అది నా గుర్రం | Wood in our days There are horses | Sakshi
Sakshi News home page

అది నా గుర్రం

Published Mon, Dec 24 2018 1:50 AM | Last Updated on Mon, Dec 24 2018 7:32 AM

Wood in our days There are horses - Sakshi

‘ఛల్‌ ఛల్‌ గుర్రం, చలాకీ గుర్రం. రాజు గారి గుర్రం. నేనెక్కితే గుర్రం. మబ్బుల్లో పరుగులెట్టు గుర్రం’ అంటూ కొయ్య గుర్రం మీద ఊగుతూ పాట పాడే బాల్యం ఏమైపోయింది?పిల్లలు తమను తాము జానపద హీరోల్లా కీలుగుర్రం మీద ఆకాశంలో ఎగురుతున్నట్లు ఊహించుకుంటూ ఊగే గుర్రం బొమ్మ ఎక్కడికి పోయింది?ఇంటికి అతిథులుగా వచ్చిన పిల్లల కళ్లు ఆ గుర్రం మీద పడ్డాయంటేచాలు... రయ్యిన వెళ్లి గుర్రమెక్కేస్తారు. ఆ వెంటనే ఆ గుర్రం యజమాని (ఇంటి పిల్లాడు) ‘‘ఇది నా గుర్రం, దిగు’’ అంటూ తోసేసేవాడు. వాళ్లిద్దరికీ నచ్చచెప్పేటప్పటికి పెద్దవాళ్లకు ఒక యుద్ధాన్ని విరమింపచేసి సంధి కుదిర్చినంత పని. ఇప్పుడా ముచ్చట్లు ఎక్కడికి పోయాయి?ఒక తరం మారి కొత్త తరం వచ్చేసరికి గుర్రం బొమ్మ పాత వాసనతో అటకెక్కింది. కొత్త తరం బాల్యం మల్టీ నేషనల్‌ కంపెనీలు తయారు చేసే ఇంపోర్టెడ్‌ టాయ్స్‌ బాట పట్టింది. మన వడ్రంగి చేసే గుర్రంలో ఉండే నేటివిటీని మిస్సయింది. ‘

మా రోజుల్లో కొయ్య గుర్రం బొమ్మలుండేవి. మీ నాన్న కూడా రోజంతా గుర్రం మీదనే ఉండేవాడు’ అని నానమ్మలు చెప్తే అవి ఎలా ఉంటాయో ఈ తరం పిల్లలకు ఊహకందదు. గుర్రం కోసం కామిక్‌ షోలో లేదా యానిమల్‌ ప్లానెట్‌లో వెతుక్కోవాల్సిన యానిమేటెడ్‌ బాల్యం ఈ తరానిది. రాబోయే తరానికి అదీ ఉండదు. ఇంతటి అగత్యం రాకూడదంటాడు నవాబ్‌ షేక్‌ మస్తాన్‌ వలి. ప్రకాశం జిల్లా, చీరాల మండలం దేవాంగపురి పంచాయతీ, పాతగేటు సెంటర్‌లో ఉండే ఈ వడ్రంగి ఇప్పటికీ గుర్రం బొమ్మలు చేస్తూనే ఉన్నాడు. ‘ఇంకా వీటిని చేయడం ఎందుకు? ఇప్పుడు ఈ బొమ్మలకు మార్కెట్‌ ఉందా?’ అని ఎవరైనా అడిగితే ‘‘కొనేవాళ్లు తక్కువే. కానీ ఇష్టమైన వాళ్లు కొనుక్కుంటారు. కొనేవాళ్లు తగ్గారని చేయడం మానేస్తే... రాను రాను ఇలాంటి బొమ్మలుండేవన్న సంగతి కూడా తెలియకుండా పోతుంది కదా!’’ అని తిరిగి ప్రశ్నించాడు వంచిన తల ఎత్తకుండానే.

అతడిని మాటల్లో పెడితే మెల్లగా వివరాలు చెప్పసాగాడు.‘‘మా తాత చెక్కతో ఏనుగులు, గుర్రాలు చేసేవాడు. ఆయనకు చేతికింద సహాయం చేస్తూ పని నేర్చుకున్నాను. మేము చేసేది చెక్క బొమ్మే అయినా, ప్రాణం పోసినంత అపేక్షగా చేస్తాం. అలా చేస్తేనే రూపం చక్కగా కుదురుతుంది. చెక్క మీద డిజైన్‌ గీసుకుని, కట్‌ చేసుకున్న తర్వాత అంచులు పిల్లలకు గుచ్చుకోకుండా ఉండడానికి నునుపుగా వచ్చే వరకు తోపుడు పట్టాలి. ఆ తర్వాత ఇనుప బోల్టులు, హ్యాండిల్‌ అమరుస్తాం. చివరగా రంగులు వేయాలి. ఆ రంగులు బాగాలేకపోతే పిల్లలకు బొమ్మ నచ్చదు. ఒక్క గుర్రం బొమ్మ చేయాలంటే రెండు రోజులు పడుతుంది. 

రెండేళ్ల నుంచి పన్నెండేళ్ల వరకు
మా తాత రోజుల్లో మా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్లకు చేసిచ్చేవాళ్లం. ఇప్పుడు ఎక్కువ బొమ్మలు చేసి పట్టణాలకు తీసుకెళ్లి ఎగ్జిబిషన్‌లలో అమ్ముకుంటున్నాం. ఎగ్జిబిషన్‌ నిర్వహకులు కూడా మాకు ఆర్డర్‌లు ఇస్తుంటారు. విజయవాడ, హైదరాబాద్‌కు కూడా పంపిస్తున్నాం. గుర్రం బొమ్మ 15 వందలనగానే ముఖం చిట్లిస్తారు. చెక్క ఖరీదు, ఇనుప వస్తువులు, చెక్కను కట్‌ చేయడానికి మెషీన్, రంగులు కొనాల్సిందే కదా. మేము చేసే పనికి కూలి గిట్టాలి. గుర్రం బొమ్మను గట్టిగా చేస్తాం. రెండేళ్ల నుంచి ఈ బొమ్మల మీద ఆడుకుంటారు పిల్లలు. పన్నెండేళ్ల పిల్లలు కూర్చున్నా విరగనంత దృఢంగా చేస్తాం బొమ్మని. 

కొత్తవాళ్లు రావడం లేదు
కొత్తవాళ్లు ఈ పని నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పించడానికి నేను సిద్ధమే. కానీ ప్లాస్టిక్‌ బొమ్మలు ఇబ్బడిముబ్బడిగా దొరుకుతుండటంతో వీటిని కొనే వాళ్లు తగ్గిపోయారు. నేను మాత్రం ఈ కొయ్యగుర్రం, ఏనుగు బొమ్మలను చేస్తూనే ఉన్నాను. ఎక్కువ మంది లేకపోవడంతో కావచ్చు, నాకు మాత్రం పని దొరుకుతూనే ఉంది’’
– గుర్నాథ్, సాక్షి, చీరాల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement