శాసనస్తంభాన్ని పరిశీలిస్తున్న చరిత్ర పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి, హెరిటేజ్ ఆర్కిటెక్టు శ్రీలేఖ
సాక్షి,హైదరాబాద్: రాతిఫలకలపై చెక్కిన శాసనాలు చాలా కన్పిస్తాయి..కానీ, శాసనం కోసం ఇలా 23 అడుగుల ఎత్తైన స్తంభాన్ని ఏర్పాటు చేసిన అరుదైన ఘట్టం కళ్యాణ చాళుక్యుల కాలంలో జరిగింది. ఈ స్తంభానికి 898 ఏళ్లు. ఈ స్తంభం భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి ఆరు కి.మీ.దూరంలో ఉన్న కొలునుపాక ఊబదిబ్బపై ఉంది.
ఆరో విక్రమాదిత్యుని కుమారుడు సోమేశ్వరుని కీర్తి కోసం స్థానిక అంబర తిలకమనే జైనబసది భోగానికి (భోజన సదుపాయం) పానుపురాయి గ్రామాన్ని సర్వబాధా పరిహారంగా దానం ఇచ్చిన సందర్భంలో 1125లో వేయించిన శాసనంగా తెలుస్తోంది.
నాలుగు వైపులా కన్నడ భాషలో...
స్తంభం నలువైపులా 151 పంక్తులతో కన్నడంలో శాసనం చెక్కి ఉంది. నాటి చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ప్రతిబింబంగా ఉన్న ఈ శాసనం ప్రస్తుతం ఒకవైపు వంగిపోతూ కూలిపోయే స్థితికి చేరుకుంది. చుట్టూ ముళ్లపొదలు, బురదతో నిండి అడుగుతీసి అడుగు వేయాలంటేనే కష్టంగా మారిందని, ఆ శాసనాన్ని పరిశీలించిన చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా దానికి సమీపంలోని కొన్ని ప్రాంతాలను పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. అందులో కొలనుపాక సోమేశ్వరాలయం కూడా ఒకటి. ఆలయానికి చేరువగానే ఉన్న ఈ శాసన మూలస్తంభాన్ని హెరిటేజ్ ఆర్కిటెక్టు శ్రీలేఖతో కలిసి పరిశీలించారు. కుమార సోమేశ్వరుడు, త్రికలింగాధిపతిని, ద్రావిడ దేశాధిపతిని జయించాడని, అతని దండనాయకుడైన స్వామిదేవుడు హరి, హర, జిన, బుద్ధ అనే చతుస్సమయాలను ప్రోత్సహించాడన్న విషయాలు శాసనంలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ అరుదైన శాసన స్తంభాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొలనుపాకకు వచ్చే పర్యాటకులు ఈ శాసనస్తంభాన్ని చూసేలా ఏర్పాట్లు చేసి దాన్ని ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment