పండుగల్లో 12 లక్షల మందికి ఉపాధి అవకాకాశాలు
లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో నియామకం
ముంబై: ఈ ఏడాది పండుగల సందర్భంగా తాత్కాలిక కార్మికులకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోల్చితే గిగ్ వర్కర్లు (తాత్కాలిక ఉద్యోగులు)/ఫ్రీలాన్సర్ల డిమాండ్ 23 శాతం పెరిగినట్టు ‘అవ్సార్’ గివ్ వర్కర్స్ నివేదిక వెల్లడించింది. రిటైల్ రంగంలో వచ్చిన మార్పులు, కస్టమర్ల వినియోగం, వారి అంచనాలు పెరగడం, ఈ కామర్స్ సంస్థల విస్తరణ ఈ డిమాండ్‌కు మద్దతునిచ్చినట్టు తెలిపింది.
పండుగల సందర్భంగా 12 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు ఏర్పడినట్టు వెల్లడించింది. ఉద్యోగ నియామక సేవలు అందించే అవ్సార్ తన ప్లాట్‌ఫామ్‌పై డేటాను విశ్లేషించిన అనంతరం ఈ వివరాలు విడుదల చేసింది. లాజిస్టిక్స్, రిటైల్, ఈ కామర్స్, కస్టమర్ సపోర్ట్ రంగాలపై అధ్యయనం చేసింది.
ద్వితీయ శ్రేణి పట్టణాలైన సూరత్, జైపూర్, లక్నో తాత్కాలిక పనివారికి ప్రధాన కేంద్రాలుగా మారినట్టు తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు మొత్తం మీద ఉపాధి పరంగా ముందున్నట్టు, మొత్తం డిమాండ్‌లో ఈ మూడు మెట్రోల నుంచే 53 శాతం ఉన్నట్టు వెల్లడించింది. సంప్రదాయంగా మెట్రోల్లో కనిపించే తాత్కాలిక కార్మికుల సంస్కృతి, టైర్ 2 పట్టణాలకూ విస్తరిస్తున్నట్టు పేర్కొంది.
పెరిగిన వేతనాలు: నైపుణ్య మానవవనరులను ఆకర్షించేందుకు ఈ సీజన్‌లో కంపెనీలు అధిక వేతనాలను ఆఫర్ చేసినట్టు తెలిపింది. ఫీల్డ్ టెక్నీషియన్లకు ప్రతి నెలా రూ.35,000, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, డెలివరీ బాధ్యతలకు రూ.18,000–28,000 వరకు చెల్లించినట్టు వివరించింది. అధిక డిమాండ్ ఉండే నైపుణ్య పనుల నిర్వహణకు మానవ వనరుల కొరత, సేలకు డిమాండ్ అధిక వేతనాలకు దారితీసినట్టు తెలిపింది. ప్రధానంగా లాజిస్టిక్స్, రిటైల్, ఈ కామర్స్ రంగాలు తాత్కాలిక ఉద్యోగులకు ఈ ఏడాది పండుగల సీజన్‌లో ఎక్కువ ఉపాధి కల్పించినట్టు వెల్లడించింది. దేశ ఉపాధి రంగంపై గిగ్ ఎకానమీ దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది.
పట్టణాల్లో తగ్గిన నిరుద్యోగం
సెప్టెంబర్ త్రైమాసికంలో 6.4%
పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 6.4 శాతానికి దిగొచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నిరుద్యోగం 6.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.6 శాతంగా ఉండడం గమనార్హం. నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌వో) 24వ పీరియాడిక్ లేబర్ సర్వే వివరాలను విడుదల చేసింది.
పట్టణాల్లో 15 ఏళ్లు నిండిన మహిళల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబర్ చివరికి 8.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 8.6 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది జూన్ చివరికి 9 శాతంగా ఉంది. 15 ఏళ్లు నిండిన పురుషులకు సంబంధించి పట్టణ నిరుద్యోగం సెప్టెంబర్ చివరికి 5.7 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6 శాతం కాగా, ఈ ఏడాది జూన్ చివరికి 5.8 శాతంగా ఉంది. జూలై–సెప్టెంబర్ కాలంలో కారి్మకుల భాగస్వామ్య రేటు 50.4 శాతానికి మెరుగుపడింది. క్రితం ఏడాది సెప్టెంబర్ చివరికి ఇది 50.1 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment