కల్చర్ తక్కువ అఫైర్స్ ఎక్కువ!
అక్షర తూణీరం
‘‘ఏవండీ చూశారా? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని అవధానిగా గుర్తించారు. ఇక ఇతరుల మాట చెప్పాలా? ఎవరండీ ఆ కమిటీలో ఉండేవారు?’’ అంటూ ఒకాయన యాగీ చేశాడు. ‘‘నాకు తెలుసండీ , ఇందులో హీనపక్షం నలుగురన్నా చినబాబు తాలూకు, నలుగురన్నా హెరిటేజి తాలూకు ఉండి ఉంటారండీ... మీకేమైనా తెలుసా?’’ అని ఒకాయన నిలదీశాడు.
ఉగాది పండగవేళ పలకరిద్దామని కవి మిత్రులకు ఫోన్ చేస్తే, మాకుగాదులు లేవు, మాకుషస్సులు లేవంటూ నినదించాయి. మహా సంతర్పణలోనే ఒక విస్తరి దొరక్కపోతే, ఇక విడిగా ఏం దొరుకుతుందని వాపోయారు. ముఖ్యంగా రెండు, మూడు పద్యకవులు... దోషం వ్యాకరణ దోషం- ఇద్దరు ముగ్గురు పద్యకవులు ఛందస్సుకి ఆంధ్రరాష్ట్రంలో శాలువా మాత్రం చోటు దొరక్కపోవడం శోచనీయమన్నారు. గళాలు విప్పి నిప్పులు కురిపించాం. అన్యాయం నించి కరువు దాకా అన్నిటి మీదా స్పం దించాం, ‘‘ఏదీ మాకో నూలుపోగు’’ అంటూ ఓ గుప్పెడు అభ్యుదయ కవులు ఉద్రేకంగా మాట్లాడారు. ఎప్పుడైనా ఇది మామూలే. కొన్ని సత్కారాలు కొన్ని భంగపాట్లకి చోటిస్తాయి. అసంతృప్తులు మంత్రి వర్గ విస్తరణప్పుడే కాదు, ఉగాది తరుణంలోనూ పుట్టుకొస్తారు. ఈ అసంతృప్తులు ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి కొంచెం ఊరట చెందుతారు.
‘‘ఏవండీ చూశారా? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుని అవధానిగా గుర్తించారు. ఇక ఇతరుల మాట చెప్పాలా? ఎవరండీ ఆ కమిటీలో ఉండేవారు?’’ అంటూ ఒకాయన చాలా యాగీ చేశాడు. ‘‘నాకు తెలుసండీ , ఇందులో హీనపక్షం నలుగురన్నా చినబాబు తాలూకు, నలుగురన్నా హెరిటేజి తాలూకు ఉండి ఉంటారండీ... మీకేమైనా తెలుసా?’’ అని ఒకాయన నిలదీశాడు. ‘‘... పురుషులు, స్త్రీలు, ఇతరులు అనడం అలవాటు. వాటీజ్ దిస్, ఇతరములు ఏవిటండీ? సాహిత్యం, సంగీతం, శిల్పం, తోటకూర, గోంగూర ఏదో చెప్పాలిగా. ఇతరములు అంటే ఏమిటవి? తెలుగు జాతికి తెలియాలి కదా! ’’అంటూ విరుచుకుపడ్డాడు.
‘‘మేస్టారూ! ఇవేనా కళలు? చెక్క భజన గొప్పదే. చేనేత కళ గొప్పది కాదా? బుర్రకథ గొప్పదే. కానీ తాపేశ్వరం కాజా తయారీ మరింత విశేషం కాదా చెప్పండి! నెల్లూరు కోమల విలాస్‌లో మజ్జిగ పులుసు అద్భుతం కదా! ఏది దానికి గుర్తింపు-’’ క్లాసు పీకాడొకాయన. ‘‘మీరు ఎన్ని చెప్పండి (నిజానికి నేనసలేం చెప్పలేదు), ఈ ముఖ్యమంత్రి వచ్చాడంటే కల్చర్ తక్కువగానూ, అఫైర్స్ ఎక్కువగానూ ఉంటాయండీ’’ అని ముక్తాయించాడింకో పెద్దాయన.
అసలెందుకొచ్చిన గొడవ. ఇప్పుడెలాగూ మనం ప్రభుత్వ ప్రైవేటు ఆధ్వర్యంలో ఎన్నో మంచి పనులు చేసుకుంటున్నాం. అదే క్రమంలో ఉగాది సన్మానాలను సైతం ఘనంగా చేసుకోవచ్చు. కళాకారులకు కవులకు వ్యాపార సంస్థలతో పరిచయాలుంటాయి. కార్పొరేట్స్, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ కంపెనీలు, సినిమా సంస్థలు మొదలైనవి. ఆయా సంస్థలు ఒకరి పేరు సూచించి, లక్ష రూపాయలు విరాళం ఇస్తుంది. ఇలా ఒక వంద పేర్లు, వంద లక్షలు సేకరిస్తాం. ఓ పది పేర్లు నిజంగానే ఎవరి ఆసరా లేని నిజం కళాకారుల్ని ఎంపిక చేస్తాం. దీనిలో వంద మీద వంద లక్షలు వసూలవుతుంది. అర లక్ష చొప్పున పురస్కారం ఉంటుంది.
వాళ్ల మీద ఓ అయిదు ఖర్చవుతుంది. సభకి, శాలువలకి, దండలకి ఇంకో నాలుగైదులకారాలవుతుంది. కాగా పోగా, తరుగులు పోగా పాతిక ముప్పయ్ లక్షలైనా కల్చరల్ ఎఫైర్స్‌కి జమ పడుతుంది. పైగా ఎక్కువమందిని సంతృప్తి పరిచిన సంతృప్తి కూడా సీయమ్‌కి మిగు ల్తుంది. నేను ఈ విధంగా పరిపరి విధాల ఆలోచనలు చేస్తుంటే ఒకాయన లైన్లోకి వచ్చి అసలు పురస్కారాలు జరగాల్సింది కాడి మోస్తున్న లిక్కర్ షాపు యజమానులకండీ. రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా కస్టమర్లను చైతన్యపరుస్తూ... ఆయన గొంతు గద్గదమై పూడుకుపోయింది.
శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)