రూపాయి ర్యాలీ కొనసాగేనా ?
ముంబై: రూపాయి ర్యాలీ కొనసాగింపుపై విశ్లేషకుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నరేంద్ర మోడి ఘన విజయంతో కొత్త రికార్డులకు ఎగబాకిన డాలర్‌తో రూపాయి మారకం ఇదే ఊపును కొనసాగించే విషయమై నిపుణుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్లలాగానే రూపాయి కూడా దూసుకుపోయింది.
గురువారం ముగింపుతో పోల్చితే రూపాయి శుక్రవారం 50 పైసలు బలపడి 58.79 (ఇది 10 నెలల గరిష్ట స్థాయి) వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం ఈ ఏడాది చివరి నాటికి 62కు చేరుతుందని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేస్తోంది. కొత్త ప్రభుత్వ దీర్ఘకాలిక విధానాలపై కొంత అస్పష్టత ఉందని హెచ్‌ఎస్‌బీసీ తన తాజా నివేదికలో పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ కారణాల వల్ల బలపడుతూ వస్తున్న రూపాయి ఇదే జోరును కొనసాగిస్తుందో లేదో చూడాల్సి ఉందని వివరించింది.
58 స్థాయికి రూపాయి
నరేంద్ర మోడి గెలుపు కారణంగా ప్రారంభంలో విదేశాల నుంచి నిధులు బాగానే వస్తాయని, ఫలితంగా రూపాయి 58కు చేరుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌కు చెందిన అగమ్ గుప్తా పేర్కొన్నారు. ఆ తర్వాత ఆర్‌బీఐ జోక్యం చేసుకొని రూపాయి బలపడడంపై పరిమితులు విధిస్తుందని వివరించారు. రూపాయి ఈ స్థాయిలో బలపడడం ఆర్థిక వ్యవస్థకు అంతగా మంచిది కాదని ఏవీ రజ్వాడే అండ్ కో డెరైక్టర్ ఏవీ రజ్వాడే వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రూపాయిపై బడ్జెట్, విదేశీ నిధుల ప్రవాహం, కొత్త కేబినెట్ వంటి అంశాలే కాకుండా ద్రవ్య విధానం, మారకం రేట్లు, ద్రవ్యోల్బణ నియంత్రణ తదితర అంశాలపై కొత్త ప్రభుత్వ విధానాలు కూడా ప్రభావం చూపిస్తాయని ఫస్ట్‌ర్యాండ్ బ్యాంక్ ట్రెజరర్ హరిహర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కొన్ని రోజుల్లోనే రూపాయి 59-61 రేంజ్‌లో ట్రేడవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.