దుమారం సృష్టించిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఓ పెయింటింగ్‌పై ఇచ్చిన ఆటోగ్రాఫ్ వివాదాస్పదమైంది. మోదీ జాతీయ పతాకాన్ని అవమానించారని సోషల్ మీడియాలో విమర్శకులు మండిపడుతుండగా, ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఓ వికలాంగ బాలిక.. వస్త్రంపై ఆ పెయింటింగ్‌ను రూపొందించిందని, గురువారం రాత్రి ప్రముఖ కంపెనీల సీఈవోలకు ప్రధాని ఇచ్చిన విందులో వంటకాలను తయారు చేయించిన చెఫ్ వికాస్ ఖన్నా వెంట ఆ బాలిక రావడంతో మోదీ దానిపై సంతకం చేశారని ప్రభుత్వం స్పష్టంచేసింది.
అది త్రివర్ణ పతాకం కాదని వెల్లడించింది. జాతీయ పతాకంపై ప్రధాని సంతకం చేశారని వచ్చిన ఆరోపణలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెరైక్టర్ జనరల్ ఫ్రాంక్ నొరోన్హా శుక్రవారం ఢిల్లీలో ఖండించారు. ఇదిలా ఉండగా ఈ అంశంపై కాంగ్రెస్ స్పందన కోరగా తాము బీజేపీలా చవకబారు రాజకీయాలకు పాల్పడమని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ వ్యాఖ్యానించారు. ప్రధాని పదవిని తాము గౌరవిస్తామని అన్నారు. వ్యక్తులు ఎంతటి పెద్ద పదవుల్లో ఉన్నా జాతీయ పతాకం వారికంటే గొప్పదన్న విషయాన్ని గుర్తెరగాలని పేర్కొన్నారు.
ఈ వివాదంపై బీజేపీ స్పందిస్తూ.. కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడింది. ‘విదేశీ విహారయాత్రలో ఉన్న తమ నేతల గైర్హాజరీని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రధానిపై చిల్లర విమర్శలు చేస్తోంది’ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.