పరడ ‘బుద్ధుడి’పై క్వారీ పడగ! | Satavahana period bricks in Round Shape | Sakshi
Sakshi News home page

పరడ ‘బుద్ధుడి’పై క్వారీ పడగ!

Published Thu, Jun 21 2018 1:23 AM | Last Updated on Thu, Jun 21 2018 1:23 AM

Satavahana period bricks in Round Shape - Sakshi

పరడలో లభ్యమైన బౌద్ధనాగ ముచుళింద విగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: అదో పెద్ద గుట్ట.. దానిపై మూడో శతాబ్దం నాటి వృత్తాకార నిర్మాణం... మట్టిదిబ్బలో కూరు కుపోయి కొన్ని ఇటుకలు కనిపిస్తున్నాయి. వాననీటి ప్రవా హానికి కొట్టుకుపోకుండా దానికి ఆధారంగా గుట్ట అంచున రాతి నిర్మాణం.. వాటి దిగువన ముచుళింద శిల్పం... ఇవన్నీ బౌద్ధ స్తూప ఆనవాళ్లు. ఈ గుట్టపై ఉన్న నిర్మాణాలూ ఇది బౌద్ధస్తూపమనే దానిని రూఢీ చేస్తున్నా యి. అదే నిజమైతే... రాష్ట్రంలో బౌద్ధం జాడలున్నాయనే వాదన మరింత బలోపేతమవుతుంది. ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేసేందుకు ప్రచారం చేసిన బావరి  రాష్ట్రానికి చెందినవాడేనని ఇప్పటికే ఆధారాలు వెలుగు చూడటం, విదేశీ బౌద్ధ సన్యాసులనూ అబ్బురపరిచే స్తూపాలు, చైత్యాల జాడలిక్కడ ఉండటం ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు దోహదం చేస్తున్నాయి. అంతటి ప్రాధాన్యమున్న ఈ ప్రాంతం  కొద్ది రోజుల్లో కాలగర్భంలో కలిసిపోబోతోంది. ఆ నిర్మాణం బౌద్ధ స్తూపమా.. కాదా.. అన్నది వెలుగు చూడకుండానే అదృశ్యం కాబోతోంది. క్వారీ పనులతో గుట్టను గుటుక్కుమనేందుకు కొందరు శరవేగంగా ముందుకు కదులుతుండటమే దానికి కారణం.

చరిత్ర బృందం పరిశోధన...: నల్లగొండ జిల్లా కట్టం గూరు మండలం పరడ గ్రామ శివారులో ఓ గుట్ట ఉంది. దానిపైన పురాతన శివుడి గుడి ఉండటంతో దాన్ని శివుని గుట్ట అని పిలుస్తారు. ఆలయానికి ఉత్తరాన మట్టి దిబ్బ ఉంది. దాన్ని ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళి, రాంప్రసాద్, చంటి çపరిశీలించారు. దిబ్బలో 25 అడుగుల వ్యాసంతో వృత్తా కార నిర్మాణం ఉన్నట్టు గుర్తించారు. దానికి వాడిన భారీ ఇటుకలను పరిశీలిస్తే అవి 2, 3 శతాబ్దాలకు చెందినవిగా తెలుస్తోంది. అంటే శాతవాహనుల కాలంనాటి నిర్మాణాలని ప్రాథమికంగా రూఢీ అయింది. అక్కడే 8 అంగుళాల ఎత్తున నాగ ముచుళింద శిల్పం కనిపించింది. దానిపై స్వస్తిశ్రీ మనుమధ నామ సంవత్సర... అన్న పొడి అక్షరా లున్నాయి.

వెరసి ఇది బౌద్ధ స్తూపాన్ని పోలినట్టు స్పష్టమ వుతోంది. బుద్ధుడికి జ్ఞానోదయమైన సమయంలో ఎడతె రిపి లేకుండా 7 రోజులు భారీ వర్షాలు కురిస్తే నాగరాజైన ముచుళిందుడు పాతాళం నుంచి వచ్చి తన పడగ నీడతో రక్షణ కల్పించాడని పురాణగాథ. అందుకే బౌద్ధ స్తూపాలు న్న చోట నాగ ముచుళింద విగ్రహాలు కనిపిస్తాయి. చుట్టూ చెట్లు, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. దిబ్బను తవ్వితే లోపలి నిర్మాణంపై స్పష్టత వస్తుంది. కానీ, ఇప్పటికీ పురావస్తు శాఖ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఈలోపు కొందరు దాన్ని క్వారీగా మార్చి గుట్టను పిండి చేయటం మొదలు పెట్టారు. ఇప్పటికే కొంతవరకు అది నాశనమైంది. మిగతాది అదృశ్యం కాకుండా ప్రభుత్వం కాపాడాలంటూ స్థానికులు ఇప్పటికే కలెక్టర్‌కు పిటిషన్‌ దాఖలు చేశారు. పురావస్తు శాఖ స్పందించి దానిపై స్పష్టతనిచ్చి పరిరక్షించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement