పెయింట్ల కంపెనీలకు కలర్ ఫుల్ డేస్..! | Painters companies colorful Days | Sakshi
Sakshi News home page

పెయింట్ల కంపెనీలకు కలర్ ఫుల్ డేస్..!

Published Tue, Jan 19 2016 2:11 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

పెయింట్ల కంపెనీలకు కలర్ ఫుల్ డేస్..! - Sakshi

పెయింట్ల కంపెనీలకు కలర్ ఫుల్ డేస్..!

కలిసొచ్చిన పండుగల సీజన్
రానున్న రోజుల్లో అమ్మకాల జోష్
రూ. 40,000 కోట్లకు పెయింట్ పరిశ్రమ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :పెయింట్ల కంపెనీలకు కలర్‌ఫుల్ డేస్ మొదలయ్యాయి. అంతంత మాత్రంగా అమ్మకాలను నమోదు చేస్తున్న పరిశ్రమకు పండుగల సీజన్ జోష్‌నిచ్చింది. మొత్తం పరిశ్రమలో 70 శాతం వాటా ఉన్న డెకొరేటివ్ పెయింట్ల విక్రయాలు రెండంకెల వృద్ధి నమోదు చేయడంతో కంపెనీల ఆనందానికి అవధులు లేవు. దీనికితోడు అంతర్జాతీయంగా క్రూడ్ ధర భారీగా పతనమవడంతో తయారీ వ్యయం దిగిరావడం కూడా కలిసొచ్చింది. ముడిపదార్థాల ధరలు పెరిగినప్పుడల్లా పెయింట్ల ధరలను పెంచుతూ వచ్చిన కంపెనీలు.. కొద్ది రోజుల క్రితం ఏకంగా ఉత్పత్తుల ధరలు 12% దాకా తగ్గించడం పరిస్థితికి అద్దం పడుతోంది. రానున్న రోజుల్లో మార్కెట్ మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి.

 తగ్గిన పెయింట్ల ధరలు..
 ముడిపదార్థాల వ్యయం అధికమైనప్పుడల్లా లాభాలపై ఒత్తిడి పెరుగుతోందంటూ కంపెనీలు పెయింట్ల (రంగుల) ధరలను పెంచుతూ వస్తున్నాయి. అయితే క్రూడ్ ధర ఇప్పుడు బారెల్‌కు 30 డాలర్ల దిగువకు వచ్చి చేరింది. దీంతో దాదాపు అన్ని కంపెనీలు పెయింట్ల ధరలను కొద్ది రోజుల క్రితం 10-12 % దాకా తగ్గించాయి. ముడిసరుకు ధర తగ్గిన స్థాయిలో పెయింట్ల ధరలను తగ్గించలేదని వాల్యూలైన్ పెయింట్స్ సీఈవో ప్రవీణ్ గుప్తా వెల్లడించారు. ధరలను తగ్గించినప్పటికీ కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయని చెప్పారు. ధర పెంచాలన్నా, తగ్గించాలన్నా అన్ని కంపెనీలు ఆసియన్ పెయింట్స్‌ను అనుసరిస్తాయని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

 లాభాల్లో కంపెనీలు..
 డిసెంబర్ క్వార్టరులో ఏషియన్ పెయింట్స్ నికర లాభం 26% ఎగసి రూ.463 కోట్లను ఆర్జించింది. ఆదాయం 14% వృద్ధితో రూ.4,160 కోట్లుగా ఉంది. ‘దేశీయంగా మార్కెట్ పరిస్థితి ఇంకా సవాల్‌గానే ఉంది. పండుగల సీజన్ తోడవడంతో డెకొరేటివ్ విభాగం పరిమాణం పరంగా రెండంకెల వృద్ధి నమోదు చేసింది’ అని ఏషియన్ పెయింట్స్ ఎండీ కె.బి.ఎస్.ఆనంద్ వెల్లడించారు. క్రితంతో పోలిస్తే ఆటోమోటివ్ పెయింట్లకు డిమాండ్ పెరిగిందన్నారు. ఇక సెప్టెంబరు త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ నికర లాభం 33% వృద్ధి చెంది రూ.89 కోట్లుగా ఉంది. కన్సాయ్ నెరోలాక్ 33 శాతం వృద్ధితో రూ.97 కోట్లను ఆర్జించింది. డిసెంబర్ క్వార్ట ర్‌లో ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తాయన్న అంచనాలున్నాయి.

 రానున్నది మంచి కాలం..
 గత ఏడాది పరిశ్రమ 15% వృద్ధి నమోదు చేసిందని కంపెనీలంటున్నాయి. 2014 వరకు పరిశ్రమలో సింహ భాగమైన డెకొరేటివ్ వి భాగం స్తబ్దుగా ఉంది. రీపెయింటింగ్ పెద్దగా జరగలేదు. పైగా త క్కువ ఖరీదైన ఉత్పత్తులను కస్టమర్లు ఎంచుకోవడమే ఇందుకు కారణమని పెర్లాక్ మార్కెటింగ్ డెరైక్టర్ లాజర్ ఆంటోనీ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఇక రానున్న రోజుల్లో స్మార్ట్‌సిటీల ని ర్మాణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక వసతుల ఏర్పాటు, హౌసింగ్ స్కీమ్స్‌కు పెద్ద ఎత్తున వెచ్చించనున్నాయి. అటు వాహన రంగం రికవరీ బాటలో వెళ్తోంది. వెరశి రానున్న రోజుల్లో దేశవ్యాప్తం గా పెయింట్ కంపెనీలకు కలర్‌ఫుల్ డేస్ అని లాజర్ పేర్కొన్నారు.
 
  ఇదీ మార్కెట్..
 భారత్‌లో పెయింట్ మార్కెట్ పరిమాణం సుమారు రూ.40,000 కోట్లకుపైమాటే. ఇందులో డెకొరేటివ్ (గృహాలకు వాడే) పెయింట్ల వాటా అత్యధికంగా 70 శాతముంది. మొత్తం పరిశ్రమలో వ్యవస్థీకృత రంగం వాటా 70 శాతం కాగా, అవ్యవస్థీకృత రంగం 30 శాతం కైవసం చేసుకుంది. వ్యవస్థీకృత రంగంలో ఏషియన్ పెయింట్స్ రారాజుగా వెలుగొందుతోంది. ఈ కంపెనీకి ఏకంగా 55 శాతం వాటా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కన్సాయ్ నెరోలాక్, బెర్జర్ పెయింట్స్, అక్జో నోబెల్‌లు ఉన్నాయి. ఇక పర్యావరణ అనుకూల పెయింట్లకు మెల్లమెల్లగా డిమాండ్ పెరుగుతోంది. సాధారణ పెయింట్లతో పోలిస్తే వీటి ధరలు ఎక్కువగా ఉండడంతో వృద్ధి మందకొడిగా ఉంది. వినియోగం పెరిగితే ధరలు దిగొస్తాయని కంపెనీలు అంటున్నాయి.
 
 విస్తరణలో దిగ్గజాలు..
 రానున్న రోజుల్లో డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో ఏషియన్ పెయింట్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్లాంట్ల సామర్థ్యం పెంచే పనిలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ వద్ద 4 లక్షల కిలోలీటర్ల వార్షిక సామర్థ్యంగల ప్లాంటు నెలకొల్పుతోంది. కర్ణాటకలోని మైసూరు వద్ద 6 లక్షల కిలోలీటర్ల వార్షిక సామర్థ్యంతో అతిపెద్ద ప్లాంటును రూ.2,300 కోట్లతో నెలకొల్పుతోంది. హరియాణాలోని రోహ్‌తక్ ఫెసిలిటీ సామర్థ్యాన్ని రెండింతలు చేస్తున్నట్టు ఆసియన్ పెయింట్స్ సేల్స్, మార్కెటింగ్ ప్రెసిడెంట్ అమిత్ సింగ్లే వెల్లడించారు.

అస్సాంలో రెండు ప్లాంట్లను రూ.60 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు బెర్జర్ పెయింట్స్ చైర్మన్ కె.ఎస్.ధింగ్రా తెలిపారు. కన్సాయ్ నెరోలాక్ రూ.180 కోట్లతో పంజాబ్‌లో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. నవీ ముంబైలో రూ.40 కోట్లతో భారీ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని సైతం స్థాపిస్తోంది. స్టీలు, సిమెంటు, పవర్ రంగాల్లో ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ పెయింట్ల పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. రూ.1,000 కోట్లతో పశ్చిమ బెంగాల్‌లో ప్లాంటు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సొంత అవసరాలకూ పెయింట్ ఉపయోగపడుతుందన్నది కంపెనీ ఆలోచన.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement