వారణాసిలో పుట్టి పెరిగిన కౌశికి అగర్వాల్ అక్కడ దివాలా తీసిన చెక్క బొమ్మలకు కొత్త అందాలు తెచ్చిపెట్టారు. కార్మికులలో ఆత్మవిశ్వాసం నింపి లాభాలతో ముందుకు సాగుతున్నారు.
రోజులు మారాయి. బనారసి బొమ్మల పాత డిజైన్లను కొనేవారు తగ్గిపోయారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బొమ్మలు తయారుచేయలేకపోయారు. జీవనాధారం కోసం ఈ కళాకారులంతా గ్రామాల నుంచి మహానగరాలకు తరలిపోవడం ప్రారంభించారు. ఈ దుస్థితి కౌశికి మనస్సును కదిలించింది. ఈ కళను నిలబెట్టడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు అప్పటికే ఎంబిఏ పూర్తిచేసిన కౌశికి ముందుగా. ఆ కళాకారులంతా ఎందుకు వారి పని మానుకున్నారో తెలుసుకోవాలనుకున్నారు. ‘బొమ్మలు కొనేవారు సంఖ్య తగ్గిపోవడంతో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఆ కారణంగానే ఈ పనులు మానేసి తామంతా నగరాలకు తరలిపోతున్నాం’ అని చెప్పారు వారు.
నేటికీ కొందరు పనిచేస్తున్నారు...
నేటికీ ఆ కళాకారులలో కొందరు మంచి పనిమంతులు ఉన్నారు. అటువంటి వారి నుంచి మూడు కుటుంబాలను ఎంచుకున్నారు కౌశికి. వారు చేస్తున్న పనికి ఆధునికత జోడిద్దామని సూచించారు. ఈ చెక్క బొమ్మల మీద వారు లట్టు పని చేస్తారు. లట్టు అనేది హిందీ పదం. ఈ పదానికి అలంకరించడం అని అర్థం. కొత్తవిధానంలో బొమ్మలు తయారు చేయడానికి తన సృజనను జోడించారు కౌశికి. టేబుల్ వేర్, ఫర్నిచర్, కోట్ హ్యాంగర్లు... ఇలా కొత్త కొత్త బొమ్మలను సైతం బనారసీ విధానంలోనే రూపొందిస్తున్నారు. వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించేలా మార్పులు చేసి తయారుచేయించారు కౌశికి. టేబుల్ వేర్‌కి మాత్రం సహజ రంగులు వేసి, ఆహారపదార్థాలకు రంగులు అంటకుండా లక్క పూత పూస్తున్నారు. అందువల్ల వీటిని నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఎక్కువసేపు నీళ్లలో నానబెట్టకుండా ఉన్నంతవరకు ఈ వస్తువులు పాడు కాకుండా, కొత్తగా ఉంటాయి... అంటారు కౌశికి.
శ్రమ ఫలితం...
కౌశికి విజయం వెనుక చాలా కష్టం ఉంది. కళాకారులను ఒప్పిండానికి ఎంతో ఇబ్బంది పడ్డారు కౌశికి. కొన్ని తరాలుగా వారంతా ఈ పనిలోనే ఉన్నారు కనుక ఆ పని వారు మాత్రమే చేయగలరు. కొంతకాలానికి వారే కొత్త కొత్త డిజైన్లతో ముందుకు వచ్చారు. ఈ డిజైన్లను వినియోగదారులు బాగా ఆదరించారు. వస్తువులకు గిరాకీ పెరగడంతో, వృత్తి వదిలి వెళ్లిపోయిన వారంతా మళ్లీ ఒక్కరొక్కరుగా వెనక్కు రావడం ప్రారంభించారు. వ్యాపారం వృద్ధి చేసుకుని, పాత ఇళ్లను కొత్తగా మార్పులు చేసుకున్నారు. షాపులను కొత్తగా అందంగా తీర్చిదిద్దుకున్నారు. తండ్రి నుంచి దూరంగా వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు మళ్లీ వెనక్కు వచ్చి, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కొత్త తరం వారు ఉత్సాహంగా పనిచేస్తూ, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు... అంటారు కౌశికి. ‘‘కళాకారులంతా నిజాయితీగా నిబద్ధతతో పనిచేయడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది.’’ అంటున్న కౌశికి ఒంటరిగా పోరాడి ఇంత విజయం సాధించారు.
– జయంతి
వ్యాపారం చేయడానికి మొట్టమొదటి పెట్టుబడి మా నాన్నగారు పెట్టారు. ఆ డబ్బుని సంవత్సర కాలంలోనే నాన్నకి తీర్చేశాను. ఇప్పుడు లాభాలు సంపాదించడం ప్రారంభించాక ఆ లాభాలను లట్టు కళాకారుల కోసం వినియోగిస్తున్నాను. వాళ్లు ఎంతో శ్రమకోర్చి చేస్తున్న పనికి తగ్గ ఫలితం అందకపోతే మళ్లీ వారు పనిచేయలేకపోతారు కదా, అందుకే వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నాను. మరిన్ని డిజైన్లను ఎంపిక చేయాలనుకుంటున్నాను. తాటాకుతో అల్లిన బుట్టలు, చాపల మీద ఈ డిజైను ఎలా వేద్దామా అని ఆలోచిస్తున్నాను. వారణాసి పురాతన హస్తకళను అందరికీ పరిచయం చేయాలనేదే నా సంకల్పం.
– కౌశికి అగర్వాల్
Comments
Please login to add a commentAdd a comment