ఆదిమానవుల పెయింటింగ్స్ గుర్తింపు | Preshistoric humans paintings found at mahabub nagar district | Sakshi
Sakshi News home page

ఆదిమానవుల పెయింటింగ్స్ గుర్తింపు

Published Mon, Jul 13 2015 2:30 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

ఆదిమానవుల పెయింటింగ్స్ గుర్తింపు - Sakshi

ఆదిమానవుల పెయింటింగ్స్ గుర్తింపు

మన్యంకొండలో రాతి పనిముట్లు లభ్యం
దేవరకద్ర రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్‌పల్లి సమీపంలోని బయ్యన్నగుట్టపై క్రీస్తుపూర్వం 8-12వేల ఏళ్లనాటి ఆదిమానవుల పెయింటింగ్స్‌ను ఆదివారం గుర్తించారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోని పెయింటింగ్స్, శిల్పకళ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసాచారి వీటిని గుర్తించారు. ఐదు నెలలుగా జిల్లాలోని శిల్పచిత్రాలపై ఆయన పరిశోధన చేస్తున్నారు. అందులోనే భాగంగానే బయ్యన్నగుట్టపై ఆదిమానవులు పెయింటింగ్స్‌ను పరిశీలించారు. అక్కడ బండరాళ్లపై ఆదిమానవులు వేసిన బల్లి, పాము, కమలం పువ్వు, ధనుస్సు, తొండ చిత్రాలు గుర్తించారు. ఈ చిత్రాలు కొత్త రాతియుగంలో వేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
 
 ఈ గుహ పక్కనే బండరాయిపై కోనేరు ఉండటంతో అప్పట్లో నీటికి సమీపంలో ఆదిమానవులు నివసించే వారని అంచనాకు వచ్చారు. అలాగే మన్యంకొండ అలివేలు మంగతాయారు దేవస్థానం సమీపంలోని గుట్టపై ఉన్న ఆదిమానవులు పెయింటింగ్ వేసిన చిత్రాలనూ పరిశీలించారు. ఈ చిత్రాలను గతంలో శ్రీశైలం ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ వెలుగులోకి తెచ్చారు. ఆ సమాచారం మేరకే అక్కడికి వెళ్లి ఆ చిత్రాలను కూడా పరిశీలించినట్లు చెప్పారు. అప్పట్లో ఆదిమానవులు వేసిన విత్తనం, మొలకెత్తే విత్తనం, రెండు పాముల కలయిక తో కనబడే చిత్రాలు కూడా ఉన్నాయి. జిల్లాలో ఆదిమానవులకు సంబంధించి అద్భుతమైన శిల్పసంపద ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసాచారి పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement