ఆటవిక యుగం మధ్య దశలో మనుషులు అరణ్యాలలో, కొండ గుహలలో నివసించేవారు. ఇళ్ళు కట్టుకోవడం అప్పటికి ఇంకా తెలియదు. వారిది గుంపు జీవితం. పదుల సంఖ్యలో ఉండే జనాభా చిన్న చిన్న గుంపులుగా జీవించేవారు. ఏ గుంపు ఆచారాలు దానివే. ఏ గుంపు నమ్మకాలు దానివే. ఇదంతా చరిత్ర. ఇక మన చుట్టూ జరుగుతున్న విషయాలను కొన్ని చిత్రాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. మరి లక్ష సంవత్సరాల క్రితం చిత్రాలు ఎలా ఉండేవి?
చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్ గుహలోని చిత్రాలు లక్ష సంవత్సరాల క్రితం వేసినట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. టూల్ టోపోలాజీ ఆధారంగా.. ఈ ప్రదేశంలో చారిత్రక ఆనవాళ్లను గుర్తించినట్లు వివరించారు. పర్యావరణవేత్త సునీల్ హర్సనా వన్యప్రాణులు, వృక్షసంపదపై ఆరావళీ కొండల్లో వివిధ అంశాలను సునీల్ హర్సనా డాక్యుమెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి గుహలలోని కళను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో గుర్తించిన ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గుహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అలా ఈ చిత్రాలు పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి.
కాగా ఈ ఏడాది మే నెలలో పర్యావరణవేత్త సునీల్ హర్సానా… మంగర్ బని అటవీప్రాంతంలోని గుహలో ఈ చిత్రాలను గుర్తించారు. జూన్ నుంచి హర్యానా పురావస్తు శాఖ అధికారులు వీటిపై పరిశోధనలు జరిపారు. పురావస్తు శాఖ ఫరీదాబాద్‌లోని శిలాఖరి, మంగర్, కోట్, ధౌజ్ ప్రాంతాలలో, గుర్గావ్‌లోని రోజ్ కా గుజ్జర్, దమ్దామా వంటి ప్రదేశాలలో పరిశోధనలు నిర్వహించారు. ఇక అక్కడ రాతి యుగంలో వాడిన కొన్ని సాధనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మంగర్ బని అడవికి రక్షణ
దీనిపై హర్యానా ప్రధాన కార్యదర్శి అశోక్ ఖేమ్కా మాట్లాడుతూ.. పాలియోలిథిక్ యుగానికి చెందిన పురాతన గుహ చిత్రాలు, సాధనాలు పెద్ద సంఖ్యలో ఉన్నందున చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల రక్షణ చట్టం 1964 ప్రకారం.. మంగర్ బని అడవికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల హర్యానాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఆరావళీ పర్వత శ్రేణిలోని గుహలలోని కొన్ని చిత్రాలను కూడా గుర్తించారు. ఇందులో మనుషుల బొమ్మలు, జంతువులు, ఆకులు, రేఖాగణిత చిత్రాలు ఉన్నాయి. ఇవి 40,000 సంవత్సరాల క్రితానికి (ఎగువ పాలియోలిథిక్ యుగం) చెందినవని, సుమారు 10,000 సంవత్సరాల క్రితం వరకు వర్థిల్లినట్లు తెలిపారు.
@AshokKhemka_IAS Principal Secretary to govt archaeology dept Haryana said: "We will be giving MangarBani forest protection under Punjab Ancient & Historical Monuments & Archaeological Sites & Remains Act, 1964 because of presence of large number of stone age cave paintings." pic.twitter.com/IUN5AVzF31
— Aravalli Bachao (@AravalliBachao) July 15, 2021
Comments
Please login to add a commentAdd a comment