విద్యార్థులు రంగులు పూయించారు
అది... ఇప్పటిదాకా ఓ మారుమూల పేదపిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాల. ఇప్పుడు మాత్రం గోడలపై వివిధ సందేశాలతో, పెయింటింగ్స్ తో చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది ఆ మున్సిపల్ స్కూల్. ఓ సేవా సంస్థ అందించిన ప్రోత్సాహంతో విద్యార్థుల్లోని ప్రతిభను ప్రదర్శిస్తున్న విద్యాలయం. ర్యాంకులు, మార్కులే కాదు పిల్లల్లోని ఇతర కళలను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఫన్ స్టెయిన్ సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమ ఫలితం ఇది.
సూరత్ లోని పాఠశాల విద్యార్థులకు గత ఆదివారం ఫన్ స్టెయిన్ సేవాసంస్థ ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. స్థానిక పేద విద్యార్థులకు కళలు, నృత్యం, సంగీతం,ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ వంటి అనేక అంశాల్లో తర్ఫీదునిచ్చింది. సుమారు 300 పాఠశాలల్లోని విద్యార్థులు సహా కళాకారులతో నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు విద్యార్థుల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది. సూరత్ లోని గిజూభాయ్ బధేకా మున్సిపల్ స్కూల్ సహాయంతో ఫన్ స్టెయిన్ సేవాసంస్థ 'ర్యాంగ్ నెస్ బ్రింగింగ్ కలర్స్ ఎలైవ్' పేరున నిర్వహించిన కార్యక్రమం విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసింది. కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ముందుగా పాఠశాల గోడలకు పెయింటింగ్ వేయడాన్నే విద్యార్థులకు పనిగా ఇచ్చారు. ఇంకేముందీ వాల్ ఆర్ట్ వేయాలన్న సంస్థ సలహా మేరకు పిల్లలంతా తమలోని సృజనను జోడించి, స్కూలు గోడలను కళాత్మకంగా తీర్చిదిద్ది పరిసర ప్రాంతాలనూ ప్రకాశింపజేశారు.
ముందుగా కార్యక్రమాన్నిస్థానిక మేయర్ అస్మితాబెన్ షిరోయా, గుజరాత్ కళా ప్రతిష్టాన్ సెక్రెటరీ రమణిక్ భాయ్ జపాడియాన ప్రారంభించగా... విద్యార్థులకు సేవా సంస్థ బ్రష్ లు, పెయింట్ లు అందజేసింది. దీంతో సేవ్ గల్స్, సేవ్ వాటర్, ప్రిజర్వ్ ఫారెస్ట్స్, స్లాప్ పొల్యూషన్, క్విట్ స్మోకింగ్ వంటి ఎన్నో సామాజిక సందేశాలను విద్యార్థులు గోడలపై ఆకట్టుకునేలా చిత్రించారు. పాఠశాల నగరానికి ప్రధాన మార్గంలో ఉండటంతో చూసినవారంతా అభినందనలు తెలపడంతోపాటు... తాము కూడ అటువంటి కార్యక్రమాల్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
ముందుగా స్కూలు ముందువైపు గోడలకు మాత్రమే పెయింటింగ్ వేద్దామనుకున్నామని, మొదలు పెట్టిన తర్వాత విద్యార్థుల్లో ఉత్సాహం చూసి మొత్తం స్కూలు కాంపౌండ్ ను రంగులతో నింపాలని నిశ్చయించుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో అప్పటికప్పుడు ఓ చిన్న గ్రూప్ లా ఏర్పడిన విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి సుమారు మధ్యాహ్నానికల్లా రంగులు, పెయింట్ వేయడం పూర్తి చేసేశారని ఫన్ స్టెయిన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.