పాలమూరులో ఆదిమానవుల హస్తరేఖా చిత్రాలు
పురావస్తుశాఖ పరిశోధనలో లభించిన ఆనవాళ్లు
దేవరకద్ర రూరల్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదిమానవులకు సంబంధించిన హస్తరేఖా చిత్రాలను సోమవారం పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్-దేవరకద్ర మార్గమధ్యలోని పీర్లగుట్టపై ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు జిల్లా పురావస్తు శాఖాధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ శాఖ జూనియర్ అసిస్టెంట్ బాల్‌రాజు, సిబ్బంది అబ్దుల్ హబీబ్‌లు ఆ గుట్ట వద్దకు వెళ్లి పరిశీలించారు.
మూడు మీటర్ల పొడవు, మీటరున్నర వెడల్పు కలిగిన పెద్ద రాతిబండపై ఈ హస్త రేఖా చిత్రాలు ఉన్నాయి. 30 నుంచి 34 వరకు ఆదిమానవులు ఈ హస్తరేఖాచిత్రాలు వేసినట్లు భావిస్తున్నారు. వాటిని కొలతలు చేయగా ఒక్కో చిత్రం 17‘17 సెంటిమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. క్రీస్తు పూర్వం 9000-2,500 మధ్య మెథాలతిక్ కాలానికి చెందిన మధ్య రాతి యుగానికి చెందిన రేఖా చిత్రాలుగా గుర్తించి నిర్ధారించినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
ఇలాంటి హస్తరేఖా చిత్రాలు గతంలో నల్లగొండ జిల్లా రాచకొండ పోర్టులో కూడా బయటపడినట్లు పేర్కొన్నారు. అదే విధంగా అదే గుట్టపై అప్పట్లో ఆదిమానవులు వాడిన మట్టి పాత్రలు కూడా పురావస్తు శాఖాధికారులు గుర్తించి వెంట తీసుకెళ్లారు.