
‘ఆమె’అద్భుతం..
చిత్రకారిణి సంధ్య
‘స్త్రీ ఒక అద్భుతం. ఆమె రూపం అసామాన్యం. సిగ్గుల మొగ్గయినప్పుడైనా, సివంగిలా మారినప్పుడైనా తన ప్రతి భావం అపురూపమైనదే. ఆధునిక ప్రపంచంలో మమేకం కావాలంటే ఆ సౌందర్యాన్ని, ప్రత్యేకతను పోగొట్టుకోవడం అని అర్థం కాదు’ అంటున్నారు చిత్రకారిణి సంధ్యా శంకర్ పట్నాయక్. వైజాగ్‌కు చెందిన ఈ చిత్రకారిణి మనిషి జీవనశైలి మార్పులను ఆధారంగా చేసుకుని సందేశాత్మక చిత్రాలు గీయడంలో సిద్ధహస్తురాలు. బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో ‘ది ఫెమినైన్ సెల్ఫ్’ పేరిట తన తొలి సోలో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసిన సందర్భంగా ఆమె పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
‘మగవాళ్లలాగా దుస్తులు వేసుకోవడం, బిడియాన్ని వదిలేస్తే గాని బతకలేమనుకునే మోడ్రన్ గాళ్స్.. ఆడవారికి మాత్రమే సహజంగా వచ్చిన అపురూప లావణ్యానికి దూరం అవుతున్నారు. తమకు మాత్రమే ప్రత్యేకించిన సున్నితమైన ప్రవర్తనను, అందమైన వస్త్రధారణను కాపాడుకుంటూనే మానసికంగా ధృఢంగా ఉండడం ఈ తరం నేర్చుకోవాలి. ఇటీవల నేను గమనించిన కొందరు అమ్మాయిల తీరు నన్ను ఈ ప్రదర్శనకు పురికొల్పింది. నడక, మాట తీరు వంటి సహజమైన ప్రవర్తన నుంచి.. ఆభరణాలు, అలంకర ణ వరకు ఆడవారిలో ప్రత్యేకత ఉట్టిపడుతుంటుంది. ఆ అద్భుతమైన అందాన్ని వివరించే ప్రయత్నమే నా ఈ తాజా చిత్ర ప్రదర్శన.
‘మార్పు’ కోరుతూ కదిలే కుంచె..
‘కళ అనేది నాకు ఆదాయ మార్గం కాదు. వ్యక్తిగత సంతృప్తిని, సమాజానికి నా వంతుగా ఏమైనా చెప్పే అవకాశం అందించే చక్కని వృత్తి. మదర్ అండ్ చైల్డ్ నుంచి మొదలై నేను గీసిన చిత్రాల పరంపర నా ఆలోచనా ధోరణికి అద్దం పడతాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వ్యసనంగా మారి పిల్లల మనసుల్ని ఎంతగా కలుషితం చేస్తున్నాయో వివరిస్తూ నేను గీసిన ‘గ్రోయింగ్ కిడ్’ కలెక్షన్ దీనికో నిదర్శనం. వైజాగ్‌లో అనేక స్కూల్స్ తమ విద్యార్థులకు ఈ ప్రదర్శనను చూపించాయి.
నా గురించి...
జన్మస్థలం, నివాసస్థలం విశాఖపట్నం. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఫైనార్ట్స్ కోర్సు పూర్తి చేశాను. దాదాపు 15 ఏళ్ల క్రితం గ్రూప్ షోలో పాల్గొనడం ద్వారా నా చిత్రకళాయానం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు నగరాల్లో గ్రూప్ షోస్‌లో పాల్గొన్నాను. హైదరాబాద్‌లో నా సొలో చిత్ర ప్రదర్శన ఇదే తొలిసారి. వైజాగ్‌లో తొలి ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసి పలువురు ఔత్సాహిక చిత్రకారులకు ఒక వేదికను ఏర్పాటు చేశా. భవిష్యత్తులో ఆంధప్రదేశ్‌లో వైజాగ్ కూడా చిత్రకళా రంగంలో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగుతుందని నా నమ్మకం.
మొత్తం
50 చిత్రాలు కొలువుదీరిన ‘ఫెమినైన్ సెల్ఫ్’ చిత్రకళా ప్రదర్శన
ఈ నెల 27 వరకు కొనసాగుతుంది.