అలహాబాద్ హైకోర్టు
ప్రయాగ్‌రాజ్: సమాజం ఆమోదించకున్నా నేటి యువత సహ జీవన సంబంధాలకు మొగ్గు చూపుతోందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో నైతిక విలువలను కాపాడేందుకు తగు పరిష్కారం లేదా నిబంధనలను రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. వివాహం పేరుతో మహిళతో శారీరక సంబంధం కొనసాగించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారణాసి వాసి ఆకాశ్ కేసరి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ నళిన్ కుమార్ శ్రీవాస్తవ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘సహ జీవనం వైపు యువతీయువకులు ఆకర్షితులవుతున్నారు. కొన్నాళ్లు కలిసున్నాక ఇష్టం లేకుంటే అతడు లేక ఆమె చాలా సులువుగా ఈ బంధం నుంచి బయటపడేందుకు అవకాశముంది. అందుకే, ఇలాంటి బంధాలకు యువత తొందరగా లొంగిపోతోంది. అందుకే, సమాజంలో నైతిక విలువలను పరిరక్షించేందుకు సహ జీవన సంబంధాలకు ఒక పరిష్కారం కనుగొనాల్సిన సమయమిదే’అని పేర్కొన్నారు. ఓ మహిళతో ఆకాశ్ కేసరి ఆరేళ్లపాటు సహజీవనం చేశాడు.
అనంతరం పెళ్లికి నిరాకరించాడంటూ బాధిత మహిళ సార్‌నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌సీ, ఎస్టీ చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కేసరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆ మహిళ మేజర్ అనీ, అంగీకారంతోనే ఆమె సహజీవనం చేసిందని కేసరి లాయర్ వాదించారు. ఆమెకు కేసరి అబార్షన్ చేయించలేదని, పెళ్లి చేసుకుంటానని అతడు మాట కూడా ఇవ్వలేదని చెప్పారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కేసరికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment