పెయింటింగ్స్.. ఆఫీసుల్లో, ఇళ్లలో అలంకరించుకోవడం తెల్సిందే. అయితే ఇప్పుడవి అద్భుతమైనచిత్రాలతో అందాన్ని పెంచే ఆర్టిస్టిక్ చీరలుగా మారిపోతున్నాయి. ఆరు గజాల చీర.. అందమైన కాన్వాస్‌గా ఒదిగిపోతోంది.ఒద్దికగా ‘ఆర్ట్’ని చిత్రించుకుంటోంది. చీరలపైనా ‘చిత్తరువు’లు మలచడం నేడు మగువల మనసులను ‘కట్టి’పడేస్తున్న లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్. హ్యాండ్ పెయింటింగ్ శారీస్ ఒరవడిని మార్చేస్తూ పుట్టుకొచ్చిన ఈ ‘చిత్ర’మైన చీరలు... కళాభిమానులైన సిటీ మహిళల చేత ‘శారీ’గమలు పాడిస్తున్నాయి.
- ఎస్.సత్యబాబు
ఆరు గజాల చీరలో ప్రతి అంశం అపురూపమైనదే. కళాత్మకమైందే. అటువంటి చీరపై ప్రముఖ చిత్రకారుల కళా ప్రతిభను దర్శింపజేస్తే వచ్చే లుక్ ఎంత గొప్పగా ఉంటుంది? ఈ ఆలోచనే హ్యాండ్ పెయింటింగ్ చీరల సృష్టికి దారితీసింది. ఇటీవలే ఊపందుకున్న ఈ తరహా చీరల ట్రెండ్‌కు ఓనమాలు దిద్దించిన వారిలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు ఉత్పల్‌ఘోష్ ఒకరు. ఆయనే వీటిని సిటీకి పరిచయం చేశారు. అలా అలా... ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలతో హ్యాండ్ మేడ్ శారీస్ రూపొందించడం ఊపందుకుంది. ఇందులో మొన్నటి లియోనార్డో డావిన్సీ చిత్రాల నుంచి నేటి ఎస్ హెచ్ రజా వంటి టాప్ క్లాస్ ఆర్టిస్ట్‌ల పెయింటింగ్స్ నుంచి ఇన్‌స్పైర్ అయి గీసిన చిత్రాలు ఉంటున్నాయి.
ఆరు గజాల ఆర్ట్.. ఆన్‌లైనే ‘మార్ట్’
ఇంకా మార్కెట్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని ఈ తరహా శారీస్ ఆన్‌లైన్ ద్వారా బాగా పాపులర్ అయ్యాయి. ‘కోల్‌కతాకు చెందిన ఆర్టిస్ట్ ఉత్పల్ ఘోష్ క్రియేటివిటీ నా కళ్ల పడింది. ఆయన గీసిన ఒక చిత్రం బాగా నచ్చి ఆ చిత్రాన్నే శారీ మీద పెయింట్ చేసి ఇవ్వమని అడిగితే అద్భుతమైన రీతిలో చేసి పంపారు. అది కట్టుకుంటే సన్నిహితులు, బంధువుల నుంచి వచ్చిన స్పందన, ఎంక్వయిరీలే హ్యాండ్ పెయింటింగ్ శారీస్‌ను సిటీకి పరిచయం చేయాలనే ఆలోచనకు నాంది’ అని వివరించారు స్వప్న. సికింద్రాబాద్‌లో నివసించే స్వప్న... ప్రస్తుతం స్టూడియో 6యార్డ్స్ పేరుతో హ్యాండ్ వూవెన్, హ్యాండ్ పెయింటెడ్... ఇలా విభిన్న రకాల శారీస్‌ను ఆన్‌లైన్ ద్వారా మార్కెట్ చేస్తున్నారు.
ఈజీ మేడ్ కాదు...
ఈ చీరలు చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటాయో... తయారీ ప్రక్రియ అంత సంక్లిష్టమైంది. కనీసం 20 నుంచి నెల రోజుల సమయం పడుతుంది ఒక్కో చీర తయారీకి. ఈ పెయింటింగ్‌లోని కళాప్రతిభ సరైన రీతిలో రిఫ్లెక్ట్ అవ్వాలంటే సరైన ఫ్యాబ్రిక్ జత కూడాలి. అందుకే తాను తన చిత్రాల చిత్రణకు బిష్ణుపూర్ సోనాముఖి సిల్క్‌ను ఎంచుకున్నానని చిత్రకారుడు ఉత్పల్ అంటున్నారు. ముందుగా వస్త్రంపై పెయింటింగ్ పూర్తి చేసిన తర్వాత స్టీమింగ్, డైయింగ్, పాలిషింగ్ వగైరాలు కూడా పూర్తయితే మోడ్రన్ ఆర్ట్ డెరైక్ట్‌గా ఫ్యాబ్రిక్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఫ్యాబ్రిక్ నుంచి ప్రతిదీ హ్యాండ్‌మేడ్ కావడమే ఈ శారీస్ విశిష్టత. అచ్చం కాన్వాస్‌పైన వేసినట్టే శారీస్‌పైన ఆర్టిస్ట్స్ చిత్రాలను గీస్తుంటారు. అంతేకాకుండా ఈ శారీస్ వెయిట్‌లెస్ కూడా కావడంతో పార్టీవేర్‌గా అద్భుతంగా అమరిపోతున్నాయని డిజైనర్‌లు చెబుతున్నారు.
ఆర్ట్ ఆన్ ఆర్డర్...
చాలా వరకూ ఇవి కస్టమైజ్డ్‌గానే ఉంటున్నాయి. కొన్ని పెయింటింగ్స్‌ను చూసి వాటితో శారీస్ రూపొందించాలని షోరూమ్స్ నిర్వాహకులు ఇచ్చిన ఆర్డర్స్‌కు అనుగుణంగా ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. వాటర్ కలర్ పెయింటింగ్స్, అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్.. ఇలా విభిన్న రకాల చిత్రలేఖనా రీతులకు తగ్గట్టుగా ఫ్యాబ్రిక్‌ని, ఆర్టిస్ట్‌ను ఎంచుకుని తీర్చిదిద్దడంతో ఇవి అటు ఫ్యాషన్ ఇటు ఆర్ట్ రెండింటినీ ఇష్టపడే వారిని ఆకట్టుకుంటున్నాయి.
ఆర్ట్‌కు కాంప్లిమెంట్...
ఆర్ట్, డిజైనింగ్ ఈ రెండూ ఒకదానితో మరొకటి కాంపీట్ చేయకూడదు. కాంప్లిమెంట్ చేసుకోవాలి. హ్యాండ్ పెయింటింగ్ శారీస్ చేస్తోందదే. పెయింటింగ్ చీరలు మహిళలు ధరించడం అనేది అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. అందుకనే పూర్తిస్థాయిలో వీటి తయారీకి సిద్ధమయ్యాం.
- ఉత్పల్‌ఘోష్, ఆర్టిస్ట్
వందలాదిగా కలెక్షన్...
ముందు హ్యాండ్ పెయింటింగ్ శారీకి అభిమానిని. ఇప్పుడు వాటిని సప్లయ్ కూడా చేస్తున్నా. దాదాపు 300 పైగా శారీస్ కలెక్షన్ మా దగ్గర ఉంది. దేశవిదేశాలలో 40 సంస్థలకు రెగ్యులర్‌గా సప్లయ్ చేస్తున్నాం. ఆర్ట్‌లో క్వాలిటీ మిస్సవ్వకుండా ధరించినవారి స్థాయిని పెంచే విధంగా హ్యాండ్ పెయింటింగ్ శారీస్ ఉండాలి.
- స్వప్న, స్టూడియో 6 యార్డ్స్
చిత్రమనుకోక..
Published Sun, Jan 4 2015 11:49 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM
Advertisement
Advertisement