![Colored Rims woos the gifting market with its personalised nesting dolls - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/9/nesting-dolls-3.jpg.webp?itok=pyw4pvYz)
ఒకప్పుడు చదువులు పూర్తయ్యాక గానీ ఉద్యోగాన్వేషణ మొదలయ్యేది కాదు. ఇప్పుడా పరిస్థితులు లేవు. వేగంగా పెరిగిపోతున్న టెక్నాలజీని ఒడిసి పట్టుకుని ఆసక్తి ఉన్న రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తుంటే, మరికొందరు నైపుణ్యాలను ఔపోసన పట్టి ఏకంగా స్టార్టప్‌లతో దూసుకుపోతున్నారు. వాళ్లు నిలదొక్కుకోవడమేగాక, మరికొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మన్‌ప్రీత్ సింగ్, శ్రేయా గుప్తా, శృతి చౌహాన్‌లు ఈ బాటలోనే నడుస్తూ ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు.
మన్‌ప్రీత్ సింగ్, శ్రేయా గుప్తా, శృతి చౌహాన్‌లు భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాజీ తొలి బ్యాచ్ విద్యార్థులు. డిగ్రీ నుంచి మంచి స్నేహంగా మెలిగిన ఈ ముగ్గురు తరువాత ఫ్యాషన్ మేనేజ్ మెంట్‌లో మాస్టర్స్ పూర్తిచేశారు. మాస్టర్స్ చేసే సమయంలో ‘ముగ్గురం కలిసి కొత్తగా ఏదైనా చేద్దాం. ఉద్యోగాలు కాకుండా మనమే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిద్దాం’ అనుకున్నారు.
2015లో మాస్టర్స్ అయ్యాక ముగ్గురూ మూడు రంగాలను ఎంచుకుని వారి ఉద్యోగాల్లో బిజీ అయిపోయినా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కష్టసుఖాలు పంచుకోవడం మానలేదు వారు. ఈ క్రమంలోనే ఒకరోజు శృతి.. ‘‘హ్యాండ్ మేడ్ మార్కెట్ బావుంది. దీనిలో ఏదైనా కొత్తగా చేద్దాం’’ అని ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనే నేడు ఈ ముగ్గురు స్నేహితుల స్టార్టప్‌కు పునాది.
కలర్డ్ రిమ్స్
కాలేజీ రోజుల నుంచి బాటిల్ క్యాప్స్ మీద వివిధ రకాల పెయింటింగ్‌లు వేసి ఆకట్టుకునే శృతి ప్రతిపాదన అందరికి నచ్చింది. దీంతో వినూత్నమైన హ్యాండ్ మేడ్ పెయింటింగ్‌ను కలర్‌పుల్‌గా తీసుకువస్తే బావుంటుందని భావించారు. ఈ క్రమంలోనే 2016 బెంగళూరులో ‘కలర్డ్ రిమ్స్’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించి నెస్టింగ్ డాల్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు.
నెస్టింగ్ డాల్స్ సెట్‌లో మొత్తం ఆరు బొమ్మలు ఉంటాయి. 17 సెంటీమీటర్ల నుంచి 4.5 సెంటీమీటర్ల మధ్య పరిమాణంలో ఈ డాల్స్ ఉంటాయి. బొమ్మల సైజుతోపాటు బొమ్మల మీద ఉన్న ఆకారాలు మారడం ఈ బొమ్మల ప్రత్యేకత.
కలర్డ్ రిమ్స్ టీమ్ వారణాసి, చెన్నైలలో దొరికే బీచ్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేస్తున్నారు. కర్రను సిలిండర్ ఆకారంలోకి మార్చడమే ఈ డాల్స్ తయారీలో ముఖ్యమైన... కష్టమైన పని. బొమ్మ ఆకారం తయారయ్యాక దానిమీద వివిధ రకాల పెయింటింగ్స్‌తో అందంగా తీర్చిదిద్దుతారు. పెయింటింగ్స్‌లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, పాతకాలపు బొమ్మల ప్రతిరూపాలు ఉండేలా పెయింట్ చేస్తారు. కస్టమర్లు ఈ బొమ్మలను ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలనుకున్నప్పుడు వారి అభిరుచి మేరకు, సూచించిన విధంగా వివిధ రూపాలను బొమ్మలపై చిత్రీకరిస్తారు. దీనిలో ముఖ కవళికలు అన్ని స్పష్టంగా ఉండేలా తయారు చే స్తారు. చెక్కబొమ్మల(నెస్టింగ్ డాల్స్) పై రంగురంగుల పెయింటింగ్స్ వేసి దేశంలోని వివిధ విమానాశ్రయాలు, షాప్స్‌లో విక్రయిస్తున్నారు. వీరి బొమ్మలకు మంచి ఆదరణ ఉంది.
బెంగళూరు టు చండీగఢ్...
విక్రయాలు బాగానే జరుగుతున్నా, తయారీకి అయ్యే ఖర్చు కంటే అమ్మగా వచ్చే ఆదాయం తక్కువగా ఉండడాన్ని ముగ్గురు గమనించారు. దీనిని అధిగమించడానికి 2017లో స్టార్టప్‌ను బెంగళూరు నుంచి చండీగఢ్‌కు మార్చారు. జీఎస్టీ భారం, జీవన వ్యయం, ముడిసరుకు కొనుగోలు ఖర్చులు తగ్గడంతో నెస్టింగ్ డాల్స్ తయారీ భారం తగ్గింది. ప్రస్తుతం ఈ స్టార్టప్‌లో శ్రేయా, మన్‌ప్రీత్‌లు మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ చూసుకొంటుండ గా, శృతి ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది.
వీళ్ల టీమ్‌లో మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. కొంతమంది కాలేజీ విద్యార్థులు, వికలాంగ కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. కరోనా సమయంలో బాగా పడిపోయిన కలర్డ్ రిమ్స్‌కు, కుటుంబాల్లోని అనుబంధాల థీమ్‌ను జోడించి డాల్స్‌ను రూపొందించడంతో ఎక్కువ మంది ఈ డాల్స్‌కు కనెక్ట్ అయ్యారు. దీంతో ఆన్‌లైన్ విక్రయాలు పెరిగాయి. కుక్క, పిల్లి, తాబేలు బొమ్మలకు ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. అంతేగాక తమకు ఎంతో ఇష్టమైన వారి ముఖచిత్రాలను బొమ్మలపై చిత్రించి బహుమతి ఇవ్వాలనుకున్న వారు సైతం వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముగ్గురు స్నేహితుల నెస్టింగ్ డాల్స్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment