Drawing Teacher
-
బర్డ్ అంబులెన్స్
చండీగఢ్‌కు చెందిన మన్జిత్సింగ్ ఒక ప్రైవేట్ స్కూల్లో డ్రాయిగ్ టీచర్. పర్యావరణ కార్యకర్త. పక్షుల ప్రేమికుడు. ఏదో పనికోసం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పట్టణానికి వెళ్లిన సింగ్ అక్కడ ఒకచోట ఒక దృశ్యాన్ని చూశాడు. స్వీపర్ ఊడుస్తున్న చెత్తలో చనిపోయిన పావురం కనిపించింది. ‘ఎలా చనిపోయింది?’ అని అడిగాడు సింగ్. కరెంట్‌షాక్‌కు గురై చనిపోయినట్లు చెప్పింది ఆమె. ‘ఇలా చాలా పావురాలు చనిపోతాయి’ అని కూడా చెప్పింది. ఈ సంఘటనను సింగ్ మరిచిపోలేకపోయాడు. ఆ సమయంలో రెండు నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి...వ్యాధులు వ్యాపించకుండా చనిపోయిన పక్షులను ఖననం చేయడం, రెండు...ప్రమాదం బారిన పడిన పక్షులకు చికిత్స అందించడం. దీని కోసం తన సైకిల్‌ను ‘బర్డ్ అంబులెన్స్’గా మార్చి వీధులు తిరుగుతుంటాడు సింగ్. ‘మీకు సమీపంలో పక్షులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడి ఉంటే దయచేసి నాకు వెంటనే ఫోన్ చేయండి’ అంటూ వీధుల్లో కరపత్రాలు పంచుతుంటాడు. ‘ఖాళీ సమయంలో పెయింటింగ్స్ వేసి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాని నాకు అది ఇష్టం లేదు. ఏ మాత్రం సమయం దొరికినా పక్షుల బాగు కోసం ఉపయోగిస్తాను’ అంటున్నాడు మన్జిత్సింగ్. -
CM YS Jagan: ఆర్ట్ టీచర్ అద్భుత చిత్రం
కొనకనమిట్ల (ప్రకాశం): ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మువ్వన్నెలు రెపరెపలాడే తరుణంలో వచ్చిన ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాకుసెల్యూట్ చేస్తున్నట్లు చిత్రాన్ని వేశారు. కొనకనమిట్ల మండలంలోని వెలుగొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్న కొమ్ము ప్రసాద్.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని ఆర్ట్స్ రూపంలో అద్భుతంగా వేయడాన్ని స్థానికులు అభినందించారు. (చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 20న మెగా జాబ్‌మేళా) -
మనీషా బొమ్మేస్తే అచ్చుపడుద్ది!
ప్రకాశం (దర్శి) : కరోనా.. ఎందరినో బలి తీసుకుంది. అదే సమయంలో కొత్త ఆలోచనలు పరుడుపోసుకునేలా చేసింది. సరికొత్త ఆవిష్కరణలకు కారణభూతంగా నిలిచింది. కొందరి ఉపాధికి గండి కొట్టింది.. మరికొందరిని జీవనోపాధి మార్గాలు వెతుక్కునేలా చేసింది. దర్శికి చెందిన మనీషా కూడా తనలోని సృజనకు కరోనా సమయంలోనే పదును పెట్టింది. బొమ్మలు గీసే తన హాబీని ఉపాధికి మార్గంగా మలుచుకుంది. తాను గీసిన బొమ్మలను తోటివారికి చూపి, వారి బొమ్మలు కూడా గీయడం.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఆర్డర్లు తీసుకుని బొమ్మలు వేయడం.. ఇలా తన కళా ప్రతిభను చాటుకుంటూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కొందరు మనీషా ప్రతిభకు ముగ్ధులై తమ చిత్రాలను పంపి బొమ్మలు గీయించుకుంటున్నారు. వాటిని కొరియర్ ద్వారా విదేశాలకు తెప్పించుకుంటున్నారు. పేర్లతో బొమ్మలు.. త్రీడీ, ఫైవ్‌డీ కెమెరాలతో తీసిన అందమైన ఫొటోలు ఫ్రేమ్ కట్టించుకుని మురిసిపోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, కాస్త విభిన్నంగా ఉండాలని కోరుకునేవారు మాత్రం చేత్తో గీసిన చిత్రాలను ఇష్టపడతారు. అలాంటి వారి బొమ్మలను గడిచిన రెండేళ్లలో మనీషా వందల సంఖ్యలో గీసింది. పెన్సిల్‌తో బొమ్మలు వేయడమే కాదు పేర్లు రాస్తూ చిత్రంగా మలచడం మనీషా ప్రత్యేకత. కరోనా సమయంలో ఉపాధి కోసం ఒక్కో చిత్రానికి రూ.200 తీసుకున్న ఆమె.. ప్రస్తుతం చిత్రం సైజును బట్టి రూ.300 నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటోంది. తన ఇంట్లోనే బొమ్మలు గీస్తూ.. పిల్లలు, పెద్దలకు చిత్ర లేఖనంపై శిక్షణ ఇస్తూ ఉపాధి పొందుతోంది. భర్త సాయికుమార్ ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరుకుంటానని మనీషా ధీమాగా చెబుతోంది. -
బొమ్మల టీచరమ్మ
గోడలపై పాఠ్యాంశాలను చిత్రిస్తూ పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా సిలబస్‌ను బోధిస్తున్న తిరునగరి పద్మ.. పుస్తకాల్లోని విషయాలను నేరుగా చెప్పడం కంటే బొమ్మలు, గుర్తుల రూపంలో చూపిస్తే అవి ఎప్పటికీ పిల్లలకు గుర్తుంటాయని అంటున్నారు. బడి పరిసరాలను కూడా తన చిత్రాలతో అందంగా మార్చేస్తున్న ఈ ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయురాలు తెలంగాణలోని జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. పద్మ ఉపాధ్యాయురాలే అయినప్పటికీ.. పిల్లలకు బొమ్మల ద్వారా పాఠాలను అర్థం చేయించడంతో పాటు సమాజంలో వివక్షకు గురి అవుతున్న మహిళల సమస్యలపైన కూడా తన కుంచెను ఎక్కుపెట్టారు. ఈమె స్వస్థలం హన్మకొండ. 2008 డీఎస్సీలో తెలుగు పండిట్‌గా ఎంపికై, దేవరుప్పుల మండలం రామరాజుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలో పని చేశారు. తర్వాత సోలిపూర్ పాఠశాలకు వచ్చారు. రైలు బోగీగా తరగతి గది తనకూ టీచరే స్పూర్తి ములుగు జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో డ్రాయింగ్ టీచర్ గీసే చిత్రాలను పద్మను ఆకర్షించాయి. అప్పటి నుంచి పై చదువుల్లో నిమగ్నం అయినప్పటికీ తనకు ఇష్టమైన చిత్రకళను సాధన చేస్తూ వచ్చారు. తనే టీచర్ అయ్యాక.. పాఠాలకు బొమ్మల రూపం ఇచ్చి పిల్లలకు ఆసక్తి కలిగేలా విద్యాబోధన చేస్తున్నారు. అందుకోసం సొంత డబ్బులను పెట్టి రంగులు కొంటున్నారు. స్కూల్ టైమ్ పూర్తయ్యాక, ఆదివారాలు.. గోడలపై చిత్రాలు వేయడానికి తన సమయాన్ని కేటాయించుకున్నారు. పాఠశాల గదులు, ప్రహరీ గోడలపై పద్మ వేస్తున్న పెయింటింగ్స్ పిల్లల్లే కాదు, పెద్దల్నీ ఆకర్షిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. బోధించడానికి, పిల్లలు అర్ధం చేసుకోవడానికి కష్టంగా ఉండే అంశాలను చిత్రాల రూపంలో గీయడానికి ఆమె చాలానే కష్టపడతారు. తెలుగు వ్యాకరణం, ప్రపంచపటం, సూర్య కుటుంబం, రైలుబండి, హరితహారం, పల్లె అందాలు.. ప్రతి చిత్రం వెనుక పద్మ కష్టం, సృజనాత్మకత ఉంటాయి. మొత్తానికి ఈ చిత్రాలతో ఇప్పుడు ఆ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. సామాజిక స్పృహ మరోవైపు తన కలం ద్వారా సమాజంలోని రుగ్మతలపైన కూడా తన గళం వినిపిస్తున్నారు పద్మ. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షపై తరచు కవితలు రాస్తుంటారు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తారు. ప్రత్యక్షంగా సామాజిక సేవ కూడా చేస్తుంటారు. స్టీల్ పాత్రలను, పాత బట్టలను సేకరించి వాటిని పాఠశాలలోని నిరుపేద, అనాథ పిల్లలకు అందిస్తుంటారు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన పద్మ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు, సావిత్రి భాయి పూలే రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.– ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామఫొటోలు: బైరి శ్రీకాంత్ -
బొమ్మను గీస్తే..
ఆయన కుంచె నుంచి జాలువారిన సహజసిద్ధ ప్రకృతి అందాలు అందరికీ కనువిందు చేస్తున్నాయి. సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రముఖుల చిత్రాలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతున్నాయి. సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలపై వేసిన బొమ్మలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రతి ఒక్కరి మనోఫలకంపై చెరగని ముద్రవేస్తున్నాయి. ఇంతటి నైపుణ్యం గల డ్రాయింగ్ టీచర్ కృష్ణ తనకు సహజంగా అబ్బిన కళను చిన్నారులకు నేర్పిస్తూ వారిలో సమాజిక స్పృహను పెంపొందిస్తున్నారు. ఆయన శిష్యులు జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. - చందులూరు(లక్కవరపుకోట) * చిత్రకళలో చందులూరు డ్రాయింగ్ టీచర్ ప్రతిభ * విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ * జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన కృష్ణ శిష్యులు లక్కవరపుకోట మండలం చందులూరు జిల్లా పరిషత్ పాఠశాల్లో డ్రాయింగ్ టీచర్‌గా కాంట్రక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కొటాన కృష్ణ చిత్రకళతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పలు అంశాలపై ఆయన గీసిన చిత్రాలు పండితులతోపాటు పామరులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. తనకు తెలిసిన కళను పిల్లలకు నేర్పించేందుకు కృష్ణ తపనపడుతుంటారు. ఆయన చిత్రకళపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కృష్ణ శిష్యులు గీసిన చిత్రాలకు 2013 నుంచి వరుసగా జాతీయ స్థాయిలో బంగారు పతకాలు లభిస్తున్నాయి. తెనాలిలోని అజంతా కళారామంలో గత ఏడాది నిర్వహించిన ఆలిండియా చిత్రలేఖనం పోటీల్లో భ్రూణహత్యలపై కృష్ణ గీసిన చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన కుంచె నుంచి జాలువారిన ప్రకృతి అందాలు, పల్లెటూరి జీవిన చిత్రం, సంఘసంస్కర్తలు, జాతీయ నాయకుల బొమ్మలను పాఠశాలకు ప్రదానం చేశారు. సినీరంగంలో ప్రవేశం.. కృష్ణ కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ప్రముఖ నటుడు దివంగత శ్రీహరి నటించిన ‘అయోధ్య రామయ్య’ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. సినీరంగంలో పరిస్థితులకు అనుగుణంగా జీవించలేక ఆయన సొంత ఊరు వచ్చేశారు. నా జీవితంలో కళ లేదు ‘సమాజంలో జరిగే ఎన్నో సంఘటనలను జీవకళ ఉట్టిపడేలా చిత్రాలుగా మలిచిన నా జీవితంలో మాత్రం కళ లేకుండాపోయింది. ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్లను క్రమబద్ధీకరించాలి. మా కుటుంబాల్లో కళ నింపాలి.’