ఆదిమానవుల అద్భుత కాన్వాస్
తుర్కపల్లిలో వెలుగుచూసిన 4 వేల ఏళ్లనాటి రాతి చిత్రాలు
వేట, జంతు స్వారీ, వ్యవసాయం సహా ఎన్నో అంశాలు
అనేక ఇతివృత్తాలతో గుహలో 20కి పైగా దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: అదో కాన్వాస్.. ఓ చోట బలిష్టమైన ఎద్దు.. ఆ పక్కనే గాండ్రిస్తున్న పులి.. మరోచోట గుర్రం లాంటి జంతువుపై మనిషి స్వారీ.. ఇంకోచోట చేతిలో మాంసం ఖండాన్ని పట్టుకుని వేటలోని విజయాన్ని ఆస్వాదిస్తున్న వ్యక్తి! ఎనిమిదడుగుల వెడల్పు, ఆరడుగుల పొడవున్న రాయిపై అద్భుతంగా మలచిన ఈ చిత్రాలు తాజాగా హైదరాబాద్‌లోని శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామ శివారులో బయటపడ్డాయి. వీటి వయసు దాదాపు నాలుగు వేల ఏళ్లు. మధ్యప్రదేశ్‌లోని భీంబెట్కాలో ఆదిమానవుల కాలం నాటి అరుదైన రాతి చిత్రాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఆ తరహా చిత్రాలు వరంగల్ జిల్లా పాండవుల గుట్టలో బయటపడ్డాయి. ఆ తర్వాత ఇలాంటి చిత్ర సమూహాలు దొరికన ప్రాంతాలు అరుదు. తాజాగా తుర్కపల్లి శివారులో 15 అడుగుల ఎత్తున్న రెండు గండ శిలల మధ్య ఉన్న గుహలోని పడగరాయిపై 20కి పైగా చిత్రాలు వెలుగుచూశాయి. వ్యవసాయం, వేట, నాటి మానవ మనుగడను ప్రతిబింబించేలా విభిన్న అంశాలను ఒకేచోట చిత్రించారు. ఇవన్నీ పక్కపక్కనే ఉండటంతో ఓ కాన్వాస్‌ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. జంతువులు, మనుషులే కాకుండా అంతుపట్టని ఆకృతులకు రూపమిచ్చారు. జంతువులపై స్వారీ చేయటం అప్పటికే మొదలైందనటానికి ఈ చిత్రాలే నిదర్శనం. గుర్రాన్ని పోలిన జంతువుపై మనిషి కూర్చున్న చిత్రం కూడా ఇందులో ఉంది.
ఇప్పటివరకు గుర్తించని పురావస్తు శాఖ
రాజధాని శివారులోనే ఉన్నా.. దీన్ని ఇప్పటివరకు రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తించ లేకపోయింది. అప్పట్లో పురావస్తు శాఖ మాజీ డెరైక్టర్ కృష్ణశాస్త్రి దశాబ్దాల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఇలాంటి ఎన్నో గుహలను గుర్తించారు. ఆ తర్వాత కొందరు ఔత్సాహికులు రెండు, మూడు ప్రాంతాలను గుర్తించగలిగారు. తాజాగా తెలంగాణ జాగృతికి అనుబంధంగా పనిచేస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళీకృష్ణ... ఔత్సాహికులైన ప్రభాకర్, కరుణాకర్, శ్రీధర్, గోపాల్ సాయంతో తుర్కపల్లిలో రాక్ పెయింటింగ్‌ను వెలుగులోకి తెచ్చారు. అరుదైన ఇలాంటి ఆదిమానవుల ఆనవాళ్లు కాలగర్భంలో కలసిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు.