న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్‌పై మరింతగా కసరత్తు చేస్తోంది. రాబోయే బిగ్ బిలియన్ డేస్ (టీబీబీడీ) 2024 సేల్ కోసం పెద్ద ఎత్తున నియామకాలు జరపనుంది. కొత్తగా 1 లక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్‌హౌస్ అసోసియేట్లు, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లు, కిరాణా పార్ట్‌నర్లు, డెలివరీ డ్రైవర్లు మొదలైన సిబ్బందిని తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.
పండుగ సీజన్ కోసం కొత్త వర్కర్లకు అవసరమైన శిక్షణనివ్వనున్నట్లు వివరించింది. ఇప్పటికే తొమ్మిది నగరాల్లో 11 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను (ఎఫ్‌సీ) ప్రారంభించినట్లు, దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 83కి చేరినట్లు ఫ్లిప్‌కార్ట్ వివరించింది. సామాజిక–ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్న లక్ష్యంతో ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా ఒకవైపు తమ నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంతో పాటు మరోవైపు ఆర్థిక వృద్ధికి దోహదపడాలని, స్థానిక కమ్యూనిటీలకు సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వివరించింది. తమ సరఫరా వ్యవస్థ కార్యకలాపాలు నిరాటంకంగా సాగేలా, పెరుగుతున్న డిమాండ్ ప్రకారం నిల్వల నిర్వహణ, ప్రోడక్టుల లభ్యత మొదలైన అంశాలను మెరుగుపర్చుకునేందుకు వినూత్నమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పండుగల సీజన్‌లో ఈ–కామర్స్ కంపెనీలు కల్పించే ఉద్యోగాలు సాధారణంగా ఆయా సీజన్‌లకు పరిమితమైనవిగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment