బిక్కు.. బిక్కుమంటూ.. | blasting the Used walls of the crack | Sakshi
Sakshi News home page

బిక్కు.. బిక్కుమంటూ..

Published Tue, Sep 30 2014 1:53 AM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM

blasting the Used walls of the crack

అంతా ఎవరిపనులు వారు చేసుకుంటున్నారు. ఇంతలోనే పెద్ద శబ్దం. భూమి కంపించినట్లు కదలికలు. ఇళ్లల్లో ఉన్న వారంతా ఒకేసారి కంగారుగా బయటకు వచ్చారు. ఒకరి గోడలు పగుళ్ల తేలగా.. మరొకరి ఇంటి పైకప్పు పగిలిపోయింది. ఇంకొకరి ఇంట్లో సామగ్రి కింద పడిపోయింది. ఈ దృశ్యం మంథని మండలం సింగరేణి ప్రభావిత గ్రామాల్లో నిత్యం కనిపిస్తుంటుంది. వారికి నిత్యం భూకంపమే.
 
బ్లాస్టింగ్‌తో బీటలు వాడిన గోడలు


- రోజూ భూకంపమే
- ఓసీపీ-2 పేలుళ్లతో కంపిస్తున్న భూమి
- నిర్వాసిత గ్రామస్తుల ఆందోళన

మంథని రూరల్ : మంథని మండలం సింగరేణి ప్రభావిత గ్రామాలైన అక్కెపల్లి, రచ్చపల్లి, సిద్దపల్లి, పుట్టపాక, వేంపాడు గ్రామాల్లో నిత్యం భూకంపమే. సింగరేణి ఓసీపీల విస్తరణ చేపట్టిన తర్వాత ఆయా గ్రామాల సరిహద్దుల వరకు గనులు విస్తరించాయి. గ్రామాల సమీప ప్రాంతమంతా ఓబీ మట్టి కుప్పలతో నిండి ఉంది. ఓసీపీల నుంచి వెలికితీసిన మట్టిని సమీపంలో డంప్ చేస్తుండడంతో దుమ్ము, ధూళితో నరకం అనుభవించారు. తర్వాత బొగ్గు వెలికితీతకు పేలుళ్లు మొదలుపెట్టింది. రోజూ మధ్యాహ్నం పేలుళ్లు చేపడుతున్నారు.

ఈ శబ్దాలతో సమీప గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి. ఇంట్లో సామగ్రి మొత్తం కిందపడుతోంది. తాత్కాలిక నిర్మాణాలు కూలిపోతున్నాయి. పేలుళ్లతో వస్తున్న దుమ్ముధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అప్పుడప్పుడు ఓసీపీ నుంచి దుర్వాసన వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా సింగరేణి యాజమాన్యం మాత్రం వీరిని పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు విచారణకు వచ్చే సమయంలో పేలుళ్లు నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాలను స్వాధీనం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.
 
ఓసీపీలో ఆధునిక టెక్నాలజీ
ఓసీపీల విస్తరణలో సింగరేణి సంస్థ ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తోంది. పంచ్‌ఎంట్రీ విధానాన్ని లాంగ్‌వాల్ ప్రాజెక్టులో వాడేందుకు రంగం సిద్ధం చేసింది. మంథని మండల పరిధిలోని ఓసీపీ-2లో 450 మీటర్ల లోతు నుంచి 12 కిలోమీటర్ల మేర బొగ్గును పంచ్‌ఎంట్రీ ద్వారా సేకరించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ విధానంలో బొగ్గును వెలికి తీయాలంటే మొదట రచ్చపల్లి అడుగుభాగం నుంచి వెళ్లాలి. పరిహారం చెల్లించకపోవడంతో ఈ గ్రామాన్ని సంస్థ స్వాధీనం చేసుకోలేదు. దీంతో పంచ్‌ఎంట్రీ విధానం నిలిచిపోయింది. గ్రామ భూ భాగం నుంచి యంత్రం సొరంగం చేస్తూ బెల్టు ద్వారా బొగ్గును బయటకు పంపిస్తుంది. ఈ విధానం ప్రారంభించిన సరిహద్దులోని గృహాలు దెబ్బతిన్నాయి.
 
భూమి కుంగిపోయి కిందపడ్డా...
తెల్లవారే సరికి బాతురూం దగ్గర భూమి కుంగిపోయి బొంద పడ్డది. రోజుమాదిరిగా పొద్దుగాల అటుపోంగనే బొందల పడిపోయిన. మెడకు దెబ్బతాకి పదిహేను రోజులు ద వాఖానాల ఉన్న. రూ.10 వేల వరకు ఖర్చయ్యాయి. భూమి లోపల ఏదో మిషన్ అచ్చిందట. దాంతోనే గొయ్యి పడింది.  
 - పోలవేన లక్ష్మి
 
రోగాలొత్తున్నయ్..

మా ఊరి పక్కనే ఉన్న ఓసీపీల రోజూ పేలుళ్లు చేస్తున్నరు. వాటి నుంచి వచ్చే దుమ్ము, దూళితో రోగాలొత్తున్నయ్. అంతేకాకుండా అప్పుడప్పుడు ఓసీపీల నుంచి విషవాయువులు కూడా వత్తున్నయ్. వీటితోని చాలా మంది రోగాలబారిన పడుతాండ్రు.  
 - గుర్రాల ఓదెలు
 
రేకులు పగిలిపోతున్నయ్..

పేలుళ్లతో వచ్చే శబ్దాలకు ఇంటిపైకప్పులు కదిలిపోతున్నాయి. ఒక్కోసారి పెద్దగా శబ్దాలు వచ్చి రేకులు పగిలిపోతున్నయి. వానాకాలం వచ్చిందంటే పగిలిన రేకులతోని ఇళ్లంతా ఉరుస్తుంది. సింగరేణోళ్లు చేయబట్టి ఇండ్లళ్ల కూడా ఉండేటట్లు లేదు.
 - చిలుక ఓదమ్మ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement