సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఇండియన్ హెరిటేజ్ (భారతీయ వారసత్వం), కల్చర్ (సంస్కృతి) ఆధారిత కోర్సుల అమలుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది. శాస్త్రీయ నృత్యం, ఆయుర్వేదం, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, మానవ విలువలు, వేద గణితం, యోగా తదితర కోర్సులను ప్రవేశపెట్టనుంది.
ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. బహుళ ప్రవేశ నిష్క్రమణలతో స్వల్పకాలిక క్రెడిట్–ఆధారిత కోర్సులుగా వీటిని అమలు చేయనున్నట్లు పేర్కొంది. జాతీయ నూతన విద్యావిధానం–2020 ప్రకారం భారతీయ వారసత్వం, సంస్కృతీ, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి వీలుగా భారతీయ సనాతన వారసత్వ సంపద ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియచేయడమే లక్ష్యంగా ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు యూజీసీ పేర్కొంది.
ఆయుర్వేదం, శాస్త్రీయ నృత్య రూపాలు, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, సార్వజనీన మానవ విలువలు, వేద గణితం, యోగా వంటి కోర్సుల కోసం కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్కును రూపొందించనుంది. ఈ కోర్సులతో విదేశీ విద్యార్థులను భారతదేశానికి ఆకర్షించడమే లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. 3 విభాగాలుగా ఈ కోర్సులను యూజీసీ ప్రతిపాదించింది.
పరిచయ స్థాయి, మధ్యంతర స్థాయి, అధునాతన స్థాయిగా వీటిని విభజించనుంది. కోర్సులను అందించే సంబంధిత ఉన్నత విద్యాసంస్థలు వాటికి నిర్దిష్ట అర్హత పరిస్థితులను నిర్ణయించడానికి యూజీసీ అనుమతించింది. ఆయా ప్రోగ్రాములు ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ (ఆన్‌లైన్–ఆఫ్‌లైన్ కాంబినేషన్) కింద అందించనున్నారు. ఆయా ఉన్నత విద్యాసంస్థలు కోర్సులకు సంబంధించి సంబంధిత ముఖ్యమైన సాహిత్యం గ్రంథాలు నేర్చుకున్న పండితుల సహకారం తీసుకుని పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని సూచించింది.
ఆయా ప్రోగ్రాములను రూపొందించేటపుడు బోధనా విధానాల్లోనూ ఆధునిక నాలెడ్జ్ సిస్టమ్‌తో అనుసంధానం ఉండాలని స్పష్టం చేసింది. బోధన వివిధ మాధ్యమాల్లో ఉంటుంది. ఉపన్యాసాలు, ఆడియో–వీడియో కంటెంట్, గ్రూపు చర్చలు, ఆచరణాత్మక సెషన్‌లు, విహారయాత్రలు కూడా బోధనలో భాగంగా ఉంటాయి. అభ్యాసకులకు క్రెడిట్‌లను అందించడానికి రెండు రకాల మూల్యాంకన విధానాలు పాటిస్తారు.
నిరంతర, సమగ్ర అంచనా (సీసీఏ), పీరియాడికల్ మూల్యాంకనాలను అనుసరించనున్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ఆయా ఉన్నత విద్యా సంస్థలే సర్టిఫికెట్‌లను మంజూరు చేస్తాయి. ఆ సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్‌ఏడీ)లో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి.
ఉన్నత విద్యలో హెరిటేజ్, కల్చర్
Published Wed, Mar 22 2023 3:53 AM | Last Updated on Wed, Mar 22 2023 8:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment