బిస్వాల్ చిత్రం.. రైల్వే స్టేషన్లకు జీవం!
భారతీయులకు, రైళ్లకు విడదీయరాని అనుబంధం ఉంది. మన చరిత్రలోనూ, పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ ఇవి భాగం. ఒకచోటు నుంచి మరో చోటుకి రోజూ లక్షల మందిని సురక్షితంగా చేర్చేవి రైళ్లే. వీటిలో ప్రయాణం కంటే సదుపాయంగా మరే ప్రయాణమూ ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకే, భారతీయ చిత్రాల్లో రైళ్లకు ప్రముఖ స్థానం కల్పించారు. పదుల సంఖ్యలో సినిమాలు రైలు నేపథ్యంలోనే తెరకెక్కాయి. హిట్‌లు కూడా కొట్టాయి. షారుఖ్, కాజోల్‌లపై చిత్రించిన ప్రఖ్యాత ‘దిల్‌వాలే..’ స్లోమోషన్ సీన్ దీనికి నిదర్శనం. నేటికీ ఆ సీన్‌కు దాసోహమంటారు సినీ అభిమానులు.
సినిమాల తర్వాత అంతటి స్థాయిలో రైల్వేకు పేరు తీసుకొచ్చింది మాత్రం బిజయ్ బిస్వాలే అంటారు నాగ్‌పూర్ డివిజన్లో అతనితో కలిసి పనిచేసినవారు. రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బిస్వాల్.. తన వృత్తిని ఎంతగా ప్రేమించారో ఆయన గీసిన చిత్రాలను చూసి చెప్పొచ్చు. నిజంగా పెయింటింగేనా.. అనిపించేంత సహజంగా ఉంటాయి ఆ చిత్రాలు.
చల్లగా కురుస్తున్న చిరుజల్లుల్లో ట్రైన్ కోసం పరుగుపెట్టే సాధారణ ప్రజానీకాన్ని బిస్వాల్ కుంచె చిత్రిస్తుంటే చూసి తరించాల్సిందే. రైల్వే ప్లాట్‌ఫామ్‌లు, అక్కడి వాతావరణం ఆయన బుర్రలో ఎంతగా ముద్రించుకుపోయిందో తెలుపుతాయా చిత్రాలు. ప్రత్యేకించి ఎవరివద్దా శిష్యరికం చేయని బిస్వాల్.. చిన్ననాటి నుంచే చిత్రలేఖనం వైపు ఆకర్షితుడయ్యాడు. అలా ఓ వైపు చిత్రాలు గీస్తూనే మరోవైపు రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. కానీ, ఏనాడూ చిత్రలేఖనాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అలాగని దాన్ని వృత్తిగా ఎంచుకోవాల్సిన అవసరమూ ఆయనకు రాలేదు.
కానీ, 2011 నుంచి మాత్రం చిత్రలేఖనంపై ఆయన అభిప్రాయం మారిపోయింది. రోజూ సాధన చేయడం మొదలు పెట్టాడు. ఆ కళపై ఎంతటి పట్టు సాధించాడంటే.. అతడి పెయింటింగ్‌లను చూసి మన కళ్లను మనమే నమ్మలేనంత స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరిగి తన చిత్రరాజాలను ప్రదర్శిస్తున్నాడు. వీటిని చూశాక మాత్రం ఆయనకు రైల్వేలపై ఎంత ప్రేమో అనిపించకమానదు. ముఖ్యంగా, బహిరంగంగా ఉండే రైల్వే స్టేషన్లను గీయడంలో ఆయనను మించినవారు లేరు. ప్లాట్‌ఫామ్ పరిసరాలను అత్యంత సహజంగా తీసుకువస్తారాయన.
ప్రస్తుతం ఆయన కోరిక షిమ్లా లాంటి ప్రాంతాల్లో పర్యటించాలనీ, అక్కడి చిన్న చిన్న స్టేషన్లను చిత్రించాలనీ..! అది నెరవేరాలని కోరుకుందాం..!!