటారు కౌశికి. ‘‘కళాకారులంతా నిజాయితీగా నిబద్ధతతో పనిచేయడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది.’’ అంటున్న కౌశికి ఒంటరిగా పోరాడి ఇంత విజయం సాధించారు. – జయంతి వ్యాపారం చేయడానికి మొట్టమొదటి పెట్టుబడి మా నాన్నగారు పెట్టారు. ఆ డబ్బుని సంవత్సర కాలంలోనే నాన్నకి తీర్చేశాను. ఇప్పుడు లాభాలు సంపాదించడం ప్రారంభించాక ఆ లాభాలను లట్టు కళాకారుల కోసం వినియోగిస్తున్నాను. వాళ్లు ఎంతో శ్రమకోర్చి చేస్తున్న పనికి తగ్గ ఫలితం అందకపోతే మళ్లీ వారు పనిచేయలేకపోతారు కదా, అందుకే వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నాను. మరిన్ని డిజైన్లను ఎంపిక చేయాలనుకుంటున్నాను. తాటాకుతో అల్లిన బుట్టలు, చాపల మీద ఈ డిజైను ఎలా వేద్దామా అని ఆలోచిస్తున్నాను. వారణాసి పురాతన హస్తకళను అందరికీ పరిచయం చేయాలనేదే నా సంకల్పం. – కౌశికి అగర్వాల్ -
కర్రకు జీవం..
నిర్మల్ అర్బన్ : కొయ్యబొమ్మలు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది నిర్మల్. ఇక్కడి బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పునికి కర్రతో తయారు చేసే బొమ్మలు, పరికరాలు, చిత్రకళలు, పెయింటింగ్స్ సహ జసిద్ధంగా ఉంటాయి. చూడగానే ఆకట్టుకుంటాయి. ప్రతీ ఒక్కరి మనస్సు దోచుకుంటాయి. చిత్రకళకు ప్రతీరూపాలైన నిర్మల్ బొమ్మలకు అంతటి ఘనత ఉంది మరీ. 400 ఏళ్ల చరిత్ర.. నిర్మల్ కొయ్యబొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఆనాడు రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కళాకారులు ఇక్కడి కలపను ఉపయోగించి అందమైన బొమ్మలు తయారు చేసేవారు. దీనినే వృత్తిగా మలుచుకుని పలు కుటుంబాలు ఇళ్లలోనే బొమ్మలు తయారు చేసేవని పూర్వీకులు చెబుతారు. చిన్న, చిన్న వస్తువులు, బొమ్మలు తయారు చేసి విక్రయించి జీవనం సాగిస్తుండేవారని ప్రతీతి. దీంతో పాటు రాజులకు అవసరమైన వస్తువులు తయారు చేసేవారు. నిజాం నవాబు కాలంలో సోన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన రాజు కూర్చునేందుకు ప్రత్యేకంగా కూర్చీని తయారు చేసి ( రాజు కూర్చోగానే బంగారు పూల వర్షం కురిసేలా) బహూకరించడంతో, దానిని చూసి మంత్రముగ్దులైన రాజు తన వంతుగా 16మంది కళాకారులకు పోషణ నిమిత్తం డబ్బులు అందజేశాడని, ఇలా ప్రారంభమైన కొయ్యబొమ్మల తయారీ నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని కళాకారులు చెబుతారు. సంఘంగా ఏర్పాటు మొదట్లో కొయ్యబొమ్మలను ఎవరికి వారే తమ తమ ఇళ్లలో తయారు చేసుకునే వారు. సంతలలో అమ్ముకునేవారు. ఎవరైనా ముందుగానే ఆర్డర్ ఇస్తే వాటిని తయారు చేసి ఇచ్చేవారు. అయితే అది అంత లాభసాటిగా లేకపోవడంతో పాటు మార్కెట్ ఇబ్బందులు రావడంతో తయారీదారులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడేవి. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కళపై ఉన్న మక్కువతో సొసైటీ ఏర్పాటు చేయాలని ఇక్కడి కళాకారులకు సలహా ఇచ్చింది. దీంతో జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయంతో 1955లో ‘నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహాకార సంఘం’ ఏర్పాటు చేశారు. అప్పుడు కేవలం 16 మందితో ఉన్న సొసైటీలో ప్రస్తుతం దాదాపు 46 మంది సభ్యులు ఉన్నారు. ఉట్టిపడే జీవకళ కళాకారులు చేతిలో కర్రలు జీవాన్ని పొందుతున్నాయి. మెత్తగా, తేలికగా, నాణ్యతగా, పగుళ్లు లేకుండా, రంగులు అద్దేందుకు వీలుగా, చెదలు పట్టకుండా ఎక్కువ కాలం మన్నేలా, అన్నింటికి అనువైనది పునికి కర్ర ఉండటంతో దీనిని బొమ్మల తయారీకి వినియోగిస్తున్నారు. ప్రత్యేక మైన మట్టిని కూడా వీటి తయారీలో వాడుతున్నారు. అలాగే సహజ సిద్ధమైన రంగులు వినియోగిస్తుండటంతో బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతోంది. నిర్మల్ బొమ్మలకు వినియోగించేది కేవలం పునికి కర్ర మాత్రమే కావడంతో దీనికోసం కళాకారులే అడవులకు వెళ్లారు. పునికి చెట్లపై స్థానికులు, అటవీ శాఖాధికారులకు అవగాహన అంతంత మాత్రంగా ఉండటం, చెట్లను గుర్తించేందుకు స్వయంగా వెళ్లాల్సి వస్తుందని కళాకారులు చెబుతున్నారు. పడిపోయిన చెట్లను మాత్రమే అటవీశాఖాధికారుల సహకారంతో టింబర్‌డిపోకు తరలించి, అక్కడ వారి నుంచి కొనుగోలు చేస్తామని, దీంతో ఖర్చు భారంగా మారిందని వాపోతున్నారు. కనీసం కర్రను కూడా ప్రభుత్వం అందించడం లేదు. అడవంతా గాలించడం ఒక ఎత్తయితే దానిని అడవి నుంచి తరలించడం మరో ఎత్తు అవుతోంది. టింబర్ డిపోనుంచి కొనుగోలు చేసిన కలపతో ఒక్కొక్కరు ఒక్కో వస్తువును తయారు చేసేందుకు కార్యదర్శి సూచనలతో తయారీకి సిద్ధమవుతామని చెబుతున్నారు. కుటీర పరిశ్రమగా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బొమ్మల తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. పురుషులతోపాటు మహిళలు కూడా ఇంటి వద్ద కొయ్యబొమ్మలకు రూపాలు ఇస్తున్నారు. సుమారు 30 మంది మహిళలు ఇళ్లలో బొమ్మలు తయారు చేస్తూ ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. వీరు తయారు చేసిన బొమ్మలు సహజ రూపంతో నిలుస్తున్నాయి. సహజత్వానికి మారు పేరు కొయ్యబొమ్మలు సహజత్వానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆయా రకాల పండ్లు, ఫలాలు, పక్షులు, జంతువుల వంటి వాటిని కర్ర రూపంలో తయారు చేసి వాటికి జీవం పోస్తున్నారు. అలాగే వీరు వేసే పెయింట్స్‌కు కూడా ప్రత్యేకత ఉంది. డెకో పేయింటింగ్‌తో వేయడంతో ప్రత్యేక ఆకర్షణ వస్తోంది. అలాగే పేయింటింగ్‌లో బ్లాక్ పేయింటింగ్ బ్యాక్‌గ్రౌండ్‌గా రావడమే ప్రత్యేకతగా చెప్పుకుంటారు. డెకో పేయింటింగ్ రాకముందు సహజమైన రూపంలో కళాకారులు రంగులు తయారు చేసుకునేవారు. తెలుపు రంగు కోసం గవ్వలు, పసుపు రంగు కోసం పసుపు, ఎరుపు రంగు కోసం మోదిగ పువ్వు వాడేవారు. ఇక నలుపు రంగు కోసం దీపం పెట్టి దానిపై ఓ పాత్రను ఉంచడంతో దానితో వచ్చే మసిని నలుపు రంగు కోసం వాడేవారు. అయితే ప్రస్తుతం వివిధ రంగులను ఒక్కతాటిపై తీసుకువచ్చి డెకో పేయింటింగ్‌తో చిత్రాలు గీస్తున్నారు. ఈ చిత్రాలు కొన్నేళ్ల పాటు శాశ్వతంగా చెక్కు చెదరకుండా ఉండడమే దీని ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల్లోనూ దర్శనం నిర్మల్ కళారూపాలు దేశంలోని పలుచోట్ల దర్శనమిస్తాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ మ్యూజియంలో కామధేను, కోన్గల్లి, రథం, డ్రెస్సింగ్ టేబుల్, తదితర వస్తువులు సుమారు 16 లక్షల విలువైన వాటిని ప్రదర్శనలో ఉంచారు. అలాగే 1948లో మహారాష్ట్రలోని పాలజ్‌కు చెందిన గ్రామస్తులు తమ గ్రామంలో నెలకొల్పేందు కోసం గణేశ్ విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వాలని కోరడంతో అప్పట్లో.. కళాకారుడు గుండాజివర్మ పాలజ్ గణేశ్ విగ్రహాన్ని చెక్కారు. ఆ విగ్రహం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. కాలానికనుగుణంగా.. నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత శోభ తెచ్చేందుకు, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త రూపాల్లో తయారీకి, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు పలు సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. నిఫ్టు ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణతో ఇళ్లల్లో ప్రజలు ఉపయోగించేలా వివిధ వస్తువులు తయారు చేస్తున్నారు. అలాగే సీసీహెచ్ ఆధ్వర్యంలో విజిటేబుల్ కలర్లతో పేయింటింగ్ నేర్పించారు. దీంతో వివిధ ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్యాకింగ్‌లోనూ ఇటీవల శిక్షణ ఇచ్చారు. ఎన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు కళాకారులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రాచర్ల లింబయ్య వర్మ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన దేవతామూర్తులను తీర్చిదిద్దడంలో దిట్ట. ఈయన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2006లో అలనాటి రాజుల కాలంలో ఏ విధంగా ఉండేవో అదే రూపంలో కామధేనువు, నాగలక్ష్మీదుర్గాదేవి, కొనుగుల్ల (అవార్డుకు ఇచ్చేవారు), డాల్ల్యాంప్, డ్రెస్సింగ్ టేబుల్, చెస్‌బోర్డు (బరాత్), రథం, మంచం, సోఫాసెట్లు, ప్రముఖుల ఇళ్లలో ఉండే బట్టలు మార్చుకునే పరికరాలను న్యూఢిల్లీలోని మ్యూజియంలో ప్రదర్శించారు. వీటిని తయారు చేయడంలో రాచర్ల లింబయ్యతో పాటు పలువురు ఆయనకు సహాయమందించి జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చారు. 2006లో అప్పటి ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షేకావత్ చేతుల మీదుగా రాష్ర్టం నుంచి ‘శిల్పగురు’ అవార్డు అందుకున్నారు. ఈయనతో పాటు భూసాని నర్సింగం వర్మ, చిన్న పోశెట్టి వర్మ, నాంపల్లి రాజశేఖర్‌వర్మ తదితరులు అనేక గుర్తింపులు పొందారు.