గ్రామాల్లో ధరల భారం తీవ్రం | India's Inflation Also 'K-shaped'; Rural Folk More Hurt By Price-rise, Says HSBC | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ధరల భారం తీవ్రం

Published Wed, Jun 26 2024 10:54 AM | Last Updated on Wed, Jun 26 2024 11:27 AM

India's inflation also 'K-shaped'; rural folk more hurt by price-rise: HSBC

ముంబై: దేశంలో మహమ్మారి కరోనా అనంతరం ఎకానమీ తీవ్ర ఒడిదుడుకులతో రికవరీ అవుతున్న అయిన విధంగానే (ఇంగ్లీషు అక్షరం ‘కే‘ నమూనా) ఇప్పుడు ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొన్నాయని బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం– హెచ్‌ఎస్‌బీసీ నివేదిక ఒకటి పేర్కొంది. కరోనా అనంతరం దేశ ప్రజలందరికీ ఎకానమీ రికవరీ ప్రయోజనాలు ఒకే రీతిగా అందకుండా తీవ్ర అడ్డంకులు నెలకొన్నాయని, అదే విధంగా ఇప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావం కొన్ని వర్గాలపై ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలపై తీవ్ర ప్రతికూలత చూపుతోందని వివరించింది. 

దేశంలో పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం గ్రామీణ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్‌ఎస్‌బీసీ ప్రధాన ఆర్థికవేత్త ప్రంజూల్‌ భండారీ నివేదికలో పేర్కొన్నారు.  ప్రధానంగా తీవ్ర వేడి, పంట నష్టం, పశువుల మరణాల కారణంగా అధిక ఆహార ద్రవ్యోల్బణం సమస్యలను గ్రామీణ ప్రాంతం ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే.. 

👉పలు ఇంధన ధరలను తగ్గించడం ద్వారా ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అయితే పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి అనేక ఇంధనాలను సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించరు. దీనివల్ల పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. 

👉 ఆహార ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, ఇది ఎంతో ‘‘నిగూఢమైన’’ అంశం. నిజానికి ఆహారాన్ని పండించే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల కంటే తక్కువ ద్రవ్యోల్బణం ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే రైతు ఆదాయాలు దెబ్బతింటున్నందున  వారు పట్టణ ప్రొక్యూర్‌లకు (పంట సేకరణ వ్యాపారులు)తమ పంటలను విక్రయించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సరఫరాలకు దారితీసి, ఆయా ప్రాంతాల్లో ధరల తీవ్రతకు దారితీస్తోంది.  

👉ఇక ఇదే సమయంలో తగిన మౌలిక సదుపాయాలు, సరఫరాల వ్యవస్థ పటిష్టత, భారీ దిగుమతుల వెసులుబాటు వంటి అంశాల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకంటే తక్కువ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కలిగి ఉంటున్నారు. 
 
👉 మేలో ఏడాది కనిష్ట స్థాయిలో  4.75 శాతంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్‌బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్‌ పాయింట్లు అధికం.  కాగా, రిటైల్‌ ద్రవ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.  మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల  మేలో పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతం ద్రవ్యోల్బణం ఉంటే,  గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా  అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది.  

👉 వర్షాలు తగిన విధంగా లేకపోతే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీరేట్ల తగ్గుదలకు తగిన పాలసీ నిర్ణయాలను తీసుకోకపోవచ్చు. ఇది ఎకానమీపై తీవ్ర ప్రతికూలత చూపుతుంది.  

👉జూలై– ఆగస్టుల్లో సాధారణ వర్షాపాతం నమోదుకాకపోతే తీవ్ర ద్రవ్యోల్బణం సమస్య తప్పదు.  ధాన్యాగారాల్లో గోధుమలు పప్పుధాన్యాల నిల్వలు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. తగిన వర్షపాతం నమోదుకాకపోతే, 2024లో ఆహార ఒత్తిడి 2023 కంటే అధ్వాన్నంగా ఉండవచ్చు. జూన్‌లో ఇప్పటివరకు వర్షాలు సాధారణం కంటే 17 శాతం తక్కువగా నమోదయ్యాయి.  వాయువ్య ప్రాంతంలో అత్యధికంగా తృణధాన్యాలు పండుతాయి. ఇక్కడ  63 శాతం లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం.  

👉 వర్షాలు సాధారణ స్థితికి వస్తే, ద్రవ్యోల్బణం బాగా పడిపోవచ్చు. దీనితో ఆర్‌బీఐ సరళతర వడ్డీరేట్ల వ్యవస్థకు నిర్ణయం తీసుకోవచ్చు.  సానుకూల అంశాల నమోదయితే మార్చి 2025 నాటికి 0.5 శాతం రెపో రేటు తగ్గింపునకు దారితీయవచ్చు.  

👉బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 6.5 శాతం.  బ్యాంకింగ్‌ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలను ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. 

👉 ఆర్‌బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్‌బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్‌–జూన్‌) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. కేంద్రం ఆర్‌బీఐ నిర్దేశిస్తున్నదాని ప్రకారం ప్లస్‌2 లేదా మైనస్‌2తో 4 శాతం వద్ద రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అంటే ఎగువముఖంగా 6 శాతంగా ఉండవచ్చన్నమాట.  అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement