ఆదిమానవుల పనిముట్లు లభ్యం
చేర్యాల: వరంగల్ జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట మిధునమ్మ చెరువు సమీపంలో ఆది మానవుల కాలం (నవీనయుగం) నాటి పనిముట్లు లభ్యమైనట్లు జౌత్సాహిక చరిత్ర పరిశోధకులు రత్నాకర్‌రెడ్డి తెలిపారు. ఆదిమానవులు రాతి పనిముట్లను తయారు చేసుకున్న గుర్తులను చెరువు సమీపంలో బుధవారం కనుగొన్నారు. ఈ సందర్భంగా రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చెరువు వద్ద ఏనెపై ఇస్త్రి పెట్టెగా పిలిచే రాయికి కుడివైపున12 అడుగుల పొడవైన రాతి శిలపై 50కి పైగా బద్దులు ఉన్నాయని, వీటిని పురావస్తు శాస్త్రంలో కప్యూల్స్ అంటారని తెలిపారు. రాయితో ఆ శిలపై ఎక్కడ కొట్టినా సంగీతం వినిపిస్తోందని, ఏనె నుండి బీరప్ప దేవాలయం మధ్య ఉన్న పంచరాయి భూమిలో ఆది మానవుల ఆవాసాలను గుర్తించామని వివరించారు. రాతి పనిముట్లు, మృణ్మయ పాత్రలు, చికరా రాళ్ల (ఇనుము)ను నాడు వినియోగించారని చెప్పారు. పురావస్తు శాఖ అధికారులు వీటిని పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట కాపుల మఠం బసవేశ్వర్, సిద్దిరాం మఠం వీరయ్య ఉన్నారు.