
కార్టన్ కళలు
చాలామందికి రోజూ గుడ్లను తినడం బాగా అలవాటు. అలాంటి వారు ఒకటి, రెండు డజన్లు ఎందుకు తెచ్చుకుంటారు చెప్పండి.. కార్టన్లకు కార్టన్లు ఒకేసారి తెచ్చేసుకుంటారు. మరి గుడ్లన్నీ అయిపోయాక, ఆ కార్టన్లను చెత్తబుట్టల్లో పడేస్తుంటారు. ఇకపై అలాంటి పొరపాటు చేయకండి. ఎందుకంటే... ఓసారి పక్కనున్న ఫొటోలను చూస్తే మీకే అర్థమవుతుంది.
కావలసినవి: ఎగ్ కార్టన్లు, రంగురంగుల పెయింట్స్, కత్తెర, కలర్ స్కెచ్ పెన్స్, గ్లూ
తయారీ: ముందుగా ఈ కార్టన్లతో ఫొటో ఫ్రేములను ఎలా అలంకరించుకోవచ్చో తెలుసుకుందాం. కార్టన్లలో ఒక్కో గుడ్డు పెట్టడానికి.. ఒక్కో గుంట ఉంటుంది. మొదటగా ఒక్కో గుంటను విడివిడిగా కట్ చేసుకోవాలి. ఒకే సైజులో కాకుండా... కొన్ని చిన్నగా, పెద్దగా చేసుకోవాలి. అలా చేస్తే... వాటిని ఒకదాంట్లో ఇంకోదాన్ని పెట్టి అతికించాలి. అప్పుడవి అచ్చం పువ్వుల్లా కనిపిస్తాయి. కావాలంటే వాటికి మీకు నచ్చిన రంగును పూయొచ్చు. ఇప్పుడు వాటిని ఫొటో ఫ్రేమ్, మిర్రర్ ఫ్రేమ్‌ల చుట్టూ అతికిస్తే సరి. అలాగే ఈ కార్టన్ ఫ్లవర్స్‌కు స్టిక్స్ అతికించి, ఫ్లవర్ వాజుల్లోనూ పెట్టుకోవచ్చు. అంతే.. వీటితో పిల్లలకు ఇష్టమైన బొమ్మలను తయారు చేయొచ్చు. అలాగే.. వీటితో విండ్ చైమ్స్‌ను, ఆ ఫ్లవర్లలో చిన్న లైట్లు పెట్టి బెడ్‌లైట్స్‌గానూ మార్చుకోవచ్చు. ‘వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత’ అన్నట్లు... వీటిని ఎన్నోరకాల ఐటమ్స్‌గా తయారు చేసుకోవచ్చు.