ఖాకీచులాట | Rural and urban differences between the police | Sakshi
Sakshi News home page

ఖాకీచులాట

Published Sat, Oct 11 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

ఖాకీచులాట

ఖాకీచులాట

వరంగల్ క్రైం :  వరంగల్ రూరల్, అర్బన్ పోలీసుల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. జిల్లా పోలీసు శాఖ అర్బన్, రూరల్‌గా విభజన చెంది మూడేళ్లకు పైగా కాగా... హెడ్‌క్వార్టర్స్‌లోకి కొన్ని విభాగాలు ఇప్పటికీ ఉమ్మడిగానే పనిచేస్తున్నాయి. ఇటీవల కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలతో ఇరువురి మధ్య భేదాభిప్రాయూలు ఏర్పడ్డాయి. చిన్ని చిన్న విషయాల్లో ఇప్పటికే అనేక  మార్లు మనస్పర్థలు వచ్చినప్పటికీ సర్దుకుపోతూ వచ్చారు. కానీ... శుక్రవారం హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన సంఘటనతో అర్బన్, రూరల్ పోలీస్‌ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఉమ్మడి వృత్తి సిబ్బందిపై ఆంక్షలు చిలికిచిలికి గాలివానగా మారి దుమారం చెలరేగింది.

అసలు ఏం జరిగిందంటే...

ప్లంబర్, కార్పెంటరీ ఇలాంటి వృత్తి ఉద్యోగులు అటు అర్బన్‌కు, ఇటు రూరల్ కార్యాలయాలకు అవసరం వచ్చిన సమయంలో ఉమ్మడిగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని రోజులుగా వీరిపై అధికారిగా ఉన్న రూరల్‌కు చెందిన వ్యక్తి ఒకరు అర్బన్‌కు పనులు చేయొద్దని హుకుం జారీచేశారు. అనేక పర్యాయాలు అర్బన్‌కు పని ఉన్నప్పుడు సదరు సిబ్బంది వెళ్లకుండా అడ్డుపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఇలా పలుమార్లు సిబ్బంది అర్బన్‌కు చెందిన పనులు చేయకపోవడంతో   పనులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో సదరు అధికారి ఇలా చేయడం నచ్చని ఒక అర్బన్ అధికారి  రూరల్ పోలీస్ పరేడ్‌కు వెళ్లొద్దని తన ఆధీనంలోని బ్యాండ్ కళాకారులను ఆదేశించారు. దీంతో రూరల్ పరేడ్ బ్యాండ్ ప్రదర్శన లేకుండానే ముగిసింది. ఈ విషయంపై ఆగ్రహించిన రూరల్ ఉన్నతాధికారి ఒకరు ‘మాకు బ్యాండ్ ఇవ్వరా’ అంటూ అర్బన్ అధికారులపై చిందులేశారు.
 
అర్బన్ అధికారి కుర్చీ బయటపడేసి...

బ్యాండ్‌ను అడ్డుకున్న అర్బన్ అధికారికి, ఇదే కేడర్‌లో ఉన్న రూరల్ అధికారి ఒకే గదిలో నుంచే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. గతంలో అర్బన్‌కు ఈ పోస్టు ఉండేది కాదు. నాలుగు నెలల క్రితమే ఈ పోస్టు మంజూరైంది. మరో బిల్డింగ్ లేకపోవడంతో ఇద్దరు అధికారులకు ఒకే గదిని కేటాయించారు. అయితే శుక్రవారం జరిగిన ఘటన నేపథ్యంలో అర్బన్ అధికారి కుర్చీని రూరల్ అధికారి బయటకు విసిరేయించాడు. సదరు అర్బన్ అధికారికి సంబంధించిన సామగ్రి మొత్తాన్ని బయట పడేయడంతో హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అర్బన్, రూరల్ సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.

పరిస్థితి చేయిదాటుతోందన్న సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను పిలిపించి విషయం తెలుసుకున్నారు. అర్బన్ అధికారి తనకు జరిగిన అవమానాన్ని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావును కలిసి వివరించారు. దీంతో రూరల్ అధికారులను అర్బన్ ఎస్పీ మందలించినట్లు తెలిసింది. మరో మారు ఇలాంటి వివాదం తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించినట్లు సమాచారం. దయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన  గొడవ పోలీస్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement