గోరఖ్‌పూర్ కోర్టు కార్యాలయ గోడకు వేసిన పెయింటింగ్
లక్నో : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వస్థలం గోరఖ్‌పూర్. జిల్లా న్యాయస్థానం, ఐజీ కార్యాలయాలు ఉన్న రోడ్లు ఎప్పుడూ జనసందోహంతో బిజీగా ఉంటాయి. కాస్త దూరంలో టాయ్‌లెట్‌లు ఉన్నా.. దారినపోయే కొందరు మాత్రం అదే పనిగా ఆ గోడలకే మూత్ర విసర్జన చేస్తుండేవారు. ఎన్ని చర్యలు తీసుకున్నా, చివరకు పోలీస్ కాపలాను ఉంచిన నివారించలేకపోయారు.
తరచూ ఈ గోడల వద్ద కొందరు చెత్త చెదారం వేయటం.. మూత్ర విసర్జన చేసేవారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు లేడీకానిస్టేబుళ్లను మోహరించినా ప్రయత్నం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆలోచన చేశారు. వెంటనే ముంబైకి చెందిన బత్వల్ అనే చిత్రకారుడికి కబురు పెట్టారు. మూత్ర విసర్జన నివారణకు కోసం ఆ గోడలపై దేవుడి బొమ్మలను చిత్రీకరించాలని అతన్ని కోరారు.
దేవుళ్లు, ఇతర మతాలకు సంబంధించిన చిత్రాలు, రామాయంలోని ఘట్టాలు, ప్రముఖుల ఫోటోలతో బత్వల్ గోడలపై అందమైన పెయింటింగ్‌లు వేశాడు. ‘‘దేవుళ్లు చూస్తున్నారు.. మీ చెండాలం ఆపండి’’... అంటూ కొటేషన్లు రాసేశారు. ఈ ఆలోచన బాగా పని చేసింది. ప్రస్తుతం వాటి చుట్టు పక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటంతోపాటు ఆయా గోడల వద్ద సెల్ఫీల కోసం జనాలు ఎగబడిపోతున్నారని గోరఖ్‌పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెబుతున్నారు.
ఇలా బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నివారించటం కోసం చేసే యత్నం సాధారణమైన అంశమే. కానీ, యూపీ సీఎం స్వస్థలంలోనే స్వచ్ఛ భారత్ విఫలం అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తగా.. స్వయంగా యోగి ఆదిత్యానాథ్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. గత ఆరు నెలలుగా మున్సిపల్ అధికారులకు ఆయన అదే పనిగా ఆదేశాలు జారీ చేస్తుండటంతో.. ఏం చేయాలో తెలీక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు ఓ సామాజిక వేత్త సాయంతో ఐజీ మోహిత్ ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment