బొమ్మను గీస్తే..
ఆయన కుంచె నుంచి జాలువారిన సహజసిద్ధ ప్రకృతి అందాలు అందరికీ కనువిందు చేస్తున్నాయి. సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రముఖుల చిత్రాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతున్నాయి. సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలపై వేసిన బొమ్మలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రతి ఒక్కరి మనోఫలకంపై చెరగని ముద్రవేస్తున్నాయి. ఇంతటి నైపుణ్యం గల డ్రాయింగ్ టీచర్ కృష్ణ తనకు సహజంగా అబ్బిన కళను చిన్నారులకు నేర్పిస్తూ వారిలో సమాజిక స్పృహను పెంపొందిస్తున్నారు. ఆయన శిష్యులు జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు.
- చందులూరు(లక్కవరపుకోట)
* చిత్రకళలో చందులూరు డ్రాయింగ్ టీచర్ ప్రతిభ
* విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
* జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన కృష్ణ శిష్యులు
లక్కవరపుకోట మండలం చందులూరు జిల్లా పరిషత్ పాఠశాల్లో డ్రాయింగ్ టీచర్‌గా కాంట్రక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కొటాన కృష్ణ చిత్రకళతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పలు అంశాలపై ఆయన గీసిన చిత్రాలు పండితులతోపాటు పామరులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. తనకు తెలిసిన కళను పిల్లలకు నేర్పించేందుకు కృష్ణ తపనపడుతుంటారు. ఆయన చిత్రకళపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కృష్ణ శిష్యులు గీసిన చిత్రాలకు 2013 నుంచి వరుసగా జాతీయ స్థాయిలో బంగారు పతకాలు లభిస్తున్నాయి.
తెనాలిలోని అజంతా కళారామంలో గత ఏడాది నిర్వహించిన ఆలిండియా చిత్రలేఖనం పోటీల్లో భ్రూణహత్యలపై కృష్ణ గీసిన చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన కుంచె నుంచి జాలువారిన ప్రకృతి అందాలు, పల్లెటూరి జీవిన చిత్రం, సంఘసంస్కర్తలు, జాతీయ నాయకుల బొమ్మలను పాఠశాలకు ప్రదానం చేశారు.
సినీరంగంలో ప్రవేశం..
కృష్ణ కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ప్రముఖ నటుడు దివంగత శ్రీహరి నటించిన ‘అయోధ్య రామయ్య’ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. సినీరంగంలో పరిస్థితులకు అనుగుణంగా జీవించలేక ఆయన సొంత ఊరు వచ్చేశారు.
నా జీవితంలో కళ లేదు
‘సమాజంలో జరిగే ఎన్నో సంఘటనలను జీవకళ ఉట్టిపడేలా చిత్రాలుగా మలిచిన నా జీవితంలో మాత్రం కళ లేకుండాపోయింది. ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్లను క్రమబద్ధీకరించాలి. మా కుటుంబాల్లో కళ నింపాలి.’