HSBC report
-
గ్రామాల్లో ధరల భారం తీవ్రం
ముంబై: దేశంలో మహమ్మారి కరోనా అనంతరం ఎకానమీ తీవ్ర ఒడిదుడుకులతో రికవరీ అవుతున్న అయిన విధంగానే (ఇంగ్లీషు అక్షరం ‘కే‘ నమూనా) ఇప్పుడు ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొన్నాయని బ్యాంకింగ్ సేవల దిగ్గజం– హెచ్ఎస్బీసీ నివేదిక ఒకటి పేర్కొంది. కరోనా అనంతరం దేశ ప్రజలందరికీ ఎకానమీ రికవరీ ప్రయోజనాలు ఒకే రీతిగా అందకుండా తీవ్ర అడ్డంకులు నెలకొన్నాయని, అదే విధంగా ఇప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావం కొన్ని వర్గాలపై ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలపై తీవ్ర ప్రతికూలత చూపుతోందని వివరించింది. దేశంలో పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం గ్రామీణ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్ఎస్బీసీ ప్రధాన ఆర్థికవేత్త ప్రంజూల్ భండారీ నివేదికలో పేర్కొన్నారు. ప్రధానంగా తీవ్ర వేడి, పంట నష్టం, పశువుల మరణాల కారణంగా అధిక ఆహార ద్రవ్యోల్బణం సమస్యలను గ్రామీణ ప్రాంతం ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే.. 👉పలు ఇంధన ధరలను తగ్గించడం ద్వారా ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అయితే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి అనేక ఇంధనాలను సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించరు. దీనివల్ల పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. 👉 ఆహార ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, ఇది ఎంతో ‘‘నిగూఢమైన’’ అంశం. నిజానికి ఆహారాన్ని పండించే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల కంటే తక్కువ ద్రవ్యోల్బణం ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే రైతు ఆదాయాలు దెబ్బతింటున్నందున వారు పట్టణ ప్రొక్యూర్లకు (పంట సేకరణ వ్యాపారులు)తమ పంటలను విక్రయించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సరఫరాలకు దారితీసి, ఆయా ప్రాంతాల్లో ధరల తీవ్రతకు దారితీస్తోంది. 👉ఇక ఇదే సమయంలో తగిన మౌలిక సదుపాయాలు, సరఫరాల వ్యవస్థ పటిష్టత, భారీ దిగుమతుల వెసులుబాటు వంటి అంశాల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకంటే తక్కువ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కలిగి ఉంటున్నారు. 👉 మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల మేలో పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. 👉 వర్షాలు తగిన విధంగా లేకపోతే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల తగ్గుదలకు తగిన పాలసీ నిర్ణయాలను తీసుకోకపోవచ్చు. ఇది ఎకానమీపై తీవ్ర ప్రతికూలత చూపుతుంది. 👉జూలై– ఆగస్టుల్లో సాధారణ వర్షాపాతం నమోదుకాకపోతే తీవ్ర ద్రవ్యోల్బణం సమస్య తప్పదు. ధాన్యాగారాల్లో గోధుమలు పప్పుధాన్యాల నిల్వలు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. తగిన వర్షపాతం నమోదుకాకపోతే, 2024లో ఆహార ఒత్తిడి 2023 కంటే అధ్వాన్నంగా ఉండవచ్చు. జూన్‌లో ఇప్పటివరకు వర్షాలు సాధారణం కంటే 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. వాయువ్య ప్రాంతంలో అత్యధికంగా తృణధాన్యాలు పండుతాయి. ఇక్కడ 63 శాతం లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం. 👉 వర్షాలు సాధారణ స్థితికి వస్తే, ద్రవ్యోల్బణం బాగా పడిపోవచ్చు. దీనితో ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల వ్యవస్థకు నిర్ణయం తీసుకోవచ్చు. సానుకూల అంశాల నమోదయితే మార్చి 2025 నాటికి 0.5 శాతం రెపో రేటు తగ్గింపునకు దారితీయవచ్చు. 👉బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది 6.5 శాతం. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశాలను ఆర్బీఐ పరిశీలిస్తోంది. 👉 ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. కేంద్రం ఆర్బీఐ నిర్దేశిస్తున్నదాని ప్రకారం ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అంటే ఎగువముఖంగా 6 శాతంగా ఉండవచ్చన్నమాట. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. -
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే 7.7 శాతానికి వృద్ధి
న్యూఢిల్లీ: జీడీపీ వృద్ధి రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 7.7 శాతానికి పెరగడం వెనుక నిర్మాణం, వినియోగానికి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ప్రధానంగా తోడ్పడిందని హెచ్ఎస్బీసీ ఓ నివేదికలో తెలిపింది. ఈ స్థాయి వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల్లోనే అత్యధికం కావడం గమనార్హం. తయారీ, సేవల రంగంతోపాటు, సాగు ఉత్పత్తి బలంగా ఉండటంతో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా మరోసారి నిలిచింది. అయితే, ఎగుమతులు, ప్రైవేటు వినియోగం నిరాశపరిచినట్టు హెచ్ఎస్బీసీ పేర్కొంది. ఒకవైపు తయారీ, సాగు వృద్ధి పెరగ్గా, మరోవైపు ప్రైవేటు వినియోగం నిరాశపరిచినట్టు పేర్కొంది. అంతర్జాతీయ డిమాండ్ పెరిగినప్పటికీ భారత ఎగుమతుల వృద్ధి మందగించిందని నివేదికలో ప్రస్తావించింది. -
డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి 5 శాతమే!
• నోట్ల రద్దు ప్రభావంపై హెచ్ఎస్బీసీ నివేదిక • ఫిబ్రవరిలో పావుశాతం రేటు కోత అంచనా న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక దేశ ఆర్థిక వృద్ధిపై తీవ్రంగా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతంగానే నమోదవుతుందని నివేదిక అంచనావేసింది. తరువాతి త్రైమాసికంలో (జనవరి–మార్చి) ఈ రేటు 6 శాతమని విశ్లేషించింది. డీమోనిటైజేషన్ వల్ల తయారీ, సేవల రంగాలు భారీగా నష్టపోతున్నట్లు పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ తయారీ, సేవలు, వినియోగం, పెట్టుబడులు... ఇలా కీలక రంగాలన్నింటిపై నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ప్రకటన ప్రభావం పడింది. ⇔ డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో వృద్ధి రేట్ల తాజా అంచనా వరుసగా 5, 6 శాతాలు. ఇవి ఇంతక్రితం అంచనాలకన్నా 2% తక్కువ. ⇔ మార్చి తరువాత ఆర్థిక వృద్ధి క్రమంగా పుంజుకునే వీలుంది. తిరిగి వృద్ధి రేటు 7% దిశగా పయనించవచ్చు. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.5%–8% శ్రేణిలో ఉండవచ్చు. వ్యాపార వ్యయాల సర్దుబాటు, వినియోగ విశ్వాసం పెరుగుదల, డిజిటలైజేషన్ వంటి అంశాలు ఇందుకు దోహదపడతాయి. ⇔ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వృద్ధి లక్ష్యంగా సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అవలంభించే వీలుంది. పెట్టుబడులు పెరగడం లక్ష్యంగా ఫిబ్రవరిలో పావుశాతం రెపో రేటు (బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) తగ్గించే వీలుంది. ఫిబ్రవరి 8న ఆర్బీఐ తదుపరి పాలసీ సమావేశం కావడం గమనార్హం. ఫిబ్రవరిలో రేటు కోత ఉండకపోవచ్చు...: ఎస్బీఐ నివేదిక మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన పరిశోధనా నివేదికలో ఫిబ్రవరి 8న ఆర్బీఐ రేటు కోత ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులే దీనికి కారణమని వివరించింది. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండే వీలుందని పేర్కొంటూ, డిసెంబర్లో ఈ శాతం 3.2 శాతం – 3.3 శాతం శ్రేణిలో ఉండవచ్చని అభిప్రాయపడింది. మార్చి త్రైమాసికంలో కొంత పెరిగినా 4 నుంచి 4.5 శాతం శ్రేణికి మించకపోవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగిన ఆమోదనీయ స్థాయిలో కొనసాగిన పక్షంలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో రేటుకు సానుకూలంగా ఆర్బీఐ స్పందించే వీలుందని అభిప్రాయపడింది. -
రూపాయి ర్యాలీ కొనసాగేనా ?
ముంబై: రూపాయి ర్యాలీ కొనసాగింపుపై విశ్లేషకుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నరేంద్ర మోడి ఘన విజయంతో కొత్త రికార్డులకు ఎగబాకిన డాలర్‌తో రూపాయి మారకం ఇదే ఊపును కొనసాగించే విషయమై నిపుణుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్లలాగానే రూపాయి కూడా దూసుకుపోయింది. గురువారం ముగింపుతో పోల్చితే రూపాయి శుక్రవారం 50 పైసలు బలపడి 58.79 (ఇది 10 నెలల గరిష్ట స్థాయి) వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం ఈ ఏడాది చివరి నాటికి 62కు చేరుతుందని హెచ్ఎస్బీసీ అంచనా వేస్తోంది. కొత్త ప్రభుత్వ దీర్ఘకాలిక విధానాలపై కొంత అస్పష్టత ఉందని హెచ్ఎస్బీసీ తన తాజా నివేదికలో పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ కారణాల వల్ల బలపడుతూ వస్తున్న రూపాయి ఇదే జోరును కొనసాగిస్తుందో లేదో చూడాల్సి ఉందని వివరించింది. 58 స్థాయికి రూపాయి నరేంద్ర మోడి గెలుపు కారణంగా ప్రారంభంలో విదేశాల నుంచి నిధులు బాగానే వస్తాయని, ఫలితంగా రూపాయి 58కు చేరుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌కు చెందిన అగమ్ గుప్తా పేర్కొన్నారు. ఆ తర్వాత ఆర్బీఐ జోక్యం చేసుకొని రూపాయి బలపడడంపై పరిమితులు విధిస్తుందని వివరించారు. రూపాయి ఈ స్థాయిలో బలపడడం ఆర్థిక వ్యవస్థకు అంతగా మంచిది కాదని ఏవీ రజ్వాడే అండ్ కో డెరైక్టర్ ఏవీ రజ్వాడే వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రూపాయిపై బడ్జెట్, విదేశీ నిధుల ప్రవాహం, కొత్త కేబినెట్ వంటి అంశాలే కాకుండా ద్రవ్య విధానం, మారకం రేట్లు, ద్రవ్యోల్బణ నియంత్రణ తదితర అంశాలపై కొత్త ప్రభుత్వ విధానాలు కూడా ప్రభావం చూపిస్తాయని ఫస్ట్‌ర్యాండ్ బ్యాంక్ ట్రెజరర్ హరిహర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కొన్ని రోజుల్లోనే రూపాయి 59-61 రేంజ్లో ట్రేడవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.