చిత్ర.. కళ తప్పుతోంది
కొత్త తరహాలో వస్తున్న ఫ్లెక్సీల ధాటికి సహజమైన చిత్రకళ ..కళ తప్పుతోంది. చిత్రకళపై ఆధారపడి జీవిస్తున్న ఎందరో కళాకారులు నిస్పృహలో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా బొమ్మలు గీయటంలోనూ. అక్షరాలు తీర్చిదిద్దటంలో నైపుణ్యం సంపాదించి ఆ రంగంలో రాణిస్తున్న వారెందరో ఇప్పుడు ఆ రంగం నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
-శ్రీకాకుళం
టెక్నాలజీ పెరగటంతో ఆర్టిస్టులకు గ్రహణం
జీవనోపాధి కోసం సున్నాలు వేసుకుంటున్న వైనం
కడుపునింపని కళ
పెయింటింగ్స్‌లో రకాలు
పెయింటింగ్స్‌లో మాస్ పెయింటింగ్స్, కమర్షియల్ పెయింటింగ్స్, ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ ఇలా అత్యంత ఆదరణ కలిగిన పెయింటింగ్స్ ఉన్నాయి. మాస్ పెయింటింగ్స్ అంటే గోడలపై పెద్ద పెద్ద బొమ్మలు, పేర్లు రాసేవారే ఈ పెయింటర్స్, కమర్షియల్ పెయింటింగ్ అంటే వ్యాపారాలకు సంబంధించి క్లాత్‌లపై, వాల్ పెయింటింగ్స్ వేసే వారిని ఈ పెయింటర్స్ అంటారు. ఇక చివరిది ఫైన్ ఆర్ట్స్. సినీ రంగంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనికి ఈ మధ్యకాలంలో క్రమేపీ ఆదరణ తగ్గిపోయింది. దీనితో చిత్ర కళాకారులు కుటుంబాలతో బతకాలంటే ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
చిత్రకళాకారులు జీవనోపాధి లేక రోడ్డున పడినప్పటికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వానికి సంబందించిన పనులైనా చిత్రకళాకారులకి అప్పగించి జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు.
కుంచె పట్టుకునే పరిస్థితి లేదు
ప్రస్తుతం కాలంలో కళ ఉన్నా కుంచె పట్టుకుని బొమ్మలు గీసే పరిస్థితి లేదు. ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పార్టు టైమ్ డ్రాయింగ్ ఉపాధ్యాయులుగా, నూతన భవనాలకు సున్నాలు వేసుకునేందుకు, మరికొందరైతే ఆటోలు నడుపుకొంటూ, దుకాణాలు పెట్టుకుని కుటుంబాన్ని పోషించాల్సి వస్తుంది.
-వి.నగేష్, చిత్రకళాకారుడు,
చిన్నబరాటం వీధి
చిత్రకళపై మక్కువ ఉన్నా
ఉపాధి కరువే
నేను బీటెక్ చదువుకున్నా బొమ్మలు గీయడమంటే నాకు చాలా ఇష్టం ప్రస్తుతం చిత్రకళకు ఆదరణ తగ్గిన విషయం తెలిసినప్పటికి ఈ వృత్తికి అలవాటు పడి వదులుకోలేకపోతున్నా. గతంలో అయితే నెలకు దాదాపుగా రూ. 20వేలు దాటి వచ్చేది. ప్రస్తుతం మాత్రం రూ. 5వేలు రావడం కష్టంగా మారింది. దీనితో షాపు అద్దె కరెంటు బిల్లుకూడా రావడం లేదు. ఇలా ఉండడంతో బతకాలన్నా కష్టంగా ఉన్నది కళనే నమ్ముకుని బతుకుతున్నా. ప్రభుత్వం ఆదుకుని ఏమైనా ఉపాధి అవకాశాలను కల్పిస్తే బాగుంటుంది.
- బి.చంటి, చిత్ర
కళాకారుడు, శ్రీకాకుళం