పెయింటర్ వచ్చాడా అని గతంలో అడిగేవారు. ఇకపై పెయింటరమ్మ వచ్చిందా అని అడగాలి. గ్రామీణ తమిళనాడులో స్త్రీ ఉపాధికి కొత్త మార్గం తెరుచుకుంది. మగవారికే పరిమితమైన వాల్ పెయింటింగ్‌లో జపాన్ పెయింట్ సంస్థ ‘నిప్పన్’ అక్కడ 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వారు నిచ్చెనలు ఎక్కి బ్రష్ పట్టుకుంటున్నారు గోడలకే కాదు బతుకు దారికీ రంగు వేస్తున్నారు.
‘గ్రామీణ స్త్రీలకు ఉపాధి చూపించాలి. శ్రమ జీవనంలో ఉండే ఆ స్త్రీలు శ్రమతో నిండిన వాల్ పెయింటింగ్‌లో రాణించగలరని భావించాం. అదే ఇప్పుడు నిజమైంది’ అంటారు నిప్పన్ పెయింట్స్ (ఆసియా) విభాగం ప్రతినిధి మహేష్ ఆనంద్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ‘ఎన్‌శక్తి’లో భాగంగా ఆ దిగ్గజ సంస్థ తమిళనాడులోని కోయంబత్తూరు, వెల్లూరు, రామనాథపురం... వంటి జిల్లాల్లో చిన్న ఊళ్ల నుంచి 1000 మంది స్త్రీలకు వాల్ పెయింటింగ్‌లో శిక్షణ ఇవ్వాలని రెండేళ్ల క్రితం నిశ్చయించుకుంది. ఇప్పటికి ఐదువందల మంది స్త్రీలు శిక్షణ పొంది వాల్ పెయింటింగ్ చేస్తున్నారు.
ఆమె ఇప్పుడు కాంట్రాక్టర్
మైలాదుతురై అనే ఊరికి చెందిన దుర్గ మొదటిసారి పెయింటింగ్ బ్రష్ పట్టుకున్నప్పుడు ఈ పనిలో రాణించగలనా అనుకుంది. కాని ఇప్పుడు ఆమె పెయింటింగ్ కాంట్రాక్టర్‌గా తన జీవితాన్నే మార్చుకుంది. ‘వాల్ పెయింటింగ్‌లో శిక్షణ తీసుకున్నాక పెయింటింగ్ మొదలెట్టాను. నా చురుకుదనం చూసి నన్నే కాంట్రాక్ట్‌లు తెచ్చుకోమని నా తోటి మహిళా పెయింటర్లు సూచించారు. ఇప్పుడు నేనే కాంట్రాక్ట్ తెచ్చి పని చేయిస్తున్నాను’ అంటుంది దుర్గ. అయితే ఆ పని అంత సులువు కాలేదు. ఇంట్లో వాళ్లు ఆమెను ఆ పనికి పంపడానికి అంగీకరించలేదు.
‘నేను వాల్‌పెయింటింగ్ చేస్తున్న దృశ్యాన్ని ఫోన్‌లో వీడియోగా షూట్ చేసి ఇంట్లో చూపిస్తే వాళ్లు ఆ పని నేను బాగా చేస్తున్నానని అంగీకరించారు’ అని దుర్గ అంది. ‘ఆ వీడియో నా ప్రచారం కోసం కూడా వాడుతున్నాను. అది చూసి నాకు పని ఇస్తున్నారు’ అని అంది దుర్గ. వాల్ పెయింటింగ్‌లో ఆసక్తి ఉన్న గ్రామీణ స్త్రీలను వెతికి నిప్పన్ సంస్థతో అనుసంధానం చేసే పని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. ట్రయినింగ్ 12 రోజులు ఉంటుంది. ఆ 12 రోజుల్లో పెయింటింగ్‌కు సంబంధించిన మెళకువలు, జాగ్రత్తలు నేర్పిస్తారు.
‘మేమందరం చీరలు కట్టుకుని ఊళ్లల్లో ఉండేవాళ్లం. ప్యాంటు షర్టు వేసుకుని ఈ పని చేయాలంటే కొంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అలవాటైపోయింది’ అని వెన్‌మతి అనే పెయింటర్ నవ్వుతూ అంది. అయితే సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఈ మహిళా పెయింటర్లు బృందాలుగా ఏర్పడి బయటి నగరాలకు వెళ్లి పని చేస్తామంటే ఇళ్లల్లో పంపిస్తున్నారు. ‘మేము రెండేసి నెలలు కోయంబత్తూరు, చిదంబరం వంటి నగరాలకు వెళ్లి పెయింట్ చేసి వస్తున్నాం’ అని ఈ పెయింటర్లు చెప్పారు. వీరికి ఒక్కొక్కరికి 650 రూపాయల కూలీ ఆ పైన దొరుకుతోంది.
చెన్నైలో 2000 మంది
నిప్పన్ సంస్థ ఒక్క చెన్నైలోనే రెండు వేల మంది మహిళా పెయింటర్‌లను తయారు చేయాలని తాజాగా నిశ్చయించుకుంది. ఇందుకు చెన్నై రోటరీ క్లబ్‌తో ఒక ఒడంబడిక చేసుకుంది. వాల్ పెయింటింగ్‌లో ఆసక్తి ఉన్న మహిళలను రోటరీ క్లబ్ నిప్పన్‌తో అనుసంధానం చేస్తుంది. ‘వాల్ పెయింటింగ్ ఇవాళ్టికి మగవారి పనిగా ఉంది. కాని ఈ పనిలో స్త్రీలు బాగా రాణిస్తారు’ అని రోటరీ క్లబ్ ప్రతినిధి అన్నారు. పెయింటింగ్‌లో సురక్షితంగా ఎలా ఉండాలో కూడా వీరికి తెలుసు. ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే పని చేస్తున్నారు. ‘వీరు పెయింటింగ్‌లో శిక్షణ పొందాక ఇంటీరియర్ డిజైన్ సంస్థలకు, కన్‌స్ట్రక్షన్ సంస్థలకు మేము వారిని అనుసంధానం చేస్తాం. పని దొరికేలా కూడా చూస్తాం’ అని నిప్పన్ సంస్థ ప్రతినిధి చెప్పారు.
స్త్రీలకు కొత్త బతుకుదారి తెరుచుకోవడం... అది రంగుల దారికావడం మంచి విషయం.
Comments
Please login to add a commentAdd a comment