walls
-
గోడలకు వేలాడే సంగీతం ఇది.. ఎప్పుడైనా విన్నారా!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అలనాటి సామెతల్ని కొత్తగా నిర్వచిస్తోంది. గోడలకూ చెవులుంటాయని పెద్దలు చెబితే.. గోడల నుంచి సుస్వరాలు వినిపిస్తాయని సరికొత్త మ్యూజిక్ ఫ్రేమ్స్ నిరూపిస్తున్నాయి. గోడకు ఫొటో ఫ్రేమ్స్లానే తమ మ్యూజిక్ ఫ్రేమ్‌ను కూడా వేలాడదీస్తే ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చని అంటోంది ప్రసిద్ధ గృహోపకరణాల బ్రాండ్ శామ్సంగ్..తాజాగా ఈ బ్రాండ్ రూపొందించి సిటీ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ వైర్లెస్ మ్యూజిక్ ఫ్రేమ్ ద్వారా వీనులవిందైన సంగీతాన్ని వినడం మాత్రమే కాదు వ్యక్తిగత ఫొటోలు, కళాత్మక చిత్రాలు సైతం పొందుపర్చుకోవచ్చు. డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచి్చన ఈ ఫ్రేమ్.. అందాన్ని పెంచే ఇంటీరియర్లా అమరిపోతుందంటున్నారు.ఇవి చదవండి: ఆన్లైన్ గేమర్స్‌ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ.. -
గోడపై మూత్రం పోస్తే చింది మీదనే పడుతుంది
లండన్: బహిరంగ మూత్ర విసర్జన ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న దురలవాటు. దీని కారణంగా పరిసరాలు దుర్గంధంతో నిండి అందరూ ఇబ్బందులు పడుతున్నారు. లండన్ యంత్రాంగం దీనికి ఓ విరుగుడును కనిపెట్టింది. గోడలపై పోసే మూత్రం చింది తిరిగి వారిపైనే పడితే..? ఆ పాడు పనిని మానుకుంటారేమో. పారదర్శక వాటర్ రిపెల్లెంట్ రసాయనాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని గోడలపై స్ప్రే చేస్తే పోసిన వ్యక్తి పైకే మూత్రం చింది పడుతుంది. దుస్తులు తడిచిపోతాయి. వారికి ఇదే తగిన శిక్ష అవుతుంది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ ఇందుకోసం సోహో ప్రాంతాన్ని ఎంచుకుంది. సోహోలో 24 గంటలూ నడిచే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, ఇతర వినోద ప్రాంతాలతోపాటు నివాస ప్రాంతాలూ ఉన్నాయి. సుమారు 0.6 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలోని సోహోలో 400కు పైగా ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. పబ్లిక్ టాయిలెట్లు చాలినన్ని లేకపోవడంతో జనం రోడ్డు పక్కన గోడలపైనే మూత్రం పోసేస్తున్నారు. వీధులు దుర్గంధంతో నిండిపోతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. దీంతో వీధులను శుభ్రంగా ఉంచేందుకు లండన్ యంత్రాంగం ఏటా రూ.10.26 కోట్లు వెచ్చిస్తోంది. అయినా ఫలితం లేకపోవడంతో తాజాగా కొత్త ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చింది. ముందుగా సమస్య తీవ్రంగా ఉన్న 12 ప్రాంతాల్లోని గోడలపై ఈ ద్రావకాన్ని స్ప్రే చేయించింది. ఆయా ప్రాంతాల్లో ఇది మూత్రం పోసే గోడ కాదు (దిస్ వాల్ ఈజ్ నాట్ ఫర్ యూరినల్) అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇదే ప్రయోగాన్ని మరో ప్రాంతంతోపాటు జర్మనీలోనూ ప్రయోగాత్మకంగా చేసి, మంచి ఫలితం సాధించారు. ఆరునెలల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని స్థానిక అధికారి ఒకరు చెప్పారు. -
‘చుక్కలు’ చూపించే హోటల్
ఆరుబయట పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టడం... గ్రాండ్ పేరెంట్స్‌తో కథలు చెప్పించుకోవడం... 80ల్లోని పిల్లలకు ఓ మధురమైన జ్ఞాపకం. అలా ముచ్చట్లతోనే నిద్రలోకి జారుకునేవాళ్లు. ఇప్పుడు అట్లాంటి ఆరుబయట పడుకునే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది స్విట్జర్లాండ్‌లోని ఓ హోటల్. దాని పేరు నల్ స్టెర్న్ హోటల్ (జీరో స్టార్ హోటల్). దీని ప్రత్యేకత ఏంటంటే... ఒక ప్లాట్‌ఫామ్ మీద డబుల్ కాట్బెడ్, అటూఇటూ ల్యాంప్స్. అంతే.. గోడలు ఉండవు. తలు పులు ఉండవు. పైకప్పు అసలే లేదు. ఏకాంతం, రక్షణ కలిగించే ఏ సదు పాయమూ ఉండబోదు. హోటలియర్ డానియేల్ కార్బొనియెర్ రూపొందించిన ఈ ప్రాజెక్టు ఆలోచన స్విస్ ఆర్టిస్టులు ఫ్రాంక్ రిక్లిన్, పాట్రిక్ రిక్లిన్ బ్రదర్స్‌ది. ఇక్కడ స్టే చేస్తే.. ‘రాత్రంతా నిద్ర పట్టలేదు...’, ‘ఏం చప్పుళ్లురా బాబోయ్’ అనే ఫిర్యాదులు రావొచ్చు. కానీ ఆ ఆలోచన కల్పించేందుకే దీన్ని తయారు చేశామంటున్నారు రిక్లిన్ బ్రదర్స్. వచ్చిన అతిథులకు ప్రపంచంలో ఉన్న సమస్యలు ప్రత్యేకించి... వాతావరణంలో వస్తున్న మార్పులు, యుద్ధం, మాయమవుతున్న మానవత్వం వంటివన్నీ భూమికెంత నష్టం చేస్తున్నాయో తెలియజెప్పడమే ఈ ‘జీరో స్టార్ హోటల్స్’ లక్ష్యమని చెబుతున్నారు. ఇక హోటల్లో ఒక నైట్ స్టే చేయాలంటే.. దాదాపు రూ. 27 వేలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రింక్స్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ అక్కడికే తెచ్చిస్తారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతానికి సైలన్ గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ పక్కన, మరో వైన్యార్డ్లో, పిక్చర్‌స్క్వేర్ కొండ పక్కన వీటిని ఏర్పాటు చేశారు. -
మా దారి రంగుల దారి
పెయింటర్ వచ్చాడా అని గతంలో అడిగేవారు. ఇకపై పెయింటరమ్మ వచ్చిందా అని అడగాలి. గ్రామీణ తమిళనాడులో స్త్రీ ఉపాధికి కొత్త మార్గం తెరుచుకుంది. మగవారికే పరిమితమైన వాల్ పెయింటింగ్‌లో జపాన్ పెయింట్ సంస్థ ‘నిప్పన్’ అక్కడ 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వారు నిచ్చెనలు ఎక్కి బ్రష్ పట్టుకుంటున్నారు గోడలకే కాదు బతుకు దారికీ రంగు వేస్తున్నారు. ‘గ్రామీణ స్త్రీలకు ఉపాధి చూపించాలి. శ్రమ జీవనంలో ఉండే ఆ స్త్రీలు శ్రమతో నిండిన వాల్ పెయింటింగ్‌లో రాణించగలరని భావించాం. అదే ఇప్పుడు నిజమైంది’ అంటారు నిప్పన్ పెయింట్స్ (ఆసియా) విభాగం ప్రతినిధి మహేష్ ఆనంద్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ‘ఎన్‌శక్తి’లో భాగంగా ఆ దిగ్గజ సంస్థ తమిళనాడులోని కోయంబత్తూరు, వెల్లూరు, రామనాథపురం... వంటి జిల్లాల్లో చిన్న ఊళ్ల నుంచి 1000 మంది స్త్రీలకు వాల్ పెయింటింగ్‌లో శిక్షణ ఇవ్వాలని రెండేళ్ల క్రితం నిశ్చయించుకుంది. ఇప్పటికి ఐదువందల మంది స్త్రీలు శిక్షణ పొంది వాల్ పెయింటింగ్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు కాంట్రాక్టర్ మైలాదుతురై అనే ఊరికి చెందిన దుర్గ మొదటిసారి పెయింటింగ్ బ్రష్ పట్టుకున్నప్పుడు ఈ పనిలో రాణించగలనా అనుకుంది. కాని ఇప్పుడు ఆమె పెయింటింగ్ కాంట్రాక్టర్‌గా తన జీవితాన్నే మార్చుకుంది. ‘వాల్ పెయింటింగ్‌లో శిక్షణ తీసుకున్నాక పెయింటింగ్ మొదలెట్టాను. నా చురుకుదనం చూసి నన్నే కాంట్రాక్ట్‌లు తెచ్చుకోమని నా తోటి మహిళా పెయింటర్లు సూచించారు. ఇప్పుడు నేనే కాంట్రాక్ట్ తెచ్చి పని చేయిస్తున్నాను’ అంటుంది దుర్గ. అయితే ఆ పని అంత సులువు కాలేదు. ఇంట్లో వాళ్లు ఆమెను ఆ పనికి పంపడానికి అంగీకరించలేదు. ‘నేను వాల్‌పెయింటింగ్ చేస్తున్న దృశ్యాన్ని ఫోన్లో వీడియోగా షూట్ చేసి ఇంట్లో చూపిస్తే వాళ్లు ఆ పని నేను బాగా చేస్తున్నానని అంగీకరించారు’ అని దుర్గ అంది. ‘ఆ వీడియో నా ప్రచారం కోసం కూడా వాడుతున్నాను. అది చూసి నాకు పని ఇస్తున్నారు’ అని అంది దుర్గ. వాల్ పెయింటింగ్‌లో ఆసక్తి ఉన్న గ్రామీణ స్త్రీలను వెతికి నిప్పన్ సంస్థతో అనుసంధానం చేసే పని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. ట్రయినింగ్ 12 రోజులు ఉంటుంది. ఆ 12 రోజుల్లో పెయింటింగ్‌కు సంబంధించిన మెళకువలు, జాగ్రత్తలు నేర్పిస్తారు. ‘మేమందరం చీరలు కట్టుకుని ఊళ్లల్లో ఉండేవాళ్లం. ప్యాంటు షర్టు వేసుకుని ఈ పని చేయాలంటే కొంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అలవాటైపోయింది’ అని వెన్మతి అనే పెయింటర్ నవ్వుతూ అంది. అయితే సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఈ మహిళా పెయింటర్లు బృందాలుగా ఏర్పడి బయటి నగరాలకు వెళ్లి పని చేస్తామంటే ఇళ్లల్లో పంపిస్తున్నారు. ‘మేము రెండేసి నెలలు కోయంబత్తూరు, చిదంబరం వంటి నగరాలకు వెళ్లి పెయింట్ చేసి వస్తున్నాం’ అని ఈ పెయింటర్లు చెప్పారు. వీరికి ఒక్కొక్కరికి 650 రూపాయల కూలీ ఆ పైన దొరుకుతోంది. చెన్నైలో 2000 మంది నిప్పన్ సంస్థ ఒక్క చెన్నైలోనే రెండు వేల మంది మహిళా పెయింటర్లను తయారు చేయాలని తాజాగా నిశ్చయించుకుంది. ఇందుకు చెన్నై రోటరీ క్లబ్‌తో ఒక ఒడంబడిక చేసుకుంది. వాల్ పెయింటింగ్‌లో ఆసక్తి ఉన్న మహిళలను రోటరీ క్లబ్ నిప్పన్‌తో అనుసంధానం చేస్తుంది. ‘వాల్ పెయింటింగ్ ఇవాళ్టికి మగవారి పనిగా ఉంది. కాని ఈ పనిలో స్త్రీలు బాగా రాణిస్తారు’ అని రోటరీ క్లబ్ ప్రతినిధి అన్నారు. పెయింటింగ్‌లో సురక్షితంగా ఎలా ఉండాలో కూడా వీరికి తెలుసు. ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే పని చేస్తున్నారు. ‘వీరు పెయింటింగ్‌లో శిక్షణ పొందాక ఇంటీరియర్ డిజైన్ సంస్థలకు, కన్స్ట్రక్షన్ సంస్థలకు మేము వారిని అనుసంధానం చేస్తాం. పని దొరికేలా కూడా చూస్తాం’ అని నిప్పన్ సంస్థ ప్రతినిధి చెప్పారు. స్త్రీలకు కొత్త బతుకుదారి తెరుచుకోవడం... అది రంగుల దారికావడం మంచి విషయం. -
రెండు గోడల మధ్య చిక్కుకున్న చిన్నారి
ఒంగోలు: ఆరేళ్లపాప రెండు గోడల మధ్య ఇరుక్కుపోయి దాదాపు రెండు గంటలకుపైగా తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాప సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఈ సంఘటన స్థానిక ఇందిరమ్మ కాలనీ మూడో లైనులో గురువారం జరిగింది. లక్కె ముద్దుల కృష్ణ, ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి పక్కపక్కనే ఇళ్లు నిర్మించుకున్నారు. రెండిళ్ల మధ్య సన్నని ఖాళీ వదులుకున్నారు. కనీసం అడుగు గ్యాప్ కూడా లేదు. కృష్ణ ఆరేళ్ల కుమార్తె మీనాక్షి ఆడుకుంటూ ఆ గ్యాప్‌లోకి వెళ్లి ఇరుక్కుపోయింది. కదల లేని స్థితిలో పాప కేకలు విని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు వచ్చారు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కొంతమంది పాపకు తాడు అందించి బయటకు తీసుకొద్దామని చేసిన యత్నం విఫలమైంది. మరికొంత మంది కర్ర సాయంతో బయటకు తీసేందుకు యత్నించగా అది కూడా విఫలమైంది. పాప తండ్రి అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావుతో పాటు ఒంగోలు ఫైర్ ఆఫీసర్ వై.వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. లోపలకు వెళ్లేందుకు, బాలికను రక్షించేందుకు పరిస్థితిని అంచనా వేసి గోడలను పగలగొట్టక తప్పదని నిర్ణయించుకున్నారు. పాపకు దెబ్బ తగలకుండా గోడకు తమ వద్ద ఉన్న అధునాతన యంత్రాలతో రంధ్రం చేసి గోడను పాక్షికంగా ధ్వంసం చేశారు. అనంతరం పాపను సురక్షితంగా బయటకు తీశారు. అప్పటి వరకూ జరుగుతున్న తతంగాన్ని ఉగ్గబట్టి చూస్తున్న జనంతో పాటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
వావ్.. త్రీడీ వాల్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఇల్లు కొనుక్కొన్నా.. పాత ఇల్లు అయినా వాల్ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. మార్కెట్లో వాల్ పేపర్లు రోల్స్ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10 ఇంటు 10 ఉంటే కనీసం రెండు రోల్స్ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకుంటుంది. త్రీడీలో వాల్: మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్ పేపర్లు సుమారు 1/1 సైజ్ నుంచి 20/20 సైజ్ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి వరకుంటుంది. త్రీడీ వాల్ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది. -
‘చెత్త’ గోడుకు ‘గోడ’ విరుగుడు
సాక్షి, హైదరాబాద్ : జనావాసాలకు చేరువగా ఉండే రైలు పట్టాలు చెత్తాచెదారంతో నిండి ఉండటం కనిపిస్తూనే ఉంటుంది. ట్రాక్‌కు చేరువగా ఉండే వారు ఇళ్లల్లోని చెత్తను పట్టాలపై వేస్తుండటంతో పెద్దమొత్తంలో చెత్త పోగై పట్టాలు అసహ్యంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అంటూ పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నా.. పట్టాలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్న రైల్వే బోర్డు.. ‘గోడ’పరిష్కారాన్ని కనుగొంది. జనావాసాలు ఉన్న చోట పట్టాలకు రెండువైపులా కాంక్రీట్ గోడలు నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే జోనల్ రైల్వే అధికారుల సూచనలు బోర్డు స్వీకరించగా.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులూ ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అడ్డుగోడలే పరిష్కారమని.. చాలా చోట్ల పట్టాలను ఆనుకుని పేదలు తాత్కాలిక ఇళ్లు నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల మురికివాడలున్నాయి. సాధారణ కాలనీల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నా.. మురికివాడలపై అంతగా దృష్టి లేదు. దీంతో ఇళ్లల్లోని చెత్తను రైల్వే పట్టాల వెంట స్థానికులు డంప్ చేస్తున్నారు. వీటిల్లోని ప్లాస్టిక్ సంచులు గాలికి కొట్టుకొచ్చి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్నాయని సిబ్బంది ఫిర్యాదు చేస్తున్నారు. ఆ సమస్య కన్నా కూడా రైల్వే స్థలాలు అత్యంత అసహ్యంగా కనిపిస్తుండటమే పెద్ద సమస్యగా మారింది. స్థానికుల్లో అవగాహన కోసం గతంలో అనేక సార్లు రైల్వే శాఖ యత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో అడ్డుగోడలు నిర్మించడమే సమస్యకు పరిష్కారంగా నిర్ణయించారు. తొలుత ఇనుప మెష్‌లు.. తొలుత ఇనుప మెష్‌లు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ దాన్ని చోరీ చేసే అవకాశాలుండటంతో విరమించుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో కాంక్రీట్ గోడ నిర్మించాలనుకుంటున్నారు. కానీ.. అవసరమైన నిధులు విడుదల చేయక ఎన్నో రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్న తరుణంలో గోడ కోసం భారీగా వ్యయం ఏంటని విమర్శలొస్తున్నాయి. అయితే స్వచ్ఛభారత్‌కు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తున్నందున గోడ నిర్మాణానికే రైల్వే శాఖ మొగ్గు చూపుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ‘ట్రాక్ పొడవునా గోడ ఉండదు. ఇళ్లు చేరువగా ఉన్న చోటే నిర్మిస్తారు. ఇది భారీ వ్యయం కాకపోవచ్చు’అని ఓ రైల్వే అధికారి అన్నారు. నిర్మించినా సాధ్యమా?.. గోడ నిర్మించినా సమస్య పరిష్కారమవుతుందన్న భరోసా లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కవర్లలో చెత్త మూటగట్టి గోడపై నుంచి ట్రాక్ వైపు గిరాటేసే అవకాశం ఉందని వాదన. అయితే గోడ ఎత్తుగా ఉండనున్నందున అన్ని చోట్లా చెత్త కవర్లు ఎత్తేసే అవకాశం ఉండదని, సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ పరిధిలోని ‘ది రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)’గోడ నిర్మాణ నమూనాలూ సిద్ధం చేసిందని, దీనికి రైల్వే బోర్డు పచ్చజెండా ఊపిందని చెబుతున్నారు. -
గోడలోకి తొంగి చూడొచ్చు!
వాషింగ్టన్: గోడలకు చెవులుంటాయని విన్నాం. కానీ గోడ అవతల కళ్లుంటాయనే విషయాన్ని కూడా ఇకపై గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గోడకు అవతలివైపు ఏం జరుగుతుందో ఇటువైపు ఉండి చూడొచ్చట. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో అభివృద్ధి పర్చారు. అయితే ఆ టెక్నాలజీ అత్యంత ఖరీదైనదే కాకుండా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం కష్టసాధ్యమైనది కావడంతో అంతగా ఉపయోగంలోకి రాలేదు. అయితే అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చాలా తక్కువ ఖర్చుతో గోడ లోపల ఏముందో తెలుసుకునే కొత్త టెక్నాలజీని స్కానర్‌ను అభివృద్ధి చేశారు. ఈ స్కానర్ ప్రత్యేకత ఏంటంటే... అంత్యంత తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన సింగిల్ ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్స్‌ను ఉపయోగించడమే. ఇవి గోడలో అడ్డుగా ఉన్న ఇటుక, కంకర, ఇనుము వంటివాటిని సులువుగా ఛేదించుకొని లోపలికి వెళ్లిపోతాయట. దీనివల్ల గోడలో ఎదుయ్యే సమస్యలను గుర్తించవచ్చని... ముఖ్యంగా నిర్మాణరంగ నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. -
గోడలపై 'గో ఇండియా గో బ్యాక్' నినాదం!
శ్రీనగర్ః భద్రతా దళాల కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని మృతిపై కశ్మీర్ లో కల్లోలం ఇంకా ఆగలేదు. బుర్హానీ మరణంపై అప్పట్నుంచీ ఏదో రకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా స్థానికుల ఇళ్ళు, గోడలపై హురియత్ నాయకుడి రాతలు మరోసారి అగ్నికి అజ్యం పోశాయి. కరడుగట్టిన హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ 'గో ఇండియా గో' నినాదాలు ఇప్పుడు కశ్మీర్ లో మరోసారి కలకలం రేపుతున్నాయి. స్థానికుల ఇళ్ళు, గోడలపై ఆయన రాసిన రాతలు ఆందోళనకారులను మరింత రెచ్చగొడుతున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూలంగా తన మనోభావాలను గిలానీ ఎంతోకాలంగా వ్యక్త పరుస్తూనే ఉన్నాడు. గతంలో అనేక సందర్భాల్లో గిలానీ బహిరంగంగా శత్రు.. పొరుగు దేశం కశ్మీర్ అనుసంధానంపై సూచిస్తూనే ఉన్నాడు. బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ అనంతరం ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయడంతోపాటు... లోయలో బంద్ కొనసాగేందుకు తనవంతు సాయం అందించాడు. అటువంటి ఘటనలతో సుమారు 25 రోజులపాటు కశ్మీర్ లోయలో కర్ఫ్యూ, కొనసాగింది. ఇప్పుడు తాజాగా గోడలపై 'గో ఇండియా గో' నినాదాలు రాస్తూ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో జమ్మూ, కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. కశ్మీర్ లోయలో ఉద్రిక్తతను సృష్టిస్తున్న వేర్పాటువాదులను తీవ్రంగా మందలించారు. వేర్పాటు వాదులు కశ్మీర్ ను సిరియాగా మార్చాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు, యువతకు విద్య అవసరాన్ని తెలియజేయాల్సింది పోయి.. పీపుల్స్ డెమొక్రెటిక్ పార్టీ విస్మరిస్తోందని ఆరోపించారు. సోమవారం ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ప్రజలను పలకరించిన ఆమె.. సమస్యను అధిగమించాలంటే ప్రజల సామూహిక కృషి ఎంతో అవసరమన్నారు. బుర్హాన్ వాని మరణించిన అనంతరం జూలై 9 నుంచీ అధికారికంగా విధించిన కర్ఫ్యూ కు తోడు.. వేర్పాటువాదుల ఆందోళనలతో స్థానిక జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. -
ఇక్కడ గోడలే పాఠ్యపుస్తకాలు
మెదక్: ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కృషి ఫలితంగా గోడలే పాఠ్యపుస్తకాలుగా మారి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఓ ఉపాధ్యాయుడు సొంత ఖర్చుతో పాఠశాల గోడలపై వివిధ అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలు ఎప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉండటంతో సౌకర్యంగా మారింది. మండలంలోని చిట్కుల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ఎన్టీ భార్గవిప్రసాద్ సొంత ఖర్చుతో హెచ్ఎం నరేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాసాచారి, దేవేందర్ సహకారంతో పాఠశాలలోని గోడలపై 6వతరగతి నుంచి 10వతరగతి వరకు విద్యార్థులకు ఉపాయోగపడే పాఠ్యాంశాలను రాశారు. తెలుగు, గణితం, ఆంగ్లం, సాంఘికశాస్త్రం తదితర సబ్జెక్టులకు సంబంధించిన సూత్రాలు, చిట్కాలు, ఆకర్షణీయ సంఖ్యలు, వాటి ప్రక్రియలు, పూర్ణాంకాలు, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, భాజనీయత తదితర అంశాలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రాశారు. దీంతోపాటు అక్షరాలు గుండ్రంగ రాయడం, ఇంగ్లిషు వర్ణమాల, భారతదేశం నదులు తదితర అంశాలను రాయడంతో విద్యార్థులకు ఇవి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు ఖాళీ సమయంలో సైతం పుస్తకం తెరవకుండానే వాటిని చూస్తు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా ఉన్నాయి : రాకేష్, 7వ తరగతి పాఠశాలలో గోడలపై రాసిన వాటిని ఆడుతూ పాడుతూ సులభంగా నేర్చుకునేందుకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. ఖాళీ సమయంలో ఉపయోగకరంగా ఉన్నాయి: వసంత, 7 తరగతి పాఠ్య పుస్తకాలు తీయకుండానే గోడలపై ఉన్నవాటిని ఖాళీ సమయంలో నేర్చుకుంటున్నాం. దీంతో సమయం వృధా కాకుండా ఉపయోగంగా ఉంది. సులభంగా అర్ధమయ్యేందుకే : భార్గవిప్రసాద్ గణితం ఉపాధ్యాయుడు విద్యార్థులకు గణితం అంటే కొంచం భయం ఉంటుంది. సులభంగా నేర్చుకునేలా గోడలపై గణిత సంబంధమైన సూత్రాలు, గుణాంకలు ఇతర అంశాలను రాశాం. దీంతో అవి ఎప్పకటికీ విద్యార్థులకు అందుబాటులో ఉండటంతో చూస్తు సులభంగా నేర్చుకుంటారు. ఉపాధ్యాయులు కృషి అభినందనీయం: నరేందర్‌రెడ్డి, హెచ్ఎం చిట్కుల్ విద్యార్థుల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. పాఠశాల ఉపాధ్యాయుడు సొంత ఖర్చుతో గోడలపై విద్యార్థులకు ఉపయోగ పడే అంశాలు రాయడంతో అవి వారికి అందుబాటులో ఉండి వారి మెదళ్లలో నాటుకు పోతాయి. -
విద్యార్థులు రంగులు పూయించారు
అది... ఇప్పటిదాకా ఓ మారుమూల పేదపిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాల. ఇప్పుడు మాత్రం గోడలపై వివిధ సందేశాలతో, పెయింటింగ్స్ తో చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది ఆ మున్సిపల్ స్కూల్. ఓ సేవా సంస్థ అందించిన ప్రోత్సాహంతో విద్యార్థుల్లోని ప్రతిభను ప్రదర్శిస్తున్న విద్యాలయం. ర్యాంకులు, మార్కులే కాదు పిల్లల్లోని ఇతర కళలను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఫన్ స్టెయిన్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమ ఫలితం ఇది. సూరత్ లోని పాఠశాల విద్యార్థులకు గత ఆదివారం ఫన్ స్టెయిన్ సేవాసంస్థ ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. స్థానిక పేద విద్యార్థులకు కళలు, నృత్యం, సంగీతం,ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ వంటి అనేక అంశాల్లో తర్ఫీదునిచ్చింది. సుమారు 300 పాఠశాలల్లోని విద్యార్థులు సహా కళాకారులతో నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు విద్యార్థుల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది. సూరత్ లోని గిజూభాయ్ బధేకా మున్సిపల్ స్కూల్ సహాయంతో ఫన్ స్టెయిన్ సేవాసంస్థ 'ర్యాంగ్ నెస్ బ్రింగింగ్ కలర్స్ ఎలైవ్' పేరున నిర్వహించిన కార్యక్రమం విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసింది. కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ముందుగా పాఠశాల గోడలకు పెయింటింగ్ వేయడాన్నే విద్యార్థులకు పనిగా ఇచ్చారు. ఇంకేముందీ వాల్ ఆర్ట్ వేయాలన్న సంస్థ సలహా మేరకు పిల్లలంతా తమలోని సృజనను జోడించి, స్కూలు గోడలను కళాత్మకంగా తీర్చిదిద్ది పరిసర ప్రాంతాలనూ ప్రకాశింపజేశారు. ముందుగా కార్యక్రమాన్నిస్థానిక మేయర్ అస్మితాబెన్ షిరోయా, గుజరాత్ కళా ప్రతిష్టాన్ సెక్రెటరీ రమణిక్ భాయ్ జపాడియాన ప్రారంభించగా... విద్యార్థులకు సేవా సంస్థ బ్రష్ లు, పెయింట్ లు అందజేసింది. దీంతో సేవ్ గల్స్, సేవ్ వాటర్, ప్రిజర్వ్ ఫారెస్ట్స్, స్లాప్ పొల్యూషన్, క్విట్ స్మోకింగ్ వంటి ఎన్నో సామాజిక సందేశాలను విద్యార్థులు గోడలపై ఆకట్టుకునేలా చిత్రించారు. పాఠశాల నగరానికి ప్రధాన మార్గంలో ఉండటంతో చూసినవారంతా అభినందనలు తెలపడంతోపాటు... తాము కూడ అటువంటి కార్యక్రమాల్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ముందుగా స్కూలు ముందువైపు గోడలకు మాత్రమే పెయింటింగ్ వేద్దామనుకున్నామని, మొదలు పెట్టిన తర్వాత విద్యార్థుల్లో ఉత్సాహం చూసి మొత్తం స్కూలు కాంపౌండ్ ను రంగులతో నింపాలని నిశ్చయించుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో అప్పటికప్పుడు ఓ చిన్న గ్రూప్ లా ఏర్పడిన విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి సుమారు మధ్యాహ్నానికల్లా రంగులు, పెయింట్ వేయడం పూర్తి చేసేశారని ఫన్ స్టెయిన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. -
సవాల్
గోడ మీది బల్లిని తలపించే ఆట అది. వేలాడే మనుషుల్ని వాల్స్ మీద చూపించే వింత అది. సిటీలో సరికొత్త అభిరుచిగా సందడి చేస్తోంది. నగరవాసుల వీకెండ్ డైరీలో ఇప్పుడు దీనిదే చెప్పుకోదగ్గ స్థానం. గోడల్ని పట్టుకుని ఎగబాకడంలో సత్తా చూపించేందుకు నగర యువత ఉత్సాహపడుతోంది. దీని కోసం సిటీలో కొన్ని ప్రత్యేకమైన వేదికలు సైతం ఏర్పాటవుతున్నాయి. బౌల్డరింగ్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఆట విశేషాలివి.. - ఎస్.సత్యబాబు క్లైంబింగ్ అనేది తొలుత పర్వతాలతో ప్రారంభమైంది. పర్వతారోహణ (మౌంటెనీరింగ్), రాక్‌క్లైంబింగ్, ఐస్ క్లైంబింగ్ .. ఇలా విస్తరించింది. రాక్ మీద ఐస్ ఫామ్ అయితే దాన్ని మిక్స్డ్ క్లైంబింగ్ అంటారు. క్లైంబింగ్ క్రేజ్ ఇటీవల బాగా పెరిగింది. అయితే దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ప్రతిసారీ మౌంటెన్స్, రాక్స్ వెతుక్కుంటూ వెళ్లలేం కదా. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చినవే ఆర్టిఫిషియల్ వాల్స్. ఆర్టిఫిషియల్ వాల్ మీద చేసే క్లైంబింగ్ని స్పోర్ట్స్ క్లైంబింగ్ అంటున్నారు. దీనిలో కూడా 3 విభాగాలున్నాయి. గోడ ఎత్తు 15 అడుగులు అంతకన్నా తక్కువుంటే బౌల్డరింగ్ సెగ్మెంట్ అంటారు. ఈ సెగ్మెంట్లో పాల్గొనేవాళ్ల కోసం కిందపడినా గాయాలు కాకుండా ఫ్లోర్ మీద పరుపులు వేసి ఉంచుతారు. ఇక లీడ్ క్లైంబింగ్లో గోడ 30-40 అడుగుల ఎత్తుంటుంది. భయం లేకుండా ఉంటేనే లీడ్ క్లైంబింగ్. దీనిలో గోడకు హ్యాంగర్స్ ఉంటాయి. దీనికి చాలా శారీరక సామర్థ్యం ఉండాలి. దీనిలో క్రీడాకారుడు రోప్ కట్టుకుని వాల్ మీద ఎక్కుతాడు. బౌల్డరింగ్ ‘భాగ్యం’... లీడ్, స్పీడ్ క్లైంబింగ్‌లు మౌంటెనీరింగ్‌ను సీరియస్ హాబీగా తీసుకున్నవారికి మాత్రమే పరిమితం. పైగా అంత కాంపిటీటివ్ వాల్స్ కూడా సిటీజనులకు అందుబాటులో లేవు. దీంతో బౌల్డరింగ్ ఒక ఫన్ యాక్టివిటీగా, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ఉపకరించేదిగా ఇప్పుడు నగరవాసులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే బౌల్డరింగ్ని ఒక వినోద సాధనంగా, వ్యాయామ మార్గంగా పలు చోట్ల ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రసాద్స్ ఐమాక్స్, ఫిలింనగర్ క్లబ్, పలు రిసార్ట్స్‌తో పాటు రన్‌వే 9, గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ స్కూల్‌తో పాటు లాటిట్యూడ్, సోల్ వంటి జిమ్స్‌లోనూ ఈ బౌల్డరింగ్ సాధన కోసం అమర్చిన వాల్స్ ఉన్నాయి. ఇదంతా ఒకెత్తయితే ఇప్పుడు బౌల్డరింగ్ కోసమే ప్రత్యేకించిన క్రాగ్ స్టూడియో.. కొండాపూర్‌లో ఏర్పాటైంది. ఇది బౌల్డరింగ్ లవర్స్‌కి మరింత ఊపునిస్తోంది. ఏడాది శ్రమ ఫలితం... ‘సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హాబీగా క్లైంబింగ్ చేసేవాణ్ని. అమెరికా, యూకేలలో ఉన్నట్టుగా వ్యక్తిగతంగా ప్రాక్టీస్ కోసం ఒక ఆర్టిఫిషియల్ వాల్ పెట్టుకుందామనుకున్నాను. తర్వాత ఆ ఆలోచన మార్చుకుని దీన్ని నాలాంటి అభిరుచి ఉన్నవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశా. మొత్తం 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్రాగ్ స్టూడియో కన్స్ట్రక్ట్ చేశాను. ఇక్కడ బౌల్డరింగ్ కోసం 12 అడుగుల ఎత్తున్న 3 వాల్స్ ఉన్నాయి. 24 ఫీట్స్ లీడ్ క్లైంబింగ్ ఒకటి ఉంది’ అని వివరించారు క్రాగ్ స్టూడియో నిర్వాహకుడు వూటుకూరు రంగారావు. ఈ స్టూడియోలో సభ్యత్వం కోసం నెలకు రూ.1,500 ఛార్జ్ చేస్తున్నామన్నారు. హైపర్ యాక్టివిటీ హై ఎనర్జీ, హైపర్ యాక్టివిటీ ఉన్న చిన్నారులకు ఇప్పుడు వాల్ క్లైంబింగ్ అద్భుతమైన హాబీ. దీనిలో గంట పాటు బౌల్డరింగ్ చేస్తే 900 కేలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మంచి ఫన్ కూడా ఉండడంతో సిటీలో చాలా మందిని ఎట్రాక్ట్ చేస్తోంది. దీనికి పెరుగుతున్న క్రేజ్ నేపథ్యంలో కొందరు వ్యక్తిగతంగా ఇళ్లలో కూడా ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.పూణె లాంటి నగరాల్లో చిల్డ్రన్ బెడ్‌రూమ్స్‌లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల కోసం అయితే 8, 9 అడుగుల వాల్ సరిపోతుంది. ఆల్రెడీ ఉన్న వాల్కి దీన్ని సెటప్ చేస్తారు. బెడ్రూమ్ ఉంటే ఒక కార్నర్లో క్లైంబింగ్ వాల్ పెడతారు. ఇదే ట్రెండ్‌ని సిటీలో కూడా పలువురు ఫాలో అవుతున్నారు. -
దారి గండం
మేల్కొనకపోతే మృత్యు గూటికే..! పలు దారుల్లో పొంచి ఉన్న ప్రమాదం చిన్న పాటి జాగ్రత్తలతో పెద్ద ముప్పు నివారణ నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పాలకులకు పట్టడం లేదు.. పనులు చేసే కాంట్రాక్టర్ల తీరూ మారడం లేదు.. పట్టించుకోవాల్సిన అధికారుల్లో చలనం కలగడం లేదు.. ఇంకేముంది రక్షణ గోడలేని బ్రిడ్జిలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. ప్రమాద సూచికలు లేని మలుపులు మృత్యు పిలుపులుగా మారుతున్నాయి. శిథిలావస్థలోని వంతెనలు ప్రమాదాలకు చిరునామాగా నిలుస్తున్నాయి. రోడ్డు నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కాంట్రాక్టర్లు గాలికి వదిలేశారు. ఫలితంగా ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ప్రమాదకరంగా ఉన్న రహదారుల్లో చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. -
బిక్కు.. బిక్కుమంటూ..
అంతా ఎవరిపనులు వారు చేసుకుంటున్నారు. ఇంతలోనే పెద్ద శబ్దం. భూమి కంపించినట్లు కదలికలు. ఇళ్లల్లో ఉన్న వారంతా ఒకేసారి కంగారుగా బయటకు వచ్చారు. ఒకరి గోడలు పగుళ్ల తేలగా.. మరొకరి ఇంటి పైకప్పు పగిలిపోయింది. ఇంకొకరి ఇంట్లో సామగ్రి కింద పడిపోయింది. ఈ దృశ్యం మంథని మండలం సింగరేణి ప్రభావిత గ్రామాల్లో నిత్యం కనిపిస్తుంటుంది. వారికి నిత్యం భూకంపమే. బ్లాస్టింగ్‌తో బీటలు వాడిన గోడలు - రోజూ భూకంపమే - ఓసీపీ-2 పేలుళ్లతో కంపిస్తున్న భూమి - నిర్వాసిత గ్రామస్తుల ఆందోళన మంథని రూరల్ : మంథని మండలం సింగరేణి ప్రభావిత గ్రామాలైన అక్కెపల్లి, రచ్చపల్లి, సిద్దపల్లి, పుట్టపాక, వేంపాడు గ్రామాల్లో నిత్యం భూకంపమే. సింగరేణి ఓసీపీల విస్తరణ చేపట్టిన తర్వాత ఆయా గ్రామాల సరిహద్దుల వరకు గనులు విస్తరించాయి. గ్రామాల సమీప ప్రాంతమంతా ఓబీ మట్టి కుప్పలతో నిండి ఉంది. ఓసీపీల నుంచి వెలికితీసిన మట్టిని సమీపంలో డంప్ చేస్తుండడంతో దుమ్ము, ధూళితో నరకం అనుభవించారు. తర్వాత బొగ్గు వెలికితీతకు పేలుళ్లు మొదలుపెట్టింది. రోజూ మధ్యాహ్నం పేలుళ్లు చేపడుతున్నారు. ఈ శబ్దాలతో సమీప గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి. ఇంట్లో సామగ్రి మొత్తం కిందపడుతోంది. తాత్కాలిక నిర్మాణాలు కూలిపోతున్నాయి. పేలుళ్లతో వస్తున్న దుమ్ముధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అప్పుడప్పుడు ఓసీపీ నుంచి దుర్వాసన వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా సింగరేణి యాజమాన్యం మాత్రం వీరిని పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు విచారణకు వచ్చే సమయంలో పేలుళ్లు నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాలను స్వాధీనం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓసీపీలో ఆధునిక టెక్నాలజీ ఓసీపీల విస్తరణలో సింగరేణి సంస్థ ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తోంది. పంచ్‌ఎంట్రీ విధానాన్ని లాంగ్వాల్ ప్రాజెక్టులో వాడేందుకు రంగం సిద్ధం చేసింది. మంథని మండల పరిధిలోని ఓసీపీ-2లో 450 మీటర్ల లోతు నుంచి 12 కిలోమీటర్ల మేర బొగ్గును పంచ్‌ఎంట్రీ ద్వారా సేకరించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ విధానంలో బొగ్గును వెలికి తీయాలంటే మొదట రచ్చపల్లి అడుగుభాగం నుంచి వెళ్లాలి. పరిహారం చెల్లించకపోవడంతో ఈ గ్రామాన్ని సంస్థ స్వాధీనం చేసుకోలేదు. దీంతో పంచ్‌ఎంట్రీ విధానం నిలిచిపోయింది. గ్రామ భూ భాగం నుంచి యంత్రం సొరంగం చేస్తూ బెల్టు ద్వారా బొగ్గును బయటకు పంపిస్తుంది. ఈ విధానం ప్రారంభించిన సరిహద్దులోని గృహాలు దెబ్బతిన్నాయి. భూమి కుంగిపోయి కిందపడ్డా... తెల్లవారే సరికి బాతురూం దగ్గర భూమి కుంగిపోయి బొంద పడ్డది. రోజుమాదిరిగా పొద్దుగాల అటుపోంగనే బొందల పడిపోయిన. మెడకు దెబ్బతాకి పదిహేను రోజులు ద వాఖానాల ఉన్న. రూ.10 వేల వరకు ఖర్చయ్యాయి. భూమి లోపల ఏదో మిషన్ అచ్చిందట. దాంతోనే గొయ్యి పడింది. - పోలవేన లక్ష్మి రోగాలొత్తున్నయ్.. మా ఊరి పక్కనే ఉన్న ఓసీపీల రోజూ పేలుళ్లు చేస్తున్నరు. వాటి నుంచి వచ్చే దుమ్ము, దూళితో రోగాలొత్తున్నయ్. అంతేకాకుండా అప్పుడప్పుడు ఓసీపీల నుంచి విషవాయువులు కూడా వత్తున్నయ్. వీటితోని చాలా మంది రోగాలబారిన పడుతాండ్రు. - గుర్రాల ఓదెలు రేకులు పగిలిపోతున్నయ్.. పేలుళ్లతో వచ్చే శబ్దాలకు ఇంటిపైకప్పులు కదిలిపోతున్నాయి. ఒక్కోసారి పెద్దగా శబ్దాలు వచ్చి రేకులు పగిలిపోతున్నయి. వానాకాలం వచ్చిందంటే పగిలిన రేకులతోని ఇళ్లంతా ఉరుస్తుంది. సింగరేణోళ్లు చేయబట్టి ఇండ్లళ్ల కూడా ఉండేటట్లు లేదు. - చిలుక ఓదమ్మ