
బెంగాల్ గ్రామీణ సంస్కృతి
బెంగాల్‌లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగుల కళతో నిండిన మరో ప్రపంచం ఆహ్వానిస్తుంటే... ఎలా మిస్ అవగలం..
ఇష్టమైన హస్తకళల నుండి నోరూరించే వంటకాల వరకు అక్కడ ప్రతిదీ గొప్పగా జరుపుకుంటారు. బెంగాల్ గ్రామాల్లోని వారి గొప్ప వారసత్వం, కనుల విందు చేసే వారి సంస్కృతిలో మనమూ ఇట్టే లీనమైపోతాం. దీనిని గుర్తించిన కోల్ ఇండియా లిమిటెడ్, బంగ్లానాటక్ డాట్ కామ్‌తోపాటు ఎక్స్‌ప్లోర్ రూరల్ బెంగాల్ పండుగలు, జాతరల శ్రేణిని మన ముందుకు తీసుకువస్తోంది. దీని ద్వారా బీర్భూమ్, పురూలియా బంకురా, నదియా ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్‌లో గల 16 గ్రామాలలో ప్రయాణించవచ్చు.
ఇక్కడి జానపద సంగీతం, నృత్యం, తోలుబొమ్మలాటలు, హస్తకళల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వంలో మనమూ పాల్గొనవచ్చు. అక్టోబర్‌లో చివరి వారాంతాల్లో ఇక్కడ పండుగ, జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. బీర్భూమ్‌లోని అంత్యంత అట్టహాసంగా జరిగే కాంత మేళా, శాంతినికేతన్ మేళాను సందర్శించవచ్చు. పురూలియాలో చౌ ఉత్సవ్, పాత చిత్రాల మేళాను సందర్శించి, వారి కళను ఆస్వాదించవచ్చు. బురాద్వన్‌లోని డోక్రా మేళా, చెక్క బొమ్మల మేళాలో షాపింగ్ చేయవచ్చు. ఈ గ్రామీణ జాతర అక్టోబర్ 25 నుంచి 27 వరకు జరుగుతుంది.