
మీనాకుమారికి హుసేన్ ఫిదా!
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్‌కి అలనాటి బాలీవుడ్ అందాల తార మీనాకుమారిని కలుసుకున్నపుడు మాట పెగల్లేదట. ఆమె అందాన్ని చూడగానే హుసేన్ నిశ్చలంగా మారిపోయాడని ఆయన శిష్యురాలు, చిత్రకారిణి ఇలా పాల్ తన తాజా పుస్తకంలో వెల్లడించారు. 1967లో పాల్‌కు జన్మించిన బిడ్డను చూడటానికి ఆసుపత్రికి వెళ్లినపుడు హుసేన్.. మీనాకుమారిని కలిశారు. ఆమె కూడా ఆ సమయంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
‘తన అందమైన రూపం, ప్రత్యేకమైన గొంతుతో ప్రేక్షకులను కట్టిపడేసిన మీనాకుమారి, హుసేన్‌ను కలుసుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపింది. ఆమెను చూడగానే హుసేన్ నోటి నుంచి మాటలు రాలేదు’ అని ‘హుసేన్: పొర్ట్రయిట్ ఆఫ్ ఆర్టిస్ట్’ పుస్తకంలో పాల్ పేర్కొన్నారు. అలా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆ తరువాత అడిగితే..‘ నేనేం చేయను? పెదవులు కదల్చే లోగా ఆమె నావైపు చూసిన తీరుతో మాట ఆగిపోయింది’ అని హుసేన్ బదులిచ్చినట్లు తెలిపారు.