
సోషల్ మీడియా జనాల సమయాన్నే కాదు ప్రాణాల్ని కూడా కబళిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల్.. తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఏప్రిల్ 24న ప్రాణాలు తీసుకుంది. చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడటంపై పలువురూ విచారం వ్యక్తం చేశారు. మిషా ఆత్మహత్యకు గల కారణాన్ని ఆమె కుటుంబసభ్యులు తాజాగా వెల్లడించారు.
డిప్రెషన్
మిషా.. ఇన్‌స్టాగ్రామ్.. ఫాలోవర్లే తన ప్రపంచం అనుకుంది. 10 లక్షల మంది ఫాలోవర్లను సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ తను అనుకున్నదానికి భిన్నంగా ఫాలోవర్స్ తగ్గుతూ పోవడంతో తను చాలా బాధపడింది. ఏకంగా డిప్రెషన్‌లోకి వెళ్లింది. తనకసలు విలువే లేదని కుమిలిపోయింది. నా ఇన్‌స్టా ఫాలోవర్స్ డ్రాప్ అవుతున్నారు, నేనేం చేయను, నా కెరీర్ ముగిసిపోయినట్లే అని నన్ను హగ్ చేసుకుని భయపడుతూ ఏడ్చేది. ఇన్‌స్టాగ్రామే సర్వస్వం కాదని, ఏమీ కాదని ఓదార్చేవాళ్లం.
న్యాయవిద్య చదివి..
ఎల్‌ఎల్‌బీ (న్యాయ విద్య) పూర్తి చేశావ్.. పీసీఎస్‌జేకు ప్రిపేర్ అవుతున్నావు. త్వరలోనే జడ్జివి అవుతాను. కెరీర్ గురించి భయపడాల్సిన పనిలేదని వెన్నుతట్టాం. కానీ, తనకు మా మాటలు వినిపించలేదు. ఇన్‌స్టాగ్రామ్ కోసం ప్రాణాలు తీసుకునేవరకు వెళ్తుందని అనుకోలేదు అని ఆమె ఫ్యామిలీ మెంబర్ చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) స్పందించింది. ఇలాంటి రోజొకటి వస్తుందని చాలాకాలంగా భయపడుతూ వస్తున్నాను. జీవితాన్ని ప్రేమించడానికి బదులు సోషల్ మీడియాలో కనిపించే ఫాలోవర్లు, వచ్చే లైకుల సంఖ్యే ప్రేమనుకుంటున్నారు.
వర్చువల్ ప్రేమ కబళించేసింది
ఈ వర్చువల్ లవ్.. నిజమైన ప్రేమను కంటికి కనబడకుండా చేస్తుందన్న భయం ఉండేది. ఇప్పుడదే నిజమైంది. లైక్స్, కామెంట్స్ చూసి తాత్కాలికంగా సంబరపడిపోతున్నారు. మీరు పొందిన డిగ్రీపట్టాలకన్నా కూడా మీకు వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి విలువైనవారిగా పరిగణించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇలాంటివి చూస్తుంటే మనసు ముక్కలవుతోంది అని సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చింది.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: 'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు