తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కొలనుకొండలో ఆదివారం ఉదయం నివాసాల మధ్య పెద్ద పేలుడు శబ్దం రావడంతో రాజధాని ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పెయింట్ డబ్బాలో తెల్లని రాళ్లు ఉండడం వల్ల పేలుడు సంభవించిందని ఆ ఇంటి యజమానులు చెబుతున్నప్పటికీ స్థానికులు, పోలీసులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్లాస్టిక్ పెయింట్ డబ్బాలో నిజంగా కార్బైడ్‌ను అమరిస్తే దాని నుంచి వెలువడిన గ్యాస్‌కు అంత పేలుడు సంభవిస్తుందా? అయినా కార్బైడ్‌కు నీళ్లు తగలకపోతే దాని నుంచి ఎటువంటి రియాక్షన్ రాదు. నాగరాజు ఇంట్లో పేలిన ప్లాస్టిక్ డబ్బా ఆరు నెలల క్రితం పని వద్ద నుంచి తీసుకొచ్చి ఇంట్లో బయట పెట్టాడని పోలీసుల విచారణలో తెలిపారు. అయితే ప్లాస్టిక్ డబ్బాలో తెల్లని పదార్థం ముందుగా నాగరాజు గమనించలేదా? ఆ పెయింట్ డబ్బా మూత ౖఒక్కసారి తీసి పెట్టింది కాబట్టి లూజుగానే ఉంటుంది.
నిజంగా గ్యాస్ ఫామ్ అయితే ఆ మూత ఎప్పుడో పైకి లేచిపోయేదని పోలీసులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు తాపీ పనితోపాటు అప్పుడప్పుడు చేపలు కూడా పడుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చేపలు వేటాడేవారు గతంలో డిటనేటర్స్‌ను వాడి నీటిలో పేల్చి చనిపోయిన చేపలను పట్టుకునే వారు. దాని కోసం తీసుకొచ్చి ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ డబ్బాలో దాచి పెట్టాడా? ప్రమాదవశాత్తూ ఒత్తిడి తగిలి బ్లాస్టింగ్ అయిందా? చుట్టుపక్కల కొండ తొలిచే వారు నాగరాజుకు ఇచ్చి దాచిపెట్టమన్నారా ? అనే విషయాలు తేలాల్సి ఉంది. నాగరాజు భార్య భవానీ మాత్రం ఆ బకెట్‌లో తెల్లని వస్తువులు ఉన్నాయని మాత్రమే చెబుతుంది. ఏమైనా నాగరాజు స్పృహలోకి వస్తేగాని నిజానిజాలు బయటకు రావు.
మొన్న హత్య... నేడు పేలుడు...
ఒక్కసారిగా జరిగిన పేలుడుకు రాజధానిలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మొన్న విజయవాడలో రౌడీషీటర్‌ను తెనాలికి చెందిన వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఆ సంఘటన మరువక ముందే కొలనుకొండ ప్రాంతంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం, నాగరాజుది కూడా తెనాలి ప్రాంతం కావడం, వారితో ఏమన్నా సంబంధాలున్నాయా ? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ హత్య నేపథ్యంలోనే విజయవాడకు అతి సమీపంలో ఉన్న కొలనుకొండ ప్రాంతంలో పేలుడు పదార్థాలను దాచిపెట్టారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు పేలుడు సంభవించిన ప్రాంతంలో శకలాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో జరిగిన పేలుడు కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు సైతం సీరిసయ్‌గా దృష్టి సారించారు.
ఆ కత్తేమైంది?
నాగరాజు ప్లాస్టిక్ డబ్బాను తెరవడానికి ఉపయోగించిన కత్తి ఏమైంది? పెయింట్ డబ్బాకు వాస్తవానికి కోయాల్సిన అవసరం లేదు. పెయింట్ ఉపయోగించడానికి దానికున్న సీల్ తీసి.. పెయింట్‌ను వాడతారు. నాగరాజు తాపీ పని చేసి దగ్గర్నుండి ఆ డబ్బా తీసుకొచ్చాడని ఆయన భార్య చెబుతుంది. డబ్బా మూత గట్టిగా పట్టుకొని చేత్తో లాగితే వచ్చేస్తుంది. కానీ నాగరాజు కత్తితో కోయడానికి ఎందుకు ప్రయత్నించాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నాగరాజు పని చేసే దగ్గర డబ్బా తీసుకొచ్చినట్లయితే ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకొస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నాగరాజు పరిస్థితి విషమం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేలుడు ఘటనలో గాయపడి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిలో కార్పెంటర్ నాగరాజు శ్వాసతీసుకోవడం కష్టతరంగా మారడంతో అత్యవసర వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పేలుడులో కుడికాలు మోకాలు కింద వరకూ తెగిపోవడం, ఎడమ కాలు సైతం నుజ్జు నుజ్జు కావడంతో తీవ్రమైన రక్తస్రావం జరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా శరీరం సైతం 80 శాతం గాయాలు కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలిపారు. ఇదే ఘటనలో గాయపడిన మణిమ్మ కాళ్ల ఎముకలు, తుంటె, పక్కటెముకలు విరిగిపోయాయి. మరో మహిళ భవానీ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఈమెను సర్జరీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment