animals ride
-
విమానాశ్రయంలో ఏకంగా 109 జంతువులు కలకలం...షాక్లో అధికారులు
Indian Women Luggage Contain 109 Live Animals: బ్యాంకాక్ విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళలను అరెస్టు చేశారు. ఏకంగా 109 జంతువులను అక్రమంగా తరలించేందుకు యత్నించి పట్టుబడ్డారు. ఈ మేరకు నిత్య రాజీ, జకియా సుల్తాన్ అనే ఇద్దరు మహిళలు రెండు లగేజ్ల్లో జంతువులు తరలించేందుకు యత్నించారు. ఆ మహిళల లగేజ్ల్లో బతికే ఉన్న రెండు తెల్ల పందికొక్కులు, రెండు అర్మడిల్లోలు, 35 తాజేళ్లు , 50 బల్లులు, 20 పాములు కనిపించాయని అధికారులు వెల్లడించారు. ఆ మహిళిద్దరూ విమానంలో చెన్నైకి వెళ్లాల్సి ఉందని చెప్పారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఇటీవల, గత నెలలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు థాయ్లాండ్ నుంచి వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసేందుకు చేసిన రెండు ప్రయత్నాలను అడ్డుకున్నారు కూడా. -
అడవికి ‘రక్షణ’!
స్మగ్లర్లు, వేటగాళ్ల బారి నుంచి అడవులతో పాటు వన్యప్రాణులను కాపాడేందుకు సర్కారు గట్టి చర్యలు చేపట్టింది. వన సంపద సంరక్షణకు పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇకపై పోలీసు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయనున్నారు. సాక్షి, కామారెడ్డి: అడవుల రక్షణకు ఇంతకాలం అటవీ శాఖ అధికారులు మాత్రమే చర్యలు తీసుకునేవారు. అయితే అడవులను నరికివేసి పెద్ద ఎత్తున పోడు వ్యవసాయం చేయడంతో పాటు కలపను అక్రమంగా తరలించడం, వన్యప్రాణుల వేట య«థేచ్ఛగా సాగుతున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖకు పోలీసు శాఖ దన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అడవులు, వన్యప్రాణుల రక్షణకు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ శ్వేత అటవీ, పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, బాన్సువాడ తదితర మండలాల పరిధిలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. అయితే రెండు దశాబ్దాలుగా అడవులను విచ్చలవిడిగా నరికివేస్తూ భూముల్లో పోడు వ్యవసాయ చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు దట్టమైన అడవులుగా గుర్తింపు ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు బయళ్లుగా మారాయి. అడవులు అంతరించిపోతుండడంతో వన్యప్రాణులకు కూడా రక్షణ కరువైంది. దాహం తీర్చుకునేందుకు, తిండి కోసం వన్యప్రాణులు బయటకు రాగానే వేటగాళ్ల ఉచ్చులో చిక్కి బలవుతున్నాయి. అటు అడవులను స్మగ్లర్లు, ఇటు వన్యప్రాణులను వేటగాళ్లు బలిచేస్తుండడంతో సర్కారు రంగంలోకి దిగింది. హరితహారం పేరుతో ఏటా కోట్లాది మొక్కలు నాటుతుంటే మరోవైపు అడవుల నరకివేత పెరగడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అడవులను కాపాడేందుకు అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. దీంతో జిల్లావ్యాప్తంగా అడవుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ శ్వేత ఇటీవల పోలీస్, అటవీ శాఖల అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. పదేపదే కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట కొనసాగిస్తూ పట్టుబడేవారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడానికి వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. సమన్వయంతో సాగితే.. అటవీశాఖ ఉద్యోగులకు ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో స్మగ్లర్లు గతంలో పలుమార్లు దాడులకు తెగబడ్డారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన పలు సంఘటనల్లో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు తీవ్ర గాయాలపాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటవీశాఖ ఉద్యోగులకు ఆయుధాలు సమకూర్చడం, వాటిని నిర్వహించడం ఇబ్బందికర పరిస్థితి కావడంతో ప్రభుత్వం పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. దీంతో కలప అక్రమ నిల్వలపై దాడులు చేసే సమయంలో పోలీసుల సహకారం తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇరు శాఖల అధికారులు, సిబ్బంది కలిసి దాడులు నిర్వహిస్తే స్మగ్లర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పోలీసులంటే ప్రజలకు ఒకింత భయం ఉండడంతో పాటు వారి చేతుల్లో ఆయుధాలు కూడా ఉండడం వల్ల వారిపై దాడులకు దిగడానికి ముందుకు రారు. దీంతో కలప స్మగ్లర్ల ఆటకట్టించడం సులవవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కొత్తగా ఎవరూ అటవీ భూములను ఆక్రమించుకోకుండా అడ్డుకోవడానికి కూడా పోలీసు, అటవీ శాఖల సమన్వయం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది పోలీసులు సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. -
ఆదిమానవుల అద్భుత కాన్వాస్
తుర్కపల్లిలో వెలుగుచూసిన 4 వేల ఏళ్లనాటి రాతి చిత్రాలు వేట, జంతు స్వారీ, వ్యవసాయం సహా ఎన్నో అంశాలు అనేక ఇతివృత్తాలతో గుహలో 20కి పైగా దృశ్యాలు సాక్షి, హైదరాబాద్: అదో కాన్వాస్.. ఓ చోట బలిష్టమైన ఎద్దు.. ఆ పక్కనే గాండ్రిస్తున్న పులి.. మరోచోట గుర్రం లాంటి జంతువుపై మనిషి స్వారీ.. ఇంకోచోట చేతిలో మాంసం ఖండాన్ని పట్టుకుని వేటలోని విజయాన్ని ఆస్వాదిస్తున్న వ్యక్తి! ఎనిమిదడుగుల వెడల్పు, ఆరడుగుల పొడవున్న రాయిపై అద్భుతంగా మలచిన ఈ చిత్రాలు తాజాగా హైదరాబాద్లోని శామీర్పేట మండలం తుర్కపల్లి గ్రామ శివారులో బయటపడ్డాయి. వీటి వయసు దాదాపు నాలుగు వేల ఏళ్లు. మధ్యప్రదేశ్లోని భీంబెట్కాలో ఆదిమానవుల కాలం నాటి అరుదైన రాతి చిత్రాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆ తరహా చిత్రాలు వరంగల్ జిల్లా పాండవుల గుట్టలో బయటపడ్డాయి. ఆ తర్వాత ఇలాంటి చిత్ర సమూహాలు దొరికన ప్రాంతాలు అరుదు. తాజాగా తుర్కపల్లి శివారులో 15 అడుగుల ఎత్తున్న రెండు గండ శిలల మధ్య ఉన్న గుహలోని పడగరాయిపై 20కి పైగా చిత్రాలు వెలుగుచూశాయి. వ్యవసాయం, వేట, నాటి మానవ మనుగడను ప్రతిబింబించేలా విభిన్న అంశాలను ఒకేచోట చిత్రించారు. ఇవన్నీ పక్కపక్కనే ఉండటంతో ఓ కాన్వాస్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. జంతువులు, మనుషులే కాకుండా అంతుపట్టని ఆకృతులకు రూపమిచ్చారు. జంతువులపై స్వారీ చేయటం అప్పటికే మొదలైందనటానికి ఈ చిత్రాలే నిదర్శనం. గుర్రాన్ని పోలిన జంతువుపై మనిషి కూర్చున్న చిత్రం కూడా ఇందులో ఉంది. ఇప్పటివరకు గుర్తించని పురావస్తు శాఖ రాజధాని శివారులోనే ఉన్నా.. దీన్ని ఇప్పటివరకు రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తించ లేకపోయింది. అప్పట్లో పురావస్తు శాఖ మాజీ డెరైక్టర్ కృష్ణశాస్త్రి దశాబ్దాల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఇలాంటి ఎన్నో గుహలను గుర్తించారు. ఆ తర్వాత కొందరు ఔత్సాహికులు రెండు, మూడు ప్రాంతాలను గుర్తించగలిగారు. తాజాగా తెలంగాణ జాగృతికి అనుబంధంగా పనిచేస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళీకృష్ణ... ఔత్సాహికులైన ప్రభాకర్, కరుణాకర్, శ్రీధర్, గోపాల్ సాయంతో తుర్కపల్లిలో రాక్ పెయింటింగ్ను వెలుగులోకి తెచ్చారు. అరుదైన ఇలాంటి ఆదిమానవుల ఆనవాళ్లు కాలగర్భంలో కలసిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు.