Wayanad landslide: ఆరు ప్రాణాలు నిలబెట్టారు | Wayanad Landslide: Kerala Forest Department Rescue Six Tribals, Including Four Children | Sakshi
Sakshi News home page

Wayanad landslide: ఆరు ప్రాణాలు నిలబెట్టారు

Published Sun, Aug 4 2024 4:44 AM | Last Updated on Sun, Aug 4 2024 7:12 PM

Wayanad landslide: Kerala forest department rescue six tribals, including four children

వయనాడ్‌లో కొండ గుహలో చిక్కుకున్న గిరిజన కుటుంబం  

ఐదు రోజులుతిండిలేక నలుగురు చిన్నారులు, తల్లిదండ్రులు విలవిల  

ఎనిమిది గంటలు శ్రమించి రక్షించిన కేరళ అటవీ సిబ్బంది   

వయనాడ్‌:  దట్టమైన అడవిలో అదొక కొండ గుహ.. చుట్టూ చిమ్మచీకటి.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఐదు రోజులపాటు అక్కడే తలదాచుకున్నారు. తాగడానికి వర్షపు నీరు తప్ప తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటించిపోయారు. అటవీ సిబ్బంది 8 గంటలపాటు శ్రమించి ఆ కుటుంబాన్ని రక్షించారు. ఆరుగురి ప్రాణాలను కాపాడారు. కేరళలో వరద బీభత్సానికి సాక్షిగా నిలిచిన వయనాడ్‌ జిల్లాలోని అట్టమల అడవిలో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్‌ తాలూకు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీ సిబ్బందే అసలైన హీరోలంటూ జనం ప్రశంసిస్తున్నారు.

వయనాడ్‌లో పనియా జాతి గిరిజనులు అధికంగా ఉంటారు. ఇతర సామాజికవర్గాలకు దూరంగా జీవిస్తుంటారు. అటవీ ఉత్పత్తులను విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు. అందుకోసం గిరిజన దంపతులు నలుగురు పిల్లలను వెంట తీసుకుని కొండల్లోకి వెళ్లారు. భీకర వర్షం మొదలవడంతో కొండ గుహలో తలదాచుకున్నారు. వర్షం తగ్గకపోవడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో కిందికొచ్చే సాహసం చేయలేకపోయారు. 

ఆహారం కోసం వెతుకుతూ తల్లి ఐదు రోజుల తర్వాత కిందికి రావడంతో అధికారులు గమనించారు. గుహలో నలుగురు పిల్లలు, భర్త ఉన్నారని చెప్పడంతో అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. భారీ వర్షం, అడుగడుగునా రాళ్లు, బురదలో అడుగువేయడమే కష్టమవుతున్నా గుహకు చేరుకున్నారు. ముందుగా ఆకలితో నీరసించిపోయిన చిన్నారుల కడుపు నింపారు. వాళ్లను తాళ్లతో తమ ఒంటికి కట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో కొండపై నుంచి తాళ్ల సాయంతో దిగాల్సి వచి్చంది. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో జనం విపరీతంగా షేర్‌ చేశారు.

350 మందికిపైగా మృతులు!   
వయనాడ్‌ విపత్తు మృతుల సంఖ్య 350 దాటినట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు మాత్రం 218 మంది చనిపోయినట్లు వెల్లడించారు. నిర్వాసితులకు సురక్షిత ప్రాంతంలో టౌన్‌íÙప్‌ ఏర్పాటుచేసి ఇళ్లు కట్టిస్తామని సీఎం పినరయి విజయన్‌ చెప్పారు. ప్రకటించారు.    

మోహన్‌ లాల్‌ రూ.3 కోట్ల విరాళం  
ప్రముఖ సినీ నటుడు మోహన్‌లాల్‌ శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భారత ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా ఉన్న ఆయన 
బాధితులను పరామర్శించారు. సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. వరద విలయానికి నామారూపాల్లేకుండాపోయిన నివాసాలను చూసి చలించిపోయారు. పునరావాస చర్యలకు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement