ఆ చిత్రాలకు  ‘రంగు’ పడింది! | Prehistoric humans used colors to paint drawings | Sakshi
Sakshi News home page

ఆ చిత్రాలకు  ‘రంగు’ పడింది!

Sep 24 2017 1:05 AM | Updated on Sep 24 2017 1:07 AM

Prehistoric humans used colors to paint drawings

వేల ఏళ్ల కింద ఆది మానవులు గుహల్లో, తమ ఆవాసాల్లోని రాళ్లపై చిత్రించిన బొమ్మలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. సాధారణంగా మనం ఇప్పుడు వాడే రంగులు కొంచెం నీరు తగలగానే, కొంతకాలం కాగానే వెలిసిపోతాయి. కానీ ఆది మానవులు గీసిన చిత్రాలు మాత్రం ఇంకా నిలిచి ఉన్నాయి. ఎండకు ఎండి, వానకు నాని, వేల ఏళ్లుగా నిలిచి ఉన్న ఆ చిత్రాలకు వాడిన రంగులు, ఉపయోగించిన పద్ధతులు ఏమిటో తెలుసా..? ఇనుప ఖనిజం అధికంగా ఉండే హెమటైట్‌ రాయి. దీని పొడికి వివిధ పదార్థాలు కలిపి ఆది మానవులు చిత్రాలు వేసినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, ఫోరెన్సిక్‌ నిపుణుడు జ్ఞానేశ్వర్‌ తాజాగా నిర్ధారించారు.     – సాక్షి, హైదరాబాద్‌
 

కొత్త రాతియుగం నుంచే రంగులు 
పాత రాతియుగం కాలంలో ఆది మానవుల చిత్రాల్లో రంగులు కనిపించవు. మొనదేలిన రాళ్లతో బండరాళ్లపై లోతుగా చెక్కి చిత్రాలకు ఆకృతి ఇచ్చేవారు. వాటిని పెట్రోగోలైవ్స్‌గా పేర్కొంటారు. అలాగే రాళ్లతో గీతలు గీసి (రాక్‌ బ్రూజింగ్స్‌) కూడా బొమ్మలు వేసేవారు. మధ్య రాతియుగం చివరికి వచ్చేసరికి రంగులు అద్దడం మొదలైంది.

ఆ సమయంలోనివారు పెట్రోగ్‌లైవ్స్‌లో రంగులు వేయడం మొదలుపెట్టారు. వేల ఏళ్ల కింద చిత్రించిన పెట్రోగ్లైవ్స్‌లోనూ.. కొన్ని వందల ఏళ్ల తర్వాత రంగులద్దినట్టు పరిశోధకులు గుర్తించారు. ఖమ్మం జిల్లా రామచంద్రాపురం, పూర్వపు మెదక్‌ జిల్లా రత్నాపూర్‌లలో ఇలా పెట్రోగ్‌లైవ్స్, వాటిలో రంగులు వేసిన తీరు కనిపిస్తాయి.


వేల ఏళ్లుగా నిలిచే ఉన్నాయి 
ఆది మానవులు వేల ఏళ్ల కింద రాళ్లపై చిత్రించిన బొమ్మలు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అసలేమాత్రం పరిజ్ఞానం లేని కాలంలో.. ఎరుపు, నలుపు రంగుల్లో ఆ చిత్రాలను ఎలా గీశారు, ఆ రంగుల కోసం వాడిన పదార్థాలేమిటన్న దానిపై మన దేశంలో ఇప్పటివరకు శాస్త్రీయ నిర్ధారణ జరగలేదు. ఒకటి రెండు చోట్ల మినహా పెద్దగా పరిశోధన కూడా జరగలేదు. కానీ కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆ దిశగా అడుగు వేసింది. ఖమ్మం జిల్లా రామచంద్రాపురం, మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి, వర్గల్‌లలోని ఆది మానవుల గుహల్లోని చిత్రాలపై పరిశోధన చేసి.. ఆ రంగులు ఏమిటనేది గుర్తించింది. 


అది హెమటైట్‌..
పీఠభూముల ప్రాంతాల్లో సహజంగానే ఎరుపు రంగులో ఉండే ఇనుము రాయి కనిపిస్తుంటుంది. అందులో హెమటైట్‌ అనే ఖనిజం ఉంటుంది. ఈ ఖనిజాన్నే ఆది మానవులు రంగు తయారీలో వినియోగించారని పరిశోధనలో గుర్తించారు. ఈ ఎరుపు రాయిని పొడి చేసి, అందులో జంతువుల కొవ్వు కలిపి ఎరుపు రంగును తయారు చేశారని నిర్ధారించారు. తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా చిత్రాలున్నందున ఈ ప్రాంతంలో అప్పట్లో ఈ రంగును విస్తారంగా వినియోగించినట్టు భావిస్తున్నారు.

ఇక చిత్రాల్లో ముదురు రంగు వచ్చేందుకు హెమటైట్‌ పొడితోపాటు జంతువుల రక్తాన్ని కలిపి బొమ్మలు గీసిన తీరును గతంలోనే పరిశోధకులు గుర్తించారు. కొన్నిచోట్ల మూత్రం కలిపినట్టు కూడా తేలింది. వీటితోపాటు నలుపు రంగు కోసం హెమటైట్‌ పొడి, కొవ్వుతోపాటు రాక్షసబొగ్గు పొడిని కలిపి వాడారని తాజాగా నిర్ధారించారు. రాష్ట్రంలో తాము చేసిన పరిశోధనకు సంబంధించిన అధ్యయన పత్రాన్ని పుణెలో అక్టోబర్‌ 26 నుంచి జరగనున్న రాక్‌ ఆర్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా సదస్సులో సమర్పించనున్నట్టు హరగోపాల్‌ తెలిపారు.


పరిశోధన ఇలా.. 

ఆది మానవుల చిత్రాల్లోని రంగుల రహస్యాలు తేల్చాలంటే.. ఆ రంగు ఉన్న భాగాన్ని సేకరించాల్సి ఉంటుంది. అలా చేస్తే చిత్రాలను ధ్వంసం చేసినట్టేనని రాక్‌ ఆర్ట్‌ సొసైటీ నిబంధనలున్నాయి. దీంతో రంగుల్లో ఉన్న పదార్థమేమిటో నిర్ధారించేందుకు ‘రామన్‌ స్పెక్ట్రా’పరీక్షను ఎంచుకున్నారు.

ఈ పరికరం ఏదైనా వస్తువు లేదా ఉపరితలంపై కాంతి కిరణాలను ప్రసరింపజేసి.. అవి ప్రతిఫలించే కాంతి ఆధారంగా అక్కడి రసాయన లక్షణాలను గుర్తిస్తారు. ఈ లక్షణాలను అంతర్జాతీయంగా నిర్ధారించిన అంశాల ఆధారంగా డీకోడ్‌ చేసి.. రసాయనం ఏమిటో తేలుస్తారు. ఆది మానవుల చిత్రాలను దీని సహాయంతో పరీక్షించి.. రంగును హెమటైట్‌గా నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement