Prehistoric humans
-
లక్ష సంవత్సరాల క్రితం చిత్రాలు.. ఎలా ఉండేవి?
ఆటవిక యుగం మధ్య దశలో మనుషులు అరణ్యాలలో, కొండ గుహలలో నివసించేవారు. ఇళ్ళు కట్టుకోవడం అప్పటికి ఇంకా తెలియదు. వారిది గుంపు జీవితం. పదుల సంఖ్యలో ఉండే జనాభా చిన్న చిన్న గుంపులుగా జీవించేవారు. ఏ గుంపు ఆచారాలు దానివే. ఏ గుంపు నమ్మకాలు దానివే. ఇదంతా చరిత్ర. ఇక మన చుట్టూ జరుగుతున్న విషయాలను కొన్ని చిత్రాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. మరి లక్ష సంవత్సరాల క్రితం చిత్రాలు ఎలా ఉండేవి? చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్ గుహలోని చిత్రాలు లక్ష సంవత్సరాల క్రితం వేసినట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. టూల్ టోపోలాజీ ఆధారంగా.. ఈ ప్రదేశంలో చారిత్రక ఆనవాళ్లను గుర్తించినట్లు వివరించారు. పర్యావరణవేత్త సునీల్ హర్సనా వన్యప్రాణులు, వృక్షసంపదపై ఆరావళీ కొండల్లో వివిధ అంశాలను సునీల్ హర్సనా డాక్యుమెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి గుహలలోని కళను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో గుర్తించిన ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గుహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అలా ఈ చిత్రాలు పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. కాగా ఈ ఏడాది మే నెలలో పర్యావరణవేత్త సునీల్ హర్సానా… మంగర్ బని అటవీప్రాంతంలోని గుహలో ఈ చిత్రాలను గుర్తించారు. జూన్ నుంచి హర్యానా పురావస్తు శాఖ అధికారులు వీటిపై పరిశోధనలు జరిపారు. పురావస్తు శాఖ ఫరీదాబాద్‌లోని శిలాఖరి, మంగర్, కోట్, ధౌజ్ ప్రాంతాలలో, గుర్గావ్లోని రోజ్ కా గుజ్జర్, దమ్దామా వంటి ప్రదేశాలలో పరిశోధనలు నిర్వహించారు. ఇక అక్కడ రాతి యుగంలో వాడిన కొన్ని సాధనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగర్ బని అడవికి రక్షణ దీనిపై హర్యానా ప్రధాన కార్యదర్శి అశోక్ ఖేమ్కా మాట్లాడుతూ.. పాలియోలిథిక్ యుగానికి చెందిన పురాతన గుహ చిత్రాలు, సాధనాలు పెద్ద సంఖ్యలో ఉన్నందున చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల రక్షణ చట్టం 1964 ప్రకారం.. మంగర్ బని అడవికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల హర్యానాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఆరావళీ పర్వత శ్రేణిలోని గుహలలోని కొన్ని చిత్రాలను కూడా గుర్తించారు. ఇందులో మనుషుల బొమ్మలు, జంతువులు, ఆకులు, రేఖాగణిత చిత్రాలు ఉన్నాయి. ఇవి 40,000 సంవత్సరాల క్రితానికి (ఎగువ పాలియోలిథిక్ యుగం) చెందినవని, సుమారు 10,000 సంవత్సరాల క్రితం వరకు వర్థిల్లినట్లు తెలిపారు. @AshokKhemka_IAS Principal Secretary to govt archaeology dept Haryana said: "We will be giving MangarBani forest protection under Punjab Ancient & Historical Monuments & Archaeological Sites & Remains Act, 1964 because of presence of large number of stone age cave paintings." pic.twitter.com/IUN5AVzF31 — Aravalli Bachao (@AravalliBachao) July 15, 2021 -
మధ్య రాతియుగం ‘మోడ్రన్ ఆర్ట్’!
పాకుతున్న ఓ భారీ ఉడుము...ఆ పక్కనే తాబేలు డిప్పలో ఉండే ఆకృతుల సమ్మేళనం.. ఓ పక్కకు చూస్తే కుక్కలాంటి ఆకారం.. దానికి ఎదురుగా క్రమపద్ధతిలో పేర్చినట్టుగా అర్ధ చతురస్రాకారపు గీతల బొత్తి, అద్దంలో ప్రతిబింబంలా ఒకదానికొకటి విరుద్ధ దిశల్లో... మనిషిలాగా కనిపిస్తుంది, కాదు అది మృగమనే భావన ఆ వెంటనే కలిగే వింత ఆకృతి.. చుట్టూ మోహరించిన జలచరాలు, సరీసృపాలు, ఉభయచర జీవులను తలపించే మరిన్ని ఆకారాలు.. దాదాపు 28 అడుగుల పొడవున్న కాన్వాస్‌పై రూపొందించిన చిత్రాలివి. చూడగానే ఓ మోడ్రన్ ఆర్ట్‌ను తలపిస్తుందది. చిత్రాల ఆకారాలను సులభంగా పోల్చుకునేలా ఉండవు, కానీ మనసులో మెదిలే ఏవేవో భావాలకు ప్రతిరూపాలన్నట్టుగా తోస్తాయి. ఒకదాని కొకటి పొంతన ఉండవు, వేటికవే ప్రత్యేకం. ఇంతకూ ఆ చిత్ర విచిత్ర చిత్రాల సమాహారంగా ఉన్న కాన్వాస్ వయసెంతో తెలుసా? దాదాపు పది వేల నుంచి పదిహేను వేల ఏళ్లు - సాక్షి, హైదరాబాద్ ఆదిమానవుల చిత్రాలతో కూడిన గుహలు అడపాదడపా కనిపిస్తుంటాయి. దట్టమైన అడవులే కాదు, ఊరి పొలిమేరల్లో ఉండే గుట్ట రాళ్లపై ఎరుపురంగు చిత్రాలు అప్పుడప్పుడూ వెలుగు చూస్తూనే ఉంటాయి. నాటి మానవులు ఆవాసంగా మార్చుకున్న గుహ గోడలు, పైకప్పుపై రెండుమూడు చిత్రాలు, కొన్ని అంతుచిక్కని గీతలుంటాయి. కానీ, ఓ కాన్వాస్ తరహాలో ఎక్కువ సంఖ్యలో చిత్రాల సమూహం వెలుగు చూడటం మాత్రం అరుదు. అలాంటి అరుదైన రాక్ పెయింటింగ్స్ ఇప్పుడు భద్రాచలం అడవుల్లో బయటపడ్డాయి. పాల్వంచ సమీపంలోని ముల్కలపల్లి మండలం నల్లముడి గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో అడవిలో వెలుగుచూసింది. గతంలో సమీపంలోని అక్షరలొద్దిలో ఆదిమానవుల చిత్రాలు వెలుగు చూసిన నేపథ్యంలో స్థానిక ఉపాధ్యాయుడు కొండవీటి గోపివరప్రసాద్రావు వీటిని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కట్టా శ్రీనివాస్, శ్రీరామోజు హరగోపాల్, రాక్‌ఆర్ట్ సొసైటీ సభ్యులు డాక్టర్ మరళీధర్రెడ్డిలు వాటిని పరిశీలించి మధ్య రాతి యుగం నాటివి అయి ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొన్ని తరాల చిత్రాలు.. ఒంటి గుండుగా పేర్కొనే ఈ గుహలోని చిత్రాలు ఒకేసారి వేసినవి కావు. కొన్ని తరాలుగా వాటిని వేరువేరు మనుషులు గీస్తూ వచ్చారు. రంగు కొంత వెలిసిపోయి పాత చిత్రాలుగా కనిపిస్తుండగా, వాటిపై కొత్తగా వేసినట్టుగా మరికొన్ని చిత్రాలు ఎర్రటి రంగుతో మెరుస్తున్నాయి. ఈ గుహ కొన్ని తరాలపాటు మానవ ఆవాసంగా ఉందనటానికి ఇదో నిదర్శనం. చుట్టూ నీటి వనరులు ఉండటం, సమీపం అంతా మైదాన ప్రాంతంగా ఉండటం, గుండు ఎక్కితే దూరం నుంచే జంతువుల జాడ తెలుసుకునే వీలుండటంతో ఇది మానవ ఆవాసంగా చాలాకాలంపాటు వాడుకున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో వీలు చిక్కినప్పుడల్లా కొన్ని తరాల జనం ఆ గుహ గోడలను బొమ్మలతో నింపేశారు. సాధారణంగా ఆదిమానవుల చిత్రాల్లో మనుషులకు మచ్చికయ్యే పశువుల చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యవసాయాన్ని ప్రారంభించిన తర్వాత తరం వారు ఎక్కువగా ఎద్దుల చిత్రాలు గీసేవారు, కొన్ని చోట్ల శునకాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ పశువుల చిత్రాలు లేకపోవటం విశేషం. దీన్నిబట్టి వ్యవసాయ విధానం ప్రారంభించకపూర్వంనాటి మనుషులు ఈ చిత్రాలు గీసి ఉంటారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇక మన దగ్గర కనిపించే చిత్రాలు ఎరుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇక్కడ దాదాపు అన్ని చిత్రాలు ఎరుపు రంగుతోనే వేసినా, కొన్నింటికి తెలుపు రంగుతో అంచులు అద్దారు. మధ్య మధ్య తెలుపు రంగు చుక్కలతో ముస్తాబు చేసినట్టు ఉండటం విశేషం. ఆఫ్రికాలోని సాన్ థామస్ రివర్ ప్రాంతంలో కనిపించిన చిత్రాలను పోలి ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో రాళ్లపై గీతలతో చెక్కిన పెట్రో గ్లివ్స్ చిత్రాలు కూడా కనిపించాయి. కొన్ని అసంపూర్తి శిల్పాలు కూడా కానవచ్చాయి. తరువాతి పాలకులు ఇక్కడ ఏదో నిర్మాణం చేపట్టాలనుకుని కొంత పనిచేసి వదిలేసినట్టు అనిపిస్తోంది. ఈ రాతి చిత్రాల గుహ ఆదిమానవులపై ఎన్నో పరిశోధనలకు వీలుగా ఉన్నందున అది ధ్వంసం కాకుండా ప్రభుత్వం కాపాడాల్సి ఉంది. -
మంచిర్యాలలో పురాతన గోడ..
తెలంగాణలో మరో ప్రాచీన గుహల జాడ బయటపడింది. మంచిర్యాల సమీపంలోని బుగ్గగట్టు అటవీ ప్రాంతంలోని తాటిమట్టయ్య అనే గుట్టపైన ఇది వెలుగుచూసింది. వివిధ కాలాల్లో చిత్రించినట్టుగా భావిస్తున్న పలు చిత్రాలు గుహ గోడలపై కనిపిస్తున్నాయి. సాధారణంగా ఆదిమానవులు తమ చిత్రాలకు ఎరుపు రంగు వాడతారు. ఇక్కడ ఎరుపుతోపాటు తెలుపు, నలుపు, ముదురు ఆకుపచ్చ రంగు చిత్రాలుండటం విశేషం. దుప్పి, ఎద్దు, అడవి పందులు, ఉడుములు, తాబేలు, గుడ్లగూబ, గబ్బిలాలు, తేనెతుట్టె లాంటి చిత్రాలు గోడలపై కనిపిస్తున్నాయి. దాదాపు మూడడుగుల ఎత్తుతో మరో ఆకృతి గీసి ఉంది. రెండు కాళ్లు, రెండు చేతులు, తల భాగంలో కిరణాలతో ఉన్న మరో ఆకృతి ఉంది. దీన్ని స్థానికులు తాటిమట్టయ్య దేవుడిగా పిలుచుకుంటున్నారు. అమెరికాలోని ఉతా వ్యాలీ, టెక్సాస్ రియోగాండ్ లోయ, ఫ్రాన్స్‌లోని మరో ప్రాంతంలో ఇలాంటి భారీ ఆకృతులు కనిపిస్తాయి. దాదాపు పదేళ్ల కాలంలో వీటిని గీసినట్టు భావిస్తున్నామని ఈ చిత్రాల సమూహాన్ని గుర్తించిన ఔత్సాహిక పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఈ చిత్రాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. –సాక్షి, హైదరాబాద్ -
ఆ చిత్రాలకు ‘రంగు’ పడింది!
వేల ఏళ్ల కింద ఆది మానవులు గుహల్లో, తమ ఆవాసాల్లోని రాళ్లపై చిత్రించిన బొమ్మలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. సాధారణంగా మనం ఇప్పుడు వాడే రంగులు కొంచెం నీరు తగలగానే, కొంతకాలం కాగానే వెలిసిపోతాయి. కానీ ఆది మానవులు గీసిన చిత్రాలు మాత్రం ఇంకా నిలిచి ఉన్నాయి. ఎండకు ఎండి, వానకు నాని, వేల ఏళ్లుగా నిలిచి ఉన్న ఆ చిత్రాలకు వాడిన రంగులు, ఉపయోగించిన పద్ధతులు ఏమిటో తెలుసా..? ఇనుప ఖనిజం అధికంగా ఉండే హెమటైట్ రాయి. దీని పొడికి వివిధ పదార్థాలు కలిపి ఆది మానవులు చిత్రాలు వేసినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, ఫోరెన్సిక్ నిపుణుడు జ్ఞానేశ్వర్ తాజాగా నిర్ధారించారు. – సాక్షి, హైదరాబాద్ కొత్త రాతియుగం నుంచే రంగులు పాత రాతియుగం కాలంలో ఆది మానవుల చిత్రాల్లో రంగులు కనిపించవు. మొనదేలిన రాళ్లతో బండరాళ్లపై లోతుగా చెక్కి చిత్రాలకు ఆకృతి ఇచ్చేవారు. వాటిని పెట్రోగోలైవ్స్గా పేర్కొంటారు. అలాగే రాళ్లతో గీతలు గీసి (రాక్ బ్రూజింగ్స్) కూడా బొమ్మలు వేసేవారు. మధ్య రాతియుగం చివరికి వచ్చేసరికి రంగులు అద్దడం మొదలైంది. ఆ సమయంలోనివారు పెట్రోగ్లైవ్స్లో రంగులు వేయడం మొదలుపెట్టారు. వేల ఏళ్ల కింద చిత్రించిన పెట్రోగ్లైవ్స్లోనూ.. కొన్ని వందల ఏళ్ల తర్వాత రంగులద్దినట్టు పరిశోధకులు గుర్తించారు. ఖమ్మం జిల్లా రామచంద్రాపురం, పూర్వపు మెదక్ జిల్లా రత్నాపూర్లలో ఇలా పెట్రోగ్లైవ్స్, వాటిలో రంగులు వేసిన తీరు కనిపిస్తాయి. వేల ఏళ్లుగా నిలిచే ఉన్నాయి ఆది మానవులు వేల ఏళ్ల కింద రాళ్లపై చిత్రించిన బొమ్మలు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అసలేమాత్రం పరిజ్ఞానం లేని కాలంలో.. ఎరుపు, నలుపు రంగుల్లో ఆ చిత్రాలను ఎలా గీశారు, ఆ రంగుల కోసం వాడిన పదార్థాలేమిటన్న దానిపై మన దేశంలో ఇప్పటివరకు శాస్త్రీయ నిర్ధారణ జరగలేదు. ఒకటి రెండు చోట్ల మినహా పెద్దగా పరిశోధన కూడా జరగలేదు. కానీ కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆ దిశగా అడుగు వేసింది. ఖమ్మం జిల్లా రామచంద్రాపురం, మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి, వర్గల్లలోని ఆది మానవుల గుహల్లోని చిత్రాలపై పరిశోధన చేసి.. ఆ రంగులు ఏమిటనేది గుర్తించింది. అది హెమటైట్.. పీఠభూముల ప్రాంతాల్లో సహజంగానే ఎరుపు రంగులో ఉండే ఇనుము రాయి కనిపిస్తుంటుంది. అందులో హెమటైట్ అనే ఖనిజం ఉంటుంది. ఈ ఖనిజాన్నే ఆది మానవులు రంగు తయారీలో వినియోగించారని పరిశోధనలో గుర్తించారు. ఈ ఎరుపు రాయిని పొడి చేసి, అందులో జంతువుల కొవ్వు కలిపి ఎరుపు రంగును తయారు చేశారని నిర్ధారించారు. తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా చిత్రాలున్నందున ఈ ప్రాంతంలో అప్పట్లో ఈ రంగును విస్తారంగా వినియోగించినట్టు భావిస్తున్నారు. ఇక చిత్రాల్లో ముదురు రంగు వచ్చేందుకు హెమటైట్ పొడితోపాటు జంతువుల రక్తాన్ని కలిపి బొమ్మలు గీసిన తీరును గతంలోనే పరిశోధకులు గుర్తించారు. కొన్నిచోట్ల మూత్రం కలిపినట్టు కూడా తేలింది. వీటితోపాటు నలుపు రంగు కోసం హెమటైట్ పొడి, కొవ్వుతోపాటు రాక్షసబొగ్గు పొడిని కలిపి వాడారని తాజాగా నిర్ధారించారు. రాష్ట్రంలో తాము చేసిన పరిశోధనకు సంబంధించిన అధ్యయన పత్రాన్ని పుణెలో అక్టోబర్ 26 నుంచి జరగనున్న రాక్ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సులో సమర్పించనున్నట్టు హరగోపాల్ తెలిపారు. పరిశోధన ఇలా.. ఆది మానవుల చిత్రాల్లోని రంగుల రహస్యాలు తేల్చాలంటే.. ఆ రంగు ఉన్న భాగాన్ని సేకరించాల్సి ఉంటుంది. అలా చేస్తే చిత్రాలను ధ్వంసం చేసినట్టేనని రాక్ ఆర్ట్ సొసైటీ నిబంధనలున్నాయి. దీంతో రంగుల్లో ఉన్న పదార్థమేమిటో నిర్ధారించేందుకు ‘రామన్ స్పెక్ట్రా’పరీక్షను ఎంచుకున్నారు. ఈ పరికరం ఏదైనా వస్తువు లేదా ఉపరితలంపై కాంతి కిరణాలను ప్రసరింపజేసి.. అవి ప్రతిఫలించే కాంతి ఆధారంగా అక్కడి రసాయన లక్షణాలను గుర్తిస్తారు. ఈ లక్షణాలను అంతర్జాతీయంగా నిర్ధారించిన అంశాల ఆధారంగా డీకోడ్ చేసి.. రసాయనం ఏమిటో తేలుస్తారు. ఆది మానవుల చిత్రాలను దీని సహాయంతో పరీక్షించి.. రంగును హెమటైట్గా నిర్ధారించారు. -
ఆదిమానవుల పనిముట్లు లభ్యం
చేర్యాల: వరంగల్ జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట మిధునమ్మ చెరువు సమీపంలో ఆది మానవుల కాలం (నవీనయుగం) నాటి పనిముట్లు లభ్యమైనట్లు జౌత్సాహిక చరిత్ర పరిశోధకులు రత్నాకర్‌రెడ్డి తెలిపారు. ఆదిమానవులు రాతి పనిముట్లను తయారు చేసుకున్న గుర్తులను చెరువు సమీపంలో బుధవారం కనుగొన్నారు. ఈ సందర్భంగా రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చెరువు వద్ద ఏనెపై ఇస్త్రి పెట్టెగా పిలిచే రాయికి కుడివైపున12 అడుగుల పొడవైన రాతి శిలపై 50కి పైగా బద్దులు ఉన్నాయని, వీటిని పురావస్తు శాస్త్రంలో కప్యూల్స్ అంటారని తెలిపారు. రాయితో ఆ శిలపై ఎక్కడ కొట్టినా సంగీతం వినిపిస్తోందని, ఏనె నుండి బీరప్ప దేవాలయం మధ్య ఉన్న పంచరాయి భూమిలో ఆది మానవుల ఆవాసాలను గుర్తించామని వివరించారు. రాతి పనిముట్లు, మృణ్మయ పాత్రలు, చికరా రాళ్ల (ఇనుము)ను నాడు వినియోగించారని చెప్పారు. పురావస్తు శాఖ అధికారులు వీటిని పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట కాపుల మఠం బసవేశ్వర్, సిద్దిరాం మఠం వీరయ్య ఉన్నారు. -
పాలమూరులో ఆదిమానవుల హస్తరేఖా చిత్రాలు
పురావస్తుశాఖ పరిశోధనలో లభించిన ఆనవాళ్లు దేవరకద్ర రూరల్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదిమానవులకు సంబంధించిన హస్తరేఖా చిత్రాలను సోమవారం పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్-దేవరకద్ర మార్గమధ్యలోని పీర్లగుట్టపై ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు జిల్లా పురావస్తు శాఖాధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ శాఖ జూనియర్ అసిస్టెంట్ బాల్‌రాజు, సిబ్బంది అబ్దుల్ హబీబ్‌లు ఆ గుట్ట వద్దకు వెళ్లి పరిశీలించారు. మూడు మీటర్ల పొడవు, మీటరున్నర వెడల్పు కలిగిన పెద్ద రాతిబండపై ఈ హస్త రేఖా చిత్రాలు ఉన్నాయి. 30 నుంచి 34 వరకు ఆదిమానవులు ఈ హస్తరేఖాచిత్రాలు వేసినట్లు భావిస్తున్నారు. వాటిని కొలతలు చేయగా ఒక్కో చిత్రం 17‘17 సెంటిమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. క్రీస్తు పూర్వం 9000-2,500 మధ్య మెథాలతిక్ కాలానికి చెందిన మధ్య రాతి యుగానికి చెందిన రేఖా చిత్రాలుగా గుర్తించి నిర్ధారించినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి హస్తరేఖా చిత్రాలు గతంలో నల్లగొండ జిల్లా రాచకొండ పోర్టులో కూడా బయటపడినట్లు పేర్కొన్నారు. అదే విధంగా అదే గుట్టపై అప్పట్లో ఆదిమానవులు వాడిన మట్టి పాత్రలు కూడా పురావస్తు శాఖాధికారులు గుర్తించి వెంట తీసుకెళ్లారు. -
ఆదిమానవుల పెయింటింగ్స్ గుర్తింపు
మన్యంకొండలో రాతి పనిముట్లు లభ్యం దేవరకద్ర రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్పల్లి సమీపంలోని బయ్యన్నగుట్టపై క్రీస్తుపూర్వం 8-12వేల ఏళ్లనాటి ఆదిమానవుల పెయింటింగ్స్‌ను ఆదివారం గుర్తించారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోని పెయింటింగ్స్, శిల్పకళ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసాచారి వీటిని గుర్తించారు. ఐదు నెలలుగా జిల్లాలోని శిల్పచిత్రాలపై ఆయన పరిశోధన చేస్తున్నారు. అందులోనే భాగంగానే బయ్యన్నగుట్టపై ఆదిమానవులు పెయింటింగ్స్‌ను పరిశీలించారు. అక్కడ బండరాళ్లపై ఆదిమానవులు వేసిన బల్లి, పాము, కమలం పువ్వు, ధనుస్సు, తొండ చిత్రాలు గుర్తించారు. ఈ చిత్రాలు కొత్త రాతియుగంలో వేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ గుహ పక్కనే బండరాయిపై కోనేరు ఉండటంతో అప్పట్లో నీటికి సమీపంలో ఆదిమానవులు నివసించే వారని అంచనాకు వచ్చారు. అలాగే మన్యంకొండ అలివేలు మంగతాయారు దేవస్థానం సమీపంలోని గుట్టపై ఉన్న ఆదిమానవులు పెయింటింగ్ వేసిన చిత్రాలనూ పరిశీలించారు. ఈ చిత్రాలను గతంలో శ్రీశైలం ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ వెలుగులోకి తెచ్చారు. ఆ సమాచారం మేరకే అక్కడికి వెళ్లి ఆ చిత్రాలను కూడా పరిశీలించినట్లు చెప్పారు. అప్పట్లో ఆదిమానవులు వేసిన విత్తనం, మొలకెత్తే విత్తనం, రెండు పాముల కలయిక తో కనబడే చిత్రాలు కూడా ఉన్నాయి. జిల్లాలో ఆదిమానవులకు సంబంధించి అద్భుతమైన శిల్పసంపద ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసాచారి పేర్కొన్నారు. -
ఆదిమానవుల అద్భుత కాన్వాస్
తుర్కపల్లిలో వెలుగుచూసిన 4 వేల ఏళ్లనాటి రాతి చిత్రాలు వేట, జంతు స్వారీ, వ్యవసాయం సహా ఎన్నో అంశాలు అనేక ఇతివృత్తాలతో గుహలో 20కి పైగా దృశ్యాలు సాక్షి, హైదరాబాద్: అదో కాన్వాస్.. ఓ చోట బలిష్టమైన ఎద్దు.. ఆ పక్కనే గాండ్రిస్తున్న పులి.. మరోచోట గుర్రం లాంటి జంతువుపై మనిషి స్వారీ.. ఇంకోచోట చేతిలో మాంసం ఖండాన్ని పట్టుకుని వేటలోని విజయాన్ని ఆస్వాదిస్తున్న వ్యక్తి! ఎనిమిదడుగుల వెడల్పు, ఆరడుగుల పొడవున్న రాయిపై అద్భుతంగా మలచిన ఈ చిత్రాలు తాజాగా హైదరాబాద్‌లోని శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామ శివారులో బయటపడ్డాయి. వీటి వయసు దాదాపు నాలుగు వేల ఏళ్లు. మధ్యప్రదేశ్‌లోని భీంబెట్కాలో ఆదిమానవుల కాలం నాటి అరుదైన రాతి చిత్రాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆ తరహా చిత్రాలు వరంగల్ జిల్లా పాండవుల గుట్టలో బయటపడ్డాయి. ఆ తర్వాత ఇలాంటి చిత్ర సమూహాలు దొరికన ప్రాంతాలు అరుదు. తాజాగా తుర్కపల్లి శివారులో 15 అడుగుల ఎత్తున్న రెండు గండ శిలల మధ్య ఉన్న గుహలోని పడగరాయిపై 20కి పైగా చిత్రాలు వెలుగుచూశాయి. వ్యవసాయం, వేట, నాటి మానవ మనుగడను ప్రతిబింబించేలా విభిన్న అంశాలను ఒకేచోట చిత్రించారు. ఇవన్నీ పక్కపక్కనే ఉండటంతో ఓ కాన్వాస్‌ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. జంతువులు, మనుషులే కాకుండా అంతుపట్టని ఆకృతులకు రూపమిచ్చారు. జంతువులపై స్వారీ చేయటం అప్పటికే మొదలైందనటానికి ఈ చిత్రాలే నిదర్శనం. గుర్రాన్ని పోలిన జంతువుపై మనిషి కూర్చున్న చిత్రం కూడా ఇందులో ఉంది. ఇప్పటివరకు గుర్తించని పురావస్తు శాఖ రాజధాని శివారులోనే ఉన్నా.. దీన్ని ఇప్పటివరకు రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తించ లేకపోయింది. అప్పట్లో పురావస్తు శాఖ మాజీ డెరైక్టర్ కృష్ణశాస్త్రి దశాబ్దాల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఇలాంటి ఎన్నో గుహలను గుర్తించారు. ఆ తర్వాత కొందరు ఔత్సాహికులు రెండు, మూడు ప్రాంతాలను గుర్తించగలిగారు. తాజాగా తెలంగాణ జాగృతికి అనుబంధంగా పనిచేస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళీకృష్ణ... ఔత్సాహికులైన ప్రభాకర్, కరుణాకర్, శ్రీధర్, గోపాల్ సాయంతో తుర్కపల్లిలో రాక్ పెయింటింగ్‌ను వెలుగులోకి తెచ్చారు. అరుదైన ఇలాంటి ఆదిమానవుల ఆనవాళ్లు కాలగర్భంలో కలసిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు.