కాలుష్యం నుంచి కళాఖండాల సృష్టి
వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్ల ప్రమాదమే తప్ప ప్రయోజనం ఏమీ లేదని మనం ఇంతకాలం భావిస్తూ వచ్చాం. కానీ వాహనాల గొట్టాల నుంచి వెలువడే పొగను పట్టి, బంధించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడమే కాకుండా బంధించిన కర్బన ఉద్గారాల నుంచి కళాఖండాలను సృష్టించేందుకు, పెన్నులో సిరాగా నింపుకొని రాసుకునేందుకు వీలుందని బెంగళూరుకు చెందిన ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామిక మిత్రులు నిరూపించారు.
అనిరుధ్ శర్మ, నిఖిల్ కౌషిక్, నితేష్ కండ్యన్ అనే ఆ ముగ్గురు మిత్రులు గ్రావికీ ల్యాబ్స్‌ను ఏర్పాటుచేసి కర్బన ఉద్గారాలను పెయింటింగ్ సిరాగా ఎలా మార్చవచ్చో నిరూపించి చూపారు. వాహనాల గొట్టాల నుంచి పొగల రూపంలో వెలువడే కర్బన ఉద్గారాలను సేకరించేందుకు వారు 'కాలింక్' అనే గుడ్రటి ఆకారం గల ఓ గొట్టాన్ని తయారు చేశారు. వీటిని వాహనాల పొగగొట్టాలకు అమరుస్తారు. వీటి గోడలు కర్బనాలను పీల్చుకొని మిగతా గాలిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దానివల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు కలవవు. అనంతరం కాలింక్‌లను వాహనాల నుంచి తొలగించి ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ కాలింక్‌ల నుంచి కర్బన ఉద్గారాలను సేకరించి రసాయనిక ప్రక్రియ ద్వారా సిరాగా మారుస్తారు. ఆ సిరాను పెన్నుల్లో రాసుకునేందుకు, పెయింటింగ్స్‌కు వాయిల్స్ రూపంలో వినియోగించవచ్చు.
వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మహారాష్ట్ర పర్యావరణ శాఖ ట్రాఫిక్ కూడళ్ల వద్ద కాలుష్యం పీల్చుకునే పరికరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించిందని, వాతావరణంలో కర్బన ఉద్గారాలు కలిశాక మాత్రమే ఆ పరికరాలు వాటిని పీల్చుకుంటాయని, వాతావరణంలో కలవడాని కన్నా ముందే వాహనాల వద్దనే ఈ కర్బన ఉద్గారాలను సేకరించడం మంచిదనే ఆలోచనలో నుంచి తమ ప్రాజెక్టు మొదలైందని నిఖిల్ అనే యువకుడు వివరించారు.
ఈ ముగ్గురు 2,500 గంటలపాటు వాహనాల నుంచి వెలువడిన కాలుష్య ఉద్గారాల నుంచి 150 లీటర్ల ఎయిర్-సిరాను తయారుచేశారు. పెద్ద ఎత్తున ఈ సిరాను ఫ్యాక్టరీల స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ప్రభుత్వ విధాన నిర్ణయాలు తప్పనిసరని వారు చెప్పారు. తమ సిరాను ఉపయోగించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ముందుకొచ్చారని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే విషయంలో అమెరికాలోని పలు రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయని వారు చెప్పారు. ఏ దేశ ప్రభుత్వాలు సహకరించినా తాము పెట్రోలు బంకుల వద్ద ఈ 'కాలింక్'లను విక్రయించగలమని, మళ్లీ వాటివద్దే కర్బన ఉద్గారాలతో కూడిన కాలింక్‌లను సేకరించగలమని వారు చెప్పారు. ఈ ఆధునిక టెక్నాలజీ ఆలోచన వాస్తవానికి అనిరుధ్‌దని, ఆయన అమెరికాలోని ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్నప్పుడు మూడేళ్ల క్రితం కలిగిందని, ఇప్పుడు ముగ్గురం కలసి ప్రాజెక్టుపై ప్రయోగాలు చేయడం ద్వారా ఇప్పుడు ఈ టెక్నాలజీ విషయంలో విజయం సాధించామని మిగతా ఇద్దరు మిత్రులు వివరించారు. నిఖిల్ చార్టర్డ్ అకౌంటెంట్ కాగా, అనిరుధ్, నితేష్‌లు ఇంజనీర్లు.