stone arts
-
బయటపడ్డ పదో శతాబ్దం నాటి శిల్పాలు..ఎలా ఉన్నాయో తెలుసా?
సాక్షి, నార్సింగి(తూప్రాన్): మెదక్‌జిల్లా నార్సింగి మండల కేంద్రశివారులో శైవవీరగల్లు వీరుల రాతి శిల్పాలు గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ అన్నారు. నార్సింగి శివారులో రెండోరోజు పర్యటనలో భాగంగా గురువారం గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద రాష్ట్ర కూటుల కాలం నాటివిగా భావించే రాతిపై చెక్కిన శిల్పాలను గుర్తించామన్నారు. మూడు రకాల వీరగల్లుల శిల్పాలు ఉండగా, వాటిలో కత్తిని చేబట్టి చేతిలో ఫలం పట్టుకున్న ఆత్మాహుతి వీరగల్లు శిల్పం ముఖ్యమైందన్నారు. 10వ శతాబ్దానికి చెందిన ఈ శిల్పాలు పెద్ద పెద్ద మీసాలతో భయంగొలిపే ముఖంతో ఉన్నాయని తెలిపారు. శిల్పాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి పుస్తక రూపంలో ప్రచురిస్తామని చెప్పారు. క్షేత్ర పరిశోధనలో ఫొటోగ్రాఫర్ కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పరడ ‘బుద్ధుడి’పై క్వారీ పడగ!
సాక్షి, హైదరాబాద్: అదో పెద్ద గుట్ట.. దానిపై మూడో శతాబ్దం నాటి వృత్తాకార నిర్మాణం... మట్టిదిబ్బలో కూరు కుపోయి కొన్ని ఇటుకలు కనిపిస్తున్నాయి. వాననీటి ప్రవా హానికి కొట్టుకుపోకుండా దానికి ఆధారంగా గుట్ట అంచున రాతి నిర్మాణం.. వాటి దిగువన ముచుళింద శిల్పం... ఇవన్నీ బౌద్ధ స్తూప ఆనవాళ్లు. ఈ గుట్టపై ఉన్న నిర్మాణాలూ ఇది బౌద్ధస్తూపమనే దానిని రూఢీ చేస్తున్నా యి. అదే నిజమైతే... రాష్ట్రంలో బౌద్ధం జాడలున్నాయనే వాదన మరింత బలోపేతమవుతుంది. ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేసేందుకు ప్రచారం చేసిన బావరి రాష్ట్రానికి చెందినవాడేనని ఇప్పటికే ఆధారాలు వెలుగు చూడటం, విదేశీ బౌద్ధ సన్యాసులనూ అబ్బురపరిచే స్తూపాలు, చైత్యాల జాడలిక్కడ ఉండటం ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు దోహదం చేస్తున్నాయి. అంతటి ప్రాధాన్యమున్న ఈ ప్రాంతం కొద్ది రోజుల్లో కాలగర్భంలో కలిసిపోబోతోంది. ఆ నిర్మాణం బౌద్ధ స్తూపమా.. కాదా.. అన్నది వెలుగు చూడకుండానే అదృశ్యం కాబోతోంది. క్వారీ పనులతో గుట్టను గుటుక్కుమనేందుకు కొందరు శరవేగంగా ముందుకు కదులుతుండటమే దానికి కారణం. చరిత్ర బృందం పరిశోధన...: నల్లగొండ జిల్లా కట్టం గూరు మండలం పరడ గ్రామ శివారులో ఓ గుట్ట ఉంది. దానిపైన పురాతన శివుడి గుడి ఉండటంతో దాన్ని శివుని గుట్ట అని పిలుస్తారు. ఆలయానికి ఉత్తరాన మట్టి దిబ్బ ఉంది. దాన్ని ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళి, రాంప్రసాద్, చంటి çపరిశీలించారు. దిబ్బలో 25 అడుగుల వ్యాసంతో వృత్తా కార నిర్మాణం ఉన్నట్టు గుర్తించారు. దానికి వాడిన భారీ ఇటుకలను పరిశీలిస్తే అవి 2, 3 శతాబ్దాలకు చెందినవిగా తెలుస్తోంది. అంటే శాతవాహనుల కాలంనాటి నిర్మాణాలని ప్రాథమికంగా రూఢీ అయింది. అక్కడే 8 అంగుళాల ఎత్తున నాగ ముచుళింద శిల్పం కనిపించింది. దానిపై స్వస్తిశ్రీ మనుమధ నామ సంవత్సర... అన్న పొడి అక్షరా లున్నాయి. వెరసి ఇది బౌద్ధ స్తూపాన్ని పోలినట్టు స్పష్టమ వుతోంది. బుద్ధుడికి జ్ఞానోదయమైన సమయంలో ఎడతె రిపి లేకుండా 7 రోజులు భారీ వర్షాలు కురిస్తే నాగరాజైన ముచుళిందుడు పాతాళం నుంచి వచ్చి తన పడగ నీడతో రక్షణ కల్పించాడని పురాణగాథ. అందుకే బౌద్ధ స్తూపాలు న్న చోట నాగ ముచుళింద విగ్రహాలు కనిపిస్తాయి. చుట్టూ చెట్లు, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. దిబ్బను తవ్వితే లోపలి నిర్మాణంపై స్పష్టత వస్తుంది. కానీ, ఇప్పటికీ పురావస్తు శాఖ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఈలోపు కొందరు దాన్ని క్వారీగా మార్చి గుట్టను పిండి చేయటం మొదలు పెట్టారు. ఇప్పటికే కొంతవరకు అది నాశనమైంది. మిగతాది అదృశ్యం కాకుండా ప్రభుత్వం కాపాడాలంటూ స్థానికులు ఇప్పటికే కలెక్టర్‌కు పిటిషన్ దాఖలు చేశారు. పురావస్తు శాఖ స్పందించి దానిపై స్పష్టతనిచ్చి పరిరక్షించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. -
ఆదిమానవుల అద్భుత కాన్వాస్
తుర్కపల్లిలో వెలుగుచూసిన 4 వేల ఏళ్లనాటి రాతి చిత్రాలు వేట, జంతు స్వారీ, వ్యవసాయం సహా ఎన్నో అంశాలు అనేక ఇతివృత్తాలతో గుహలో 20కి పైగా దృశ్యాలు సాక్షి, హైదరాబాద్: అదో కాన్వాస్.. ఓ చోట బలిష్టమైన ఎద్దు.. ఆ పక్కనే గాండ్రిస్తున్న పులి.. మరోచోట గుర్రం లాంటి జంతువుపై మనిషి స్వారీ.. ఇంకోచోట చేతిలో మాంసం ఖండాన్ని పట్టుకుని వేటలోని విజయాన్ని ఆస్వాదిస్తున్న వ్యక్తి! ఎనిమిదడుగుల వెడల్పు, ఆరడుగుల పొడవున్న రాయిపై అద్భుతంగా మలచిన ఈ చిత్రాలు తాజాగా హైదరాబాద్‌లోని శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామ శివారులో బయటపడ్డాయి. వీటి వయసు దాదాపు నాలుగు వేల ఏళ్లు. మధ్యప్రదేశ్‌లోని భీంబెట్కాలో ఆదిమానవుల కాలం నాటి అరుదైన రాతి చిత్రాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆ తరహా చిత్రాలు వరంగల్ జిల్లా పాండవుల గుట్టలో బయటపడ్డాయి. ఆ తర్వాత ఇలాంటి చిత్ర సమూహాలు దొరికన ప్రాంతాలు అరుదు. తాజాగా తుర్కపల్లి శివారులో 15 అడుగుల ఎత్తున్న రెండు గండ శిలల మధ్య ఉన్న గుహలోని పడగరాయిపై 20కి పైగా చిత్రాలు వెలుగుచూశాయి. వ్యవసాయం, వేట, నాటి మానవ మనుగడను ప్రతిబింబించేలా విభిన్న అంశాలను ఒకేచోట చిత్రించారు. ఇవన్నీ పక్కపక్కనే ఉండటంతో ఓ కాన్వాస్‌ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. జంతువులు, మనుషులే కాకుండా అంతుపట్టని ఆకృతులకు రూపమిచ్చారు. జంతువులపై స్వారీ చేయటం అప్పటికే మొదలైందనటానికి ఈ చిత్రాలే నిదర్శనం. గుర్రాన్ని పోలిన జంతువుపై మనిషి కూర్చున్న చిత్రం కూడా ఇందులో ఉంది. ఇప్పటివరకు గుర్తించని పురావస్తు శాఖ రాజధాని శివారులోనే ఉన్నా.. దీన్ని ఇప్పటివరకు రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తించ లేకపోయింది. అప్పట్లో పురావస్తు శాఖ మాజీ డెరైక్టర్ కృష్ణశాస్త్రి దశాబ్దాల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఇలాంటి ఎన్నో గుహలను గుర్తించారు. ఆ తర్వాత కొందరు ఔత్సాహికులు రెండు, మూడు ప్రాంతాలను గుర్తించగలిగారు. తాజాగా తెలంగాణ జాగృతికి అనుబంధంగా పనిచేస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళీకృష్ణ... ఔత్సాహికులైన ప్రభాకర్, కరుణాకర్, శ్రీధర్, గోపాల్ సాయంతో తుర్కపల్లిలో రాక్ పెయింటింగ్‌ను వెలుగులోకి తెచ్చారు. అరుదైన ఇలాంటి ఆదిమానవుల ఆనవాళ్లు కాలగర్భంలో కలసిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు.