దారి గండం
మేల్కొనకపోతే మృత్యు గూటికే..!
పలు దారుల్లో పొంచి ఉన్న ప్రమాదం
చిన్న పాటి జాగ్రత్తలతో పెద్ద ముప్పు నివారణ
నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పాలకులకు పట్టడం లేదు.. పనులు చేసే కాంట్రాక్టర్ల తీరూ మారడం లేదు.. పట్టించుకోవాల్సిన అధికారుల్లో చలనం కలగడం లేదు.. ఇంకేముంది రక్షణ గోడలేని బ్రిడ్జిలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. ప్రమాద సూచికలు లేని మలుపులు మృత్యు పిలుపులుగా మారుతున్నాయి. శిథిలావస్థలోని వంతెనలు ప్రమాదాలకు చిరునామాగా నిలుస్తున్నాయి.
రోడ్డు నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కాంట్రాక్టర్లు గాలికి వదిలేశారు. ఫలితంగా ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ప్రమాదకరంగా ఉన్న రహదారుల్లో చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చు.