చిత్రం గీయడం చిన్న విషయమేమీ కాదు. ఆలోచనకు తగ్గట్టు కుంచెను కదిలించి.. అద్భుతాలను ఆవిష్కరించాలి. ఇలాంటి చిత్రకారులు చాలామందే ఉంటారు. కానీ ఒక బొమ్మను చూస్తూ ఉన్నది ఉన్నట్టు గీయడం (పోర్ట్రేట్ పెయింటింగ్) ఒక సవాల్. అంతటి కష్టమైన పనిని కృషి, పట్టుదలతో సునాయాసంగా చేసేస్తున్నాడు హైదరాబాద్ చిత్రకారుడు ముక్కపల్లి లక్ష్మీనారాయణ. పోర్ట్రేట్ పెయింటింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.
నగరంలోని అత్తాపుర్ సమీపంలో నివసించే లక్ష్మీనారాయణ ఆవిష్కరించిన అద్భుతాలకు బంగారు పతకాలు వరుసకట్టాయి. 2003లో పోర్చుగల్‌లో జరిగిన అండ్‌ర్ 19 ప్రపంచ పెయింటింగ్ పోటీలకు తాను గీసిన చిత్రాలను పంపగా గోల్డ్ మెడల్ వరించింది. అదే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగిన వరల్డ్ పెయింటింగ్ కాంపిటీషన్స్‌లోనూ, 2004లో జపాన్‌లో నిర్వహించిన పోటీల్లోనూ బంగారు పతకం కొల్లగొట్టాడు. అంతేకాకుండా మరెన్నో పోటీల్లో అవార్డులు అందుకున్నాడు.
ఐదేళ్ల నుంచే ఆసక్తి..
మామ కుమారుడు రమేష్ గీసిన చిత్రాలను చూసి ఐదేళ్ల వయసులోనే ఆర్ట్‌పై ఆసక్తి పెంచుకున్న లక్ష్మీనారాయణ... అప్పటి నుంచి తన ముందు కనిపించే వ్యక్తులు, వివిధ వస్తువుల బొమ్మలు వేయడం ప్రారంభించాడు. అలా చిత్రాలు గీస్తూ ఇంటర్ పూర్తి చేసిన లక్ష్మీనారాయణ... జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో పెయింటింగ్‌లో డిగ్రీ చేశాడు.
ఆర్ట్ అదరహో..
జీహెచ్‌ఎంసీ నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా చందానగర్, పరేడ్‌గ్రౌండ్ ఎదురుగా మెట్రో పిల్లర్స్‌పై, జలగం వెంగళరావు పార్క్ తదితర ప్రాంతాల్లో అద్భుతమైన చిత్రాలు గీశాడు లక్ష్మీనారాయణ. సినీరంగంలోనూ తనదైన ప్రతిభ చూపి ప్రముఖుల మన్ననలు అందుకున్నాడు. ‘కంట్రోల్ సీ’ సినిమా పూర్తిగా ఆర్ట్‌పై ఆధారపడి ఉంటుంది. అందులో హీరోయిన్ కలలో కనిపించే వాటిని బొమ్మలుగా వేయడం ఇందులో ప్రత్యేకత. ఈ సినిమాకు లక్ష్మీనారాయణే చిత్రాలు గీశారు. ఇక ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా కోసం అమితాబచ్చన్, ఎన్టీఆర్ తదితర ప్రముఖుల పోర్ట్రేట్ పెయింటింగ్స్‌ను భారీ టీన్స్‌పై వేసి అందరి అభినందనలు పొందాడు.
‘సార్ ప్రోత్సాహంతోనే’...
ఇంటర్‌లో నేను గీసిన బొమ్మను చూసిన మా శ్రీధర్ సార్.. నన్ను ప్రోత్సహించి జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరమని సూచించారు. ఆయన సలహాతోనే నేనిప్పుడు ఆర్టిస్ట్ అయ్యాను. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి ఉచితంగా శిక్షణనిచ్చాను. సర్కార్ సహకారం అందిస్తే ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు ఉచితంగా శిక్షణనివ్వాలని అనుకుంటున్నాను.
- లక్ష్మీనారాయణ
Comments
Please login to add a commentAdd a comment